-సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిద్దాం
-శాసన వ్యవస్థతో అవస్థ ఎందుకని న్యాయ వ్యవస్థ అనుకుంటే నో ప్రాబ్లం
-ఎంపీ రఘురామకృష్ణంరాజు
లక్షలాది మందితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు, అమరావతి రైతుల పాదయాత్ర కు ఎందుకనీ నర్సాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 29 వేల మంది రైతు కుటుంబాలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సామూహికంగా దైవదర్శనానికి వెళ్లే అవకాశం కూడా లేదా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, అమరావతి రైతులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ కూడా… ఓ వ్యవస్థేనా అంటూ నిలదీశారు. అమరావతి రైతులకు రక్షణ కల్పించడానికి అవస్థ పడుతున్న న్యాయ వ్యవస్థ ఒకవైపు, అన్యాయం చేయాలని చూస్తున్న శాసన వ్యవస్థ మరొకవైపని విమర్శించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
శాసన వ్యవస్థతో అవస్థ ఎందుకనీ న్యాయవ్యవస్థ అనుకుని హ్యాండ్సప్ అన్న నో ప్రాబ్లమన్నారు . ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి, న్యాయాన్ని సాధించుకుందామని అమరావతి రైతులకు భరోసానిచ్చారు. మంత్రులు నోటికొచ్చినట్లు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖను రాజధానిగా ఎవరు అడ్డుకోలేరన్న మంత్రుల వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు లేవని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గతంలో ఇదే న్యాయమూర్తి, జస్టిస్ ఎన్ వి రమణ కంటెంట్ కేసును గతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించానని చెప్పి, స్వీకరించలేదని గుర్తు చేశారు. ప్రస్తుత పిటీషన్ లోను జగన్మోహన్ రెడ్డి రెస్పాండెంట్ గా ఉన్నారని తెలిపారు. తనకు తెలిసిన న్యాయ సూత్రాల ప్రకారం, పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు లేవన్న ఆయన, బెంచ్ మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
రాక్షసులే అసూయపడే రాక్షసుల నడుమ ఉన్నాం
రాక్షసులే తనకంటే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని అసూయపడే రాక్షసుల మధ్య మనం ఉన్నామని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాక్షసుల కంటే ఎక్కువ ఎలా హింసించవచ్చునో రాష్ట్రంలోని
పోలీసు వ్యవస్థను శాసిస్తున్న కొంతమంది అధికారులను చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఎన్నో మార్లు చివాట్లు పెట్టిందని, ఇప్పుడు సిఐడి పోలీసులను సైతం కోర్టు చివాట్లు పెడుతున్న వారికి దున్నపోతు పై వర్షం పడుతున్నట్టు గా కూడా లేదన్నారు . సిఐడి పోలీసులు ఇచ్చిన నోటీసును పసిగట్టిన హైకోర్టు న్యాయమూర్తి … బాధితుని చేతనే నేరంగీకారాన్ని చెప్పించి శిక్ష వేయమంటారా? అని ప్రశ్నించారన్నారు.
శుక్రవారం కాగానే ఎవడిని అరెస్టు చేసి చితక బాదలి అన్నట్లుగా సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు . సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష సమావేశంలో ప్రశంసలను పొందడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివాట్లను అలవాట్లుగా మార్చుకున్న అధికారులను ఆ పదవుల్లోంచి తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయమూర్తులను ప్రజలు కోరుతున్నారని, ప్రజాభిప్రాయాన్ని ఒక ప్రజా ప్రతినిధిగా తాను తెలియజేస్తున్నానని రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు.
క్రిమినల్ లాలోని ప్రాథమిక సూత్రాలు గురించి తెలియకుండానే., కొంతమంది ఐపీఎస్ అధికారులుగా ఎలా చలామణి అవుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలని ఎద్దేవా చేశారు. ఐపిసి, సి ఆర్ పి సి సెక్షన్లు తెలియకుండానే విధులను నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ వారికి పరీక్షలను నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. 41a నోటీసులను అసంబద్ధంగా ఇచ్చిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. నోటీసులు కూడా సరిగ్గా ఇవ్వడం చేతకాని వీళ్ళా…మన అధికారులు అంటూ ప్రశ్నించారు. అధికారులుగా కొనసాగే అర్హత వారికి ఉందా? అంటూ నిలదీసిన అయన, మెజిస్ట్రేట్ లు సంబంధిత అధికారులను ప్రశ్నించాలని కోరారు . రాష్ట్రం పోలీసుల అరాచక పాలన కొనసాగుతుందన్న ఆయన, ఈ అరాచకాలను ప్రోత్సహిస్తున్న వారి పాలనలో మనకు రక్షణ ఎక్కడుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు గ్రామాలను విడిచి పారిపోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ పరిస్థితి ఇలాగ ఉంటే… సామాన్యులకు దిక్కెవరు?
