ఈ రైళ్లలో 22 నుంచి 26 బోగీలు
వచ్చే ఏడాది నుంచి పేదల కోసం నాన్ ఏసీ సాధారణ రైళ్లను నడపాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. వలస కార్మికులు, కూలీల కోసం వీటిని క్రమం తప్పకుండా నడపాలనుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇటువంటి రైళ్లు పండగల సీజనులో, వేసవి వంటి ప్రత్యేక సందర్భాల్లో నడుపుతామని, ఇక నుంచీ ఏడాది పొడవునా నడపాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. స్వల్ప ఆదాయం ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి అత్యధిక ప్రయాణాలు నమోదవుతున్నాయని అధ్యయనంలో తేలిందని వివరించారు.
వలస కార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు రైళ్ల అవసరం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ రైళ్లను నడిపే అవకాశముందని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో జనరల్, స్లీపర్ కోచ్‌లే ఉంటాయని, ఏసీ ఉండదని తెలిపారు.
ఈ రైళ్లను ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, దిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో నడపనున్నట్లు వివరించారు. ఈ రైళ్లలో 22 నుంచి 26 బోగీలుంటాయని పేర్కొన్నారు.
ఇవి సాధారణ రైళ్లలాగే నడుస్తాయని, ముందస్తు రిజర్వేషన్లను అనుమతిస్తామని తెలిపారు. భవిష్యత్తులో రైళ్లలో ఎల్‌హెచ్‌బీ, వందే భారత్ బోగీలే ఉంటాయని వివరించారు. ప్రస్తుతం రైల్వేలో 28 రకాల బోగీలున్నాయి.