– సి ఈటిపీలో ఫార్మా ఘన వ్యర్ధపదార్థాలను నిలవ చేయడం నిబంధనలకు విరుద్ధం
– రాంకీకి కూటమి పెద్దల భజన
– కాలుష్యం కోరల్లో పరవాడ, భరణికం, తానం గ్రామాలు
– రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
– లేకపోతే ఆ మూడుగ్రామాల ప్రజలతో ముట్టడి
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి
పరవాడ: రాంకీ యాజమాన్యం బరితెగించి సి ఈటిపీలో ఫార్మా ఘన వ్యర్ధపదార్థాలను నిలవ చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ల్యాండ్ ఫిల్ నిండిపోతే అక్రమంగా సీ ఈటిపీలోనే వేలాది టన్నులు వ్యర్థ పదార్థాలను నిలవంచటం వలన సమీపంలో ఉన్న గ్రామాలు పరవాడ, తానం గ్రామాలు మరింత కాలుష్యాన్ని గురవుతాయని పరవాడ మండలం తానం గ్రామంలో రైతులతో శనివారంజరిగిన సమావేశంలో గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
రాంకీ యాజమాన్యం ఇప్పటికే సమీపంలో ఉన్న చెరువులు వర చెరువు, పెద్ద చెరువు, సన్యాసి చెరువు, మొల్లోడు గడ్డల్లోకి వ్యర్థ రసానికి జలాలను విడుదల చేస్తుందని, కూటమి నేతలు కళ్ళప్పగించుకుని చూస్తున్నారని అన్నారు.
అత్యంత ప్రమాదకరమైన ఘన వ్యర్ధాలను ల్యాండ్ ఫీల్డ్ లో మాత్రమే నిలవంచవలసింది పోయి.. గతంలో ల్యాండ్ ఫీల్డ్ కోసం కేటాయించిన స్థలం ల్యాండ్ ఫీల్డ్ పనికిరాదని ప్రభుత్వం నుండి అనుమతులు నిరాకరిస్తే, అదే స్థలంలో ఈ కాలంలో రాంకీ యాజమాన్యం అక్రమంగా ఘన వ్యర్ధాలను నిల్వ ఉంచేప్రక్రియ చేపట్టడం దుర్మార్గమని గని శెట్టి అన్నారు.
రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాంకీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చారని, కానీ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాంకీ యాజమాన్యానికి భజన చేస్తున్నారని, కనీసం కాలుష్యాన్ని కారణమైన రాంకీ యాజమాన్యంపై మాట్లాడడం లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో భరిణికం, పరవాడ, తానం ప్రజలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గని శెట్టి హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్రీ సన్యాసిరావు, కన్నా నాయుడు తదితరులు పాల్గొన్నారు