– కూటమి సర్కారుపై సిపిఎం సభ్యుడు బాబురావు విమర్శ
విజయవాడ: భారీ వర్షాలతో బుడమేరులో నీటి ప్రవాహం పెరిగింది.. గత సంవత్సరం బుడమేరు వరదలతో ఇబ్బందులు పడిన లక్షల మంది ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్. బాబురావు అన్నారు. ప్రభుత్వం, అధికారుల నుండి సరైన సమాచారం లేక వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం వరద ప్రాంతాల్లో పర్యటించి, మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.
మరోసారి బుడమేరు వరద వచ్చి సంవత్సర గడిచినా ముంపు నివారణ శాశ్వత చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ముంపు నివారణకు శాశ్వత చర్యలకు నిధులు మంజూరు చేయలేదు, టెండర్లు పిలవలేదని ఆరోపించారు. చెరువు కట్టలు తెగిన కొన్నిచోట్ల మరమ్మతులు చేసి చేతులు దులుపుకొన్నారు.
ముంపు నివారణకు ఏడు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని అడిగినా, పైసా విడుదల చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి కేటాయింపులు చేయలేదు. ముందు చూపుతో వ్యవహరించాల్సిన పాలకులు ప్రచార ఆర్భాటంతో సరిపెడుతున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు, ప్రజలు ఎన్నో సూచనలు చేసినా వాటిని పట్టించుకోవడం లేదు. బుడమేరు వరదలలో దెబ్బతిన్న ప్రజలకు సహాయం సంపూర్ణంగా అందజేయలేదు, శాశ్వత చర్యలు తీసుకోలేదని బాబురావు విమర్శించారు.