– కూటమి సర్కారుకు మందకృష్ణ మాదిగ వినతి
గుంటూరు: ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబునాయుడును కోరారు. ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలును వేగవంతం చేయాలని కోరారు.
నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని మంత్రి నారా లోకేశ్ చెప్పారని, అందుకే ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని కోరుతున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో 2006లో ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చిందని, తమిళనాడు ప్రభుత్వం 2009లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంత వరకూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.