రాష్ట్రంలో ఒక ఎంపీ కే ఇబ్బందులు తప్పక పోతే , ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తనకు ఢిల్లీలో ఇల్లు ఉండి , ఇక్కడ ఎన్నో పనులు ఉండడంవల్ల ఢిల్లీలో నివసిస్తున్నానని తెలిపారు. సామాన్యుల పరిస్థితి ఏమిటని?, వారు ఎక్కడ తలదాచుకోగలరని నిలదీశారు.
కాపులను బీసీల్లో చేర్చాలి… అప్పుడు రెడ్లు కూడా బీసీలు కావచ్చు
కాపులను బీసీలలో చేర్చాలన్న డిమాండ్ సహితుకమైనదని రఘురామకృష్ణం రాజు అన్నారు. రెడ్ల కుల ధ్రువీకరణ పత్రము లోను కాపు అనే ఉంటుందనిగుర్తు చేశారు. కాపులను బీసీలలో చేర్చినప్పుడు, రెడ్లు కూడా బీసీలవుతారన్న ఆయన, మనం అప్పుడు బీసీలకు న్యాయం చేసినట్లు అవుతుందని అపహాస్యం చేశారు. తమది బీసీ ప్రభుత్వ మట…, 136 బీసీ జాతులను ఏకం చేసిన పార్టీ అట అంటూ ఎద్దేవా చేశారు.
బీసీలంతా తమ పార్టీకి మద్దతునివ్వాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన 151 మంది ఎమ్మెల్యేలలో 50 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లను రఘురామకృష్ణంరాజు చదివి వినిపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి, జెడ్పి చైర్మన్ పదవి వరకు 1, 116 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు పదవులలో కొనసాగుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు పదవులలో 83 శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారన్న ఆయన, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లలో 83%, సెర్చ్ కమిటీలలో 75% మంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే నన్నారు. 136 బీసీ కులాలనురాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఏకం చేయాలని చూస్తుంటే, తమ ప్రభుత్వం కులాల వారిగా విడదీసి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. బీసీలను ఉపముఖ్యమంత్రులుగా నియమించినప్పటికీ వారికి అధికారాలు ఏవి లేవన్నారు. ఇక తమ పార్టీ ప్రాంతీయ ఇన్చార్జిలు పాల్గొనే కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు ఎందుకు హాజరవుతున్నారు అంటూ ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఉన్న కిందిస్థాయి అధికారులను తీసుకువచ్చి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో నియమించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ సెక్రెటరీ కి తాను మూడు నెలల క్రితం లేఖ రాశానని, దానికి వారు స్పందించారని తెలిపారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరినట్లుగా తెలియజేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన జూనియర్ అధికారులను తప్పించి, ఆయా విభాగాల అధిపతులుగా ఐఏఎస్ అధికారుల నియమిస్తారో, లేకపోతే నాలుక కర్చుకొని తక్కువ మందిని తెచ్చుకున్నామని మరో పదిమంది తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులను దిగుమతి చేసుకుంటారేమో చూడాలి అన్నారు.
ఆర్జీవి వ్యూహం చిత్రాన్ని తీస్తే… గండ్రగొడ్డలి, కోడి కత్తి సినిమాలను తీసే అవకాశం
దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తీస్తే, ఇతరులు గండ్రగొడ్డలి, కోడి కత్తి అనే సినిమాలను తీసే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. వ్యూహం చిత్రం ఎన్నికలకు ముందే రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న ఆయన, వ్యూహం హితవుతుందా?, గండ్రగొడ్డలి, కోడి కత్తి చిత్రాలు హిట్ అవుతాయా? అన్నది చూడాలన్నారు. ఇక మహాత్మా గాంధీ పై ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు.