– ఆ నిజమే మాసాయిపేటలో మరోమారు బహిర్గతం కాబోతోంది
పంజాబులోని మోగా జిల్లాకేంద్రం. ఆరోజుల్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. పంజాబీలకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేకదేశం కావాలనే కొంతమంది అతివాదులకు పాకిస్తాన్ అండదండలందించడం మొదలెట్టింది.
తాము ఎంత ప్రయత్నిస్తున్నా , పంజాబీలలో తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదే అనే ఆలోచన ఖలిస్తానీ తీవ్రవాదులకు కలిగింది.దీనికి కారణం ఆరెస్సెస్ అన్న నిర్ణయానికి వచ్చారు. ఆరెస్సెస్ కు సరైన గుణపాఠం చెప్పాలనుకున్నారు.
మోగా లో అదొక పబ్లిక్ పార్కు. అందులో ఓ మూలన సంఘ శాఖ ప్రతిరోజూ జరుగుతుంది. ఉదయపు నడక కోసం నగరంలోని చాలామంది ఆ పార్కుకు ప్రతిరోజూ వస్తారు. వాళ్ళంతా సంఘశాఖలో జరుగుతుండే కార్యక్రమాలను గమనిస్తుంటారు. ఒక రోజు శాఖ జరుగుతోంది. అంతలో అనుమానాస్పద వ్యక్తులు శాఖ వైపు రావడాన్ని సంఘచాలకులైన రామావతార్ చూశారు. వెంటనే ఆయన స్వయంసేవకులను హెచ్చరిస్తూ, ఒకరిమీద ఒకరు పడుకోమని అరిచారు.
ఒక సంఘ ప్రచారక్ అందరికన్నా పైన పడుకోబోతుంటే, ఆయనను వారించి ఆయన మీద వీరు పడుకున్నారు. అనుమానాస్పదులుగా వచ్చినవారు ఖలిస్తానీ తీవ్రవాదులు. వారిచేతుల్లోని తపాకులతో కాల్పులు మొదలెట్టారు. ఆ సంఘటనలో రామావతార్ తోసహా దాదాపు 25 మంది తరుణ, బాల స్వయంసేవకులు చనిపోయారు. ఖలిస్తానీ తీవ్రవాదులు , ఇక ఇక్కడ సంఘశాఖ జరగదని, రాష్ట్రమంతటా ఆరెస్సెస్ వర్గాలలో భయం కలుగుతుందని భావించి వెళ్ళిపోయారు.
అయితే జరిగింది వేరు. మరునాడు అదే పార్కులో అదే స్థలంలో సంఘశాఖ , నిన్న ఏమీ జరగలేదన్నట్లుగా మొదలైంది. నిన్నటికన్నా ఎక్కువ సంఖ్యతో జరిగింది. పార్కులో ఉదయపు నడకకు వచ్చేవారి సంఖ్య తగ్గిందికానీ సంఘశాఖలో సంఖ్య తగ్గలేదు.ఖలిస్తానీ తీవ్రవాదుల కోరిక తీరలేదు.
నిన్నటి రోజున స్వయంసేవకుల శరీరాలనుండి కారిన నెత్తురు ఇంకా ఆరలేదు. కానీ భారత్ మాతాకీ జై అనే నినాదం నలుదిశలా వ్యాపించింది. 1989 లో ఈ సంఘటన జరిగింది.
2025 జులై 30 న తెలంగాణలోని యాదాద్రి జిల్లా మాసాయిపేట గ్రామంలో జరిగే సంఘశాఖ వద్దకు కొందరు ఆకతాయిలు వచ్చి, ఇక్కడ సంఘశాఖ జరగరాదని చెప్పివెళ్ళారు. అయినా సరే సంఘ స్వయంసేవకులు భయపడలేదు.మరునాడు సమయానికే సంఘశాఖ జరిగింది. భవిష్యత్తులోనూ జరుగుతుంది.
ఆనాడు అంతమంది చనిపోతేనే స్వయంసేవకుల ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు. రెట్టించిన ఉత్సాహంతో రెట్టింపు సంఖ్యతో శాఖ మరునాడే అదేచోట జరిగింది.
మోగాలోని సంఘస్థాన్ లో ఏం జరిగిందో , మాసాయిపేట సంఘస్థాన్ లోనూ సంఘశాఖ ద్విగుణీకృతసంఖ్యతో జరగడం ఖాయం.
ఆరెస్సెస్ ను ఆపగల శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు.
ఆ నిజమే మాసాయిపేటలో మరోమారు బహిర్గతం కాబోతోంది.
– జగన్