జగన్ వ్యాఖ్యలకు సుజనా చౌదరి కౌంటర్
విజయవాడ: అమరావతి అంశంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు. “ఏ గన్ తీసుకొచ్చినా అమరావతిని మాత్రం తాకలేరు” అని స్పష్టం చేశారు.
జగన్ ఇటీవల “మావి గన్” అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అది కేవలం డైవర్షన్ రాజకీయాల కోసమే అన్న అనుమానం వ్యక్తం చేశారు. “ఆ రోజు చెప్పాను… ఈరోజు కూడా చెబుతున్నా… ఎవరు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు” అని పేర్కొన్నారు.
అమరావతి అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరని, రాజధాని ప్రాంతంలో పదో వంతు భూమినైనా ఎవరూ ముట్టుకోలేరని ఆయన స్పష్టం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు రాజకీయంగా నష్టమే కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు.
జగన్కు సరైన సలహాదారులు లేకపోవచ్చని అనిపిస్తోందని, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసినా, “ఏ గన్ వచ్చినా అమరావతి అభివృద్ధి ఆగదు” అని సుజనా చౌదరి తేల్చిచెప్పారు.
ప్రజాస్వామ్యంలో కుల, మతాలకు అతీతంగా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. అమరావతి విషయంలో తాను చేసినది సహాయం కాదని, బాధ్యతగా తీసుకుని పని చేశానని పేర్కొన్నారు.
రాజధాని అమరావతి అంశంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ క్రమంలో రామోజీ రావు కూడా సహకారం అందించారని గుర్తుచేశారు. అమరావతిపై తప్పుడు ప్రచారాలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి పలు భాషల్లో పుస్తకాలు ప్రచురించి పంపిణీ చేసినట్లు చెప్పారు.
రాజధాని కోసం భారీ భూసేకరణపై వ్యక్తిగతంగా అభ్యంతరం ఉన్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటు సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు ఇచ్చాయని, కేంద్ర స్థాయిలో అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ వంటి నాయకులు సహకరించారని తెలిపారు.
రాజధాని అనేది కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, అభివృద్ధికి దిక్సూచి కావాలని, న్యూయార్క్ వంటి నగరాల మాదిరిగా ‘గ్రోత్ ఇంజిన్’గా ఎదగాలని అభిప్రాయపడ్డారు. ఆ లక్ష్యంతోనే అమరావతికి పునాది వేశారని చెప్పారు.
రైతుల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి, న్యాయస్థానాల్లో పోరాడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఫాలి నారిమన్ వంటి న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ అంశంలో సహకరించారని చెప్పారు.
అమరావతి అభివృద్ధి విషయంలో రాజకీయ విద్వేషాలు తగవని, ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
భవిష్యత్ తరాలకు అమరావతిని న్యూయార్క్, సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేయవచ్చని, అందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అనవసర ఆందోళనలకు దూరంగా ఉండాలని సూచించారు.