– చిన్న నల్ల మచ్చ శరీరంపై గుర్తిస్తే వైద్యులను వెంటనే సంప్రదించాలి
– వర్షాకాలంలో చిగ్గర్ మైట్ (కీటకం) ప్రభావం ఎక్కువ
– ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ అందుబాటులో ఉన్న మందులు
– లక్షణాల ఆధారంగా డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలతో ప్రథమ చికిత్స
– పరిసరాలు శుభ్రంగా ఉండాలి
– చేతులు, కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి
– అధికారులతో సమీక్షించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి : స్క్రబ్ టైఫస్ జ్వరాల వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సాధారణ జ్వరాల్లో ఇదొకటని పేర్కొన్నారు. జ్వరం వచ్చి మూడురోజుల వరకు తగ్గకుంటే రక్త పరీక్షల ద్వారా మలేరియా, డెంగీ లాంటి జ్వరాల మాదిరిగానే స్క్రబ్-టైఫస్ ను కూడా గుర్తిస్తారని తెలిపారు. అలాగే, చిన్న నల్ల మచ్చ(దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్ గా అనుమానించవచ్చునని తెలిపారు.
కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చునని చెప్పారు. జ్వరాలకు గురైన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు కొన్ని స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయని చెప్పారు. మరణాలు ఇంతవరకు నమోదుకాలేదని పేర్కొన్నారు. స్క్రబ్-టైపస్ జ్వరాల కేసుల నమోదు, తీసుకోవల్సిన చర్యలపై మంత్రి సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులపై అధికారులు మంత్రి సత్యకుమార్ కు వివరించారు. ఈ జ్వరాలకు ఉపయోగించే మందులు ఉప ఆరోగ్య కేంద్రాల్లో (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జ్వరాల లక్షణాలు, చికిత్స, అనుసరించాల్సిన ఇతర పద్ధతులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు పంపినట్లు కార్యదర్శి మంత్రికి వివరించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఓ పత్రికా ప్రకటన జారీచేసింది.
వర్షాకాలంలో ఈ జ్వరాలు ఎక్కువ
ఈ కేసులు ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జ్వరాలు అధికంగా నమోదవుతున్నాయి 2023లో 579, 2024లో 803 కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు 736 స్క్రబ్ టైపస్ కేసులు గుర్తించారు. కాకినాడ, చిత్తూరు, విశాఖ, కడప, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, ఏలూరు, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్ (149 నుంచి ఒకటి మధ్య) జిల్లాల్లో కేసులు రికార్డయ్యాయి.
కీటకంకుట్టిన చోట
కీటకం కుట్టినచోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటే జ్వరం, తలనొప్పితోపాటు శరీరంపై కీటకం కుట్టిన చోట మాత్రమే నల్ల మచ్చ ఏర్పడుతుంది. వీటితోపాటు కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్-టైపస్ కింద అనుమానించాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిన చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ఈ క్రమంలో దానిలో ఉండే లాలాజలం (ఓరియెంటియా తుత్సుగముషి అనే బ్యాక్టీరియా) రక్తంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులను మనుషులను కుడుతుంటాయి.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి
ఆయా వ్యక్తులకు ఇతర జబ్బులు ఉన్నట్లయితే.. దీని ప్రభావం ఇంకాస్త ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం కనిపిస్తోంది. జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి మందులను వాడాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. పీహెచ్సీ, ఇతర ఆసుపత్రుల వైద్యుల సిఫార్సు మేరకు వచ్చిన రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను బోధనాసుపత్రులు, జిల్లా పబ్లిక్ హెల్త్ లేబరేటరీల్లో పరీక్షిస్తున్నారు.
పీహెచ్సీ వైద్యులకు అవగాహన
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరమా? కాదా? అని రోగులను పరీక్షించి, నిర్ధారిస్తున్నారు జ్వరం తగ్గకుండా ఉంటే… రోగి లక్షణాలు అనుసరించి తదుపరి పరీక్షలు (స్క్రబ్ టైపస్ వంటి) పరీక్షల కోసం వైద్యులు సిఫార్సు చేస్తారు. స్క్రబ్ టైఫస్ జ్వరాల విషయంలో ట్రీటుమెంటుపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై జిల్లా అధికారుల ద్వారా పీహెచ్సీ వైద్యులకు సూచనలు వెళ్లాయి.
ప్రథమ చికిత్స కింద డాక్సిసైకిలిన్, అజిత్రోమైసిన్ మాత్రలు
స్క్రబ్-టైఫస్ బారినపడిన జ్వర పీడితులకు ప్రధానంగా ఇచ్చే డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలు ఉప ఆరోగ్య కేంద్రాల్లో (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్) అందుబాటులోనే ఉన్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలు
పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి
పొలం పనులకు వెళ్లే వారు రబ్బరుతో తయారుచేసే షూలు ధరిస్తే మంచిది. దీనివల్ల పాము కాటుల నుంచి కూడా రక్షణ పొందొచ్చు. పాత మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం మంచిది.
నివాసం ఉండేచోట ఎలుకలు సంచరించకుండా చూసుకోవాలి. నేలపై నిద్రించే సమయంలో దుప్పట్లు ఉపయోగించాలి.
1899లో తొలిసారిగా జపాన్ లో గుర్తింపు
స్క్రబ్ టైఫస్ 1899లో తొలిసారిగా జపాన్ లో గుర్తించారు. 1930 నుంచి భారత్ లో ఈ జ్వరాల కేసులు నమోదవుతూ వచ్చాయి. రాష్ట్రంలో దీని ప్రభావం తక్కువగా ఉంది. 2021 నుంచి ఐడీఎస్పీ (ఇంటిగ్రేటెడ్ డీసిజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం) పోర్టల్ పని చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కేసులు నమోదుచేస్తున్నారు.