– ఎన్టీఆర్ స్ఫూర్తి ఆశీస్సులతో నా రాజకీయం
*చంద్రబాబుని అరెస్ట్ చేస్తే తొలుత ఖండించింది నేనే
*కమ్మవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
*అన్ని సంఘాలతో సమైక్య సమావేశం నిర్వహించండి
*కమ్మ పిసిసి ప్రధాన కార్యదర్శి , ఉపాధ్యక్షులకు సన్మానం
*కమ్మ సంఘాల సమాఖ్య సమావేశంలో మంత్రి తుమ్మల
హైదరాబాద్:సమాజ శ్రేయస్సుకు,ప్రజలకు ప్రభుత్వాలకు మంచి జరగాలని లక్ష్యంతో సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కమ్మ జాతిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా బండి రమేష్, పిసిసి ఉపాధ్యక్షుడిగా పృథ్వి చౌదరి ఎన్నికైన సందర్భంగా శనివారం హైదరాబాదులో కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల ప్రసంగించారు. నందమూరి తారకరామారావు స్ఫూర్తి, దయ, ఆశీస్సులతో రాజకీయాలకు వచ్చానని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఎక్కడా కూడా కమ్మ జాతి గౌరవం తగ్గకుండా గౌరవం కోసమే నిస్వార్ధంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.కమ్మ వారి చరిత్ర చెరిపేస్తే చరిగిపోదన్నారు. కాకతీయ రాజ్యం పతనం తరువాత ఓరుగల్లు కోటపై విజయ పతాకం ఎగురవేసిన ముసునూరు కాపయ నాయకుడు కమ్మ చక్రవర్తి అన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంకు రూపకల్పన చేసిన రాజా వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ కమ్మ వారి వైభవానికి ప్రతీక అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రగతికి బాటలు వేసింది ఎన్ టీ ఆర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అరెస్ట్ ను తొలుత ఖండించింది తానేనన్నారు. రాజకీయంగా కమ్మవారు తెలంగాణలో ఐక్యంగా ఉండాలన్నారు. సమాజ సేవ కోసం కమ్మ సంఘాలు అనునిత్యం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
అందరూ సంఘటితం కావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. కమ్మ జాతీ అన్ని రంగాలలో ఆదర్శంగా, గౌరవప్రదంగా, అగ్రభాగాన ఉందన్నారు. 1985లో ఉగాది రోజున అమీర్పేట కమ్మ సంఘం భవనానికి శంకుస్థాపనకు 60 మంది కమ్మ ప్రజా ప్రతినిధులు ఉంటే ఎవరు రాలేదని, తాను ఒక్కడినే నిర్భయంగా వెళ్ళానని మంత్రి పేర్కొన్నారు.
మనకు గౌరవం ఆత్మ అభిమానం తీసుకువచ్చిన ఎన్టీ రామారావు వారసులం మనం అన్నారు. గౌరవం ఇచ్చినచోట ఎలా ఉండాలో.. ఇవ్వనీచోట ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళం అన్నారు. సరైన సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలా నిర్ణయం తీసుకుందామని, కర్ణాటక కానీ ఆంధ్రా కానీ ప్రజలకు సమాజానికి మంచి జరగాలనే నిర్ణయం తీసుకుందామన్నారు.
మన నిజాయితీ సేవాభావం నిర్భీతి మనకు గౌరవం తీసుకొస్తుందని మనకు ఎవరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ల అవసరానికి మనల్ని గౌరవించి తర్వాత అవమానించే వాళ్ళు గౌరవం మనకు అవసరం లేదన్నారు. కమ్మ జాతిని అణగదొక్కే శక్తి ఎవరికీ లేదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
కమ్మ సంఘాలు అన్నిటినీ ఏకతాటిపై తీసుకురావాలని … త్వరలో సమాఖ్యల మీటింగు కు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిలవాలని మంత్రి తుమ్మల సూచించారు. సమాఖ్య అభ్యున్నతికి అందరు ఐక్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.