-ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
‘‘చలో విజయవాడ’’ విజయవంతమైందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులు స్వచ్చందంగా తరలి వచ్చారన్నారు. విజయవాడ చరిత్రలో ఇటువంటి ఉద్యమం ఎప్పుడు చూడలేదని తెలిపారు. కొందరు ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రభుత్వం సమస్య గుర్తిస్తుందని ఊహించామని… నిన్న అంత పెద్ద ఆందోళన చూసి కూడా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహారిస్తోందని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీల వాళ్ళు ఎవ్వరూ నిన్న ఆందోళనలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాసి విలువలు పోగొట్టుకోవద్దని కోరారు. రేపు సెలవు కావడంతో నేడే సచివాలయంలో పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. సీఎస్ వ్యాఖ్యలపై స్టీరింగ్ కమిటీలో చర్చిస్తామన్నారు. ఒత్తిడి తీసుకురాకుండా ఘర్షణ వాతావరణం రాకుండా పోలీసులు వ్యవహరించారని తెలిపారు. ‘‘పోలీసులు మాకు తమ సహకారాన్ని అందించారు అనేది అబద్ధం. పోలీసులు చాలా ప్రాంతాల్లో ఉద్యోగులను విజయవాడ రాకుండా అడ్డుకున్నారు’’ అని అన్నారు. ఉద్యోగుల మేలు కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటూ ఎవ్వరు మద్దతు ఇచ్చినా మంచిదే అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.