తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములే
ఎవరిని, ఎప్పుడు, ఏ విధంగా గుర్తించాలన్నది సీఎంకి తెలుసు
పార్టీ నిర్ణయమే అంతిమం… శిరోధార్యం
పార్టీ కోసం… అంతా కలిసి కట్టుగా కష్టపడి పని చేయాలి
అందరినీ కాపాడుకునే బాధ్యత నాది
మెడికల్ కాలేజీ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తల సమక్షంలోనే స్టేషన్ ఘన్‌పూర్, జనగామ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు
అంతా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళే! తెలంగాణ ఉద్యమంలో, పునర్ నిర్మాణంలో పాలు పంచుకున్నవాళ్ళే. పార్టీకి ఎవరూ తక్కువ కాదు. ఎక్కువ కాదు. అంతా సమానమే. అయితే ఎవరి సేవలు ఎలా తీసుకోవాలి. ఎవరిని, ఎప్పుడు, ఏ విధంగా గుర్తించాలన్నది సీఎంకి బాగా తెలుసు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు.
అంతకుముందు సభలో కడియం శ్రీహరి, డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారి అనుచరులు సభలో హంగామా చేశారు. నినాదాలు ఇచ్చారు. కేరింతలు కొట్టారు. బల నిరూపణ తరహాలో ప్రవర్తించారు. దీంతో ఎర్రబెల్లి తాను మాట్లాడే సమయంలో వారికి గట్టి సమాధానం చెప్పారు. వేదిక మీద ఉన్న నేతలకు సైతం చురకలు అంటించారు.
పార్టీ నిర్ణయమే అంతిమం… శిరోధార్యం. ఎంతటి వారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఏ బాధ్యత ఇచ్చినా, పార్టీ కోసం… అంతా కలిసి కట్టుగా కష్టపడి పని చేయాలి. అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అంతేగాక కడియం అనుభవజ్ఞులు, రాజయ్య త్యాగశీలి… ముత్తిరెడ్డి ఉద్యమకారుడు… వీళ్ళందరినీ నేను కాపాడుకుంటాను. పార్టీకి చెప్పి, సిఎం కెసిఆర్ కి చెప్పి రక్షించుకుంటాను. అని భరోసా ఇచ్చారు.