వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న మార్పు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి మద్దతు ఇవ్వాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. మండలంలోని సతివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇంత మార్పు ఏ విధంగా వచ్చిందో మీకు తెలియజెప్పాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. మీ గ్రామంలో ఉన్న పాఠశాలను చూడండి. అదేవిధంగా ఇక్కడ చోటు చేసుకున్న పాలన సంబంధ మార్పులను గమనించండి. గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితులు మారేయి. మీరు వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. అధికారులే మీ దగ్గరకు వచ్చేశారు. పరిపాలన మీ దగ్గరకు వచ్చేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పాలన మరింత స్థానికం అయింది. ఒకప్పటిలా కాకుండా మీరంతా ఇప్పుడు మరింత సులువుగా ప్రభుత్వ సంబంధ పనులు పూర్తి చేయించుకోవచ్చు. అధికారులంతా గ్రామాల్లోనే అందుబాటులో ఉన్నారు. వారంతా మీ చెంతకు వచ్చి పనిచేస్తున్నారు.
సచివాలయాల రాక కారణంగానే ఇదంతా సాధ్యం అయింది. ఇవాళ సంక్షేమ పథకాల అమలు అన్నది కూడా గౌరవంగా అందుకుంటున్నారు. ఎవరికో తలొగ్గి, పథకాల విషయమై వారి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, మధ్య వర్తుల ప్రమేయం లేకుండా ఇవాళ పథకాలు అన్నీ బీద వర్గాలకు, ఇంకా ఇతర అర్హులయిన వర్గాలకు అందుతున్నాయి. పింఛను సరిగా అందుతున్నా నెలకు రెండు వేల 750 రూపాయలు పింఛను రూపంలో నెలలో ఒకటో తారీఖున అందుతుంది అంటే ఇదంతా మార్పు. ఇదంతా అందకపోతే ఈ 9 కోట్ల రూపాయలూ ఈ మూడున్నరేళ్లలో అందకపోతే ఎలా ఉండేవారమో ఆలోచించండి.
ఇవాళ మీరంతా ఇంత సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం సంక్షేమ పథకాలు పకడ్బంధీగా, అవినీతికి తావు లేకుండా అమలు అవుతుండడమే ! ఇందులో అనుమానం లేనే లేదు. అదేవిధంగా ఏడాదికి అమ్మ ఒడి పేరిట కొంత డబ్బు అందుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళల రుణాలు ఆ రోజు చంద్రబాబు తీరుస్తానని మాట ఇచ్చి తప్పారు. కానీ జగన్ మాత్రం నాలుగు విడతల్లో చెల్లిస్తానని చెప్పి, ఇప్పటికే మూడు వాయిదాలు చెల్లించారు కూడా ! ఇంకొక్క వాయిదా ఉంది అది కూడా చెల్లించేస్తారు. మళ్లీ మీరు బ్యాంకు మెట్లు ఎక్కేందుకు అవకాశం వస్తుంది.
ఎన్ని మార్పులు జరిగాయి చూశారా ? ఇవాళ అవినీతి లేదు. పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. మన పాఠశాలలో మార్పులు వచ్చాయి. ఇవన్నీ జగన్ సీఎం కావడం వల్లనే సాధ్యం అయింది. ఎంచుకున్న ప్రభుత్వాల కారణంగానే మంచి పాలన అందివస్తుంది. అందుకు తార్కాణమే ఇప్పటి పాలన. వచ్చే ఏడాది వేసవి నుంచి వంశధార నీళ్లు అందనున్నాయి. మండుటెండలో కూడా మీకు వంశధార నీళ్లు అందుతాయి. 900 బెడ్లతో రిమ్స్ ను అభివృద్ధి చేశాం. ఇప్పుడు మీరంతా ఒక్కసారి రిమ్స్ కు వెళ్లి చూడండి. ఓ ప్రయివేటు ఆస్పత్రికి దీటుగా రిమ్స్ ను రూపుదిద్దించాం. వరి సాగు కన్నా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి. శెనగ, మొక్కజొన్న, మిరప, పెసర, మినుము వంటి పంటలపై దృష్టి సారించండి. వీటిపై మీరు వ్యవసాయ అధికారులతో మాట్లాడండి. ఏది మంచి ప్రభుత్వమో ఆలోచించేందుకు మీ ముందే ఉంది. సతివాడ గ్రామంలో ఉన్న 2,225 కుటుంబాలకు వివిధ పథకాలు లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2241. ప్రభుత్వం మన క్షేమం కోసం పనిచేస్తుందా లేదా అన్నది మీరు సరిగ్గా అంచనా వేయండి. మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలవండి అని మంత్రి ధర్మాన కోరారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎంపీపీ గోండు రఘురాం, యల్లా నారాయణ, కోయ్యాన నాగభూషణ్, ముంజేటి కృష్ణ, పీస గోపి, శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు