Suryaa.co.in

Editorial

ఎన్టీరామా…ఏమిటీ డ్రామా?

  • సమంత-నాగ్‌పై మంత్రి సురేఖ వ్యాఖ్యలు ఖండించిన జూనియర్ ఎన్టీఆర్

  • ఇతరులు తమపై నిరాధార నిందలు వేస్తుంటే మౌనంగా కూర్చోలేమని వ్యాఖ్య

  • వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మంత్రికి హెచ్చరిక

  • బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు గౌరవాన్ని పాటించాలంటూ హితవు

  • నిండుసభలో మేనత్త భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల నిందలు

  • కొడాలి నాని, వంశీ వ్యాఖ్యలపై బాబు మనస్థాపం

  • జీవితంలో తొలిసారి అందరి ఎదుటా కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు

  • అప్పట్లో బాబు-లోకేష్-బాలయ్యపై కొడాలి-నాని విమర్శలు

  • బాబును 54 రోజులు జైల్లో పెట్టిన పెట్టిన జగన్ సర్కారు

  • బాబుకు సంఘీభావంగా గళమెత్తిన తెలుగుప్రజలు

  • ఏ ఒక్కసారీ స్పందించని జూనియర్ ఎన్టీఆర్

  • పవన్ పెళ్లాలు మారుస్తాడని జగన్ విమర్శించినా ఖండించని ఎన్టీఆర్

  • ఇప్పుడు సమంత-అక్కినేని ఎపిసోడ్‌లో మాత్రం ఖండన

  • నాడు మేనత్తను నిందించినా మౌనంగా ఉన్నావెందుకంటూ నెటిజన్ల ప్రశ్నల వర్షం

  • బాబు-లోకేష్‌ను దూషించినప్పుడు ఈ ట్వీట్లు ఏమైందని నిలదీత

  • ఎన్టీఆర్ తీరుపై టీడీపీ సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహం

  • ఎవరి కోసం ఈ డ్రామాలంటూ ఫైర్

  • విమర్శల జడివానలో జూనియర్ ఉక్కిరిబిక్కిరి

( మార్తి సుబ్రహ్మణ్యం)

జూనియర్ ఎన్టీఆర్ మరో విమర్శల వర్షంలో తడిసిముద్దవుతున్నారు. సమంతను తన వద్దకు పంపించకపోతే నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూలగొడతామని.. నాటి మంత్రి కేటీఆర్ గతంలో నాగార్జునను హెచ్చరించారంటూ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సినీ-రాజకీయవర్గాల్లో భూకంపం సృష్టిస్తోంది. కేటీఆర్ హెచ్చరికలకు భయపడిన నాగ్-చైతన్య కలసి, సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని, లేకపోతే మా ఇంట్లో వద్దని ఒత్తిడి చేశారట.

ఈ క్రమంలో సమంత విడాకులు తీసుకుందని, సురేఖ చేసిన ఆరోపణ సినీలోకాన్ని కుదిపేసింది. తర్వాత సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించటం, కేటీఆర్-నాగ్ ఆమెపై పరువునష్టం దావా వేయటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే సినిమా వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్నే కొండా సురేఖ ప్రస్తావించారని, దానికితోడు ఫోన్ ట్యాపింగ్‌పై విచారణలో వెల్లడైన అంశాలనే ఆమె మీడియాకు వెల్లడించారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. టీడీపీ సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహానికి గురయింది. అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను, జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. ఇతరులు తమపై నిరాధార నిందలు వేస్తుంటే మౌనంగా కూర్చోలేమని, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మంత్రిని హెచ్చరించిన ఎన్టీఆర్..బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు గౌరవాన్ని పాటించాలంటూ హితవు పలకడమే పసుపు సైనికుల ఆగ్రహానికి అసలు కారణం.

ఈ బుద్ధి-జ్ఞానం-ఆవేదన-ఆగ్రహం.. జగన్ జమానాలో చంద్రబాబు కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు దూషించినప్పడు ఏమైనాయంటూ, ఇప్పుడు టీడీపీ సోషల్‌మీడియా సైన్యం విరుచుకుపడుతోంది. అసలు ఎన్టీఆర్-అక్కినేని కుటుంబాల మధ్య దశాబ్దాల నుంచి వైరం ఉందన్నది బహిరంగ రహస్యం. పైగా నాగార్జున వైసీపీ అధినేత జగన్‌కు మిత్రుడు. వైఎస్‌తో సన్నిహితంగా మెలిగేవారన్నది అందరికీ తెలిసిందే. అప్పట్లో వైఎస్ కోసం నాగార్జున ప్రచారం కూడా నిర్వహించారు. అలాంటి ఎన్టీఆర్ కుటుంబ విరోధికి జూనియర్ మద్దతుగా నిలవడంపై టీటీడీ శ్రేణులు మండిపడుతున్నాయి.

తనది ఎన్టీఆర్ రక్తమని చెప్పుకునే ఎన్టీఆర్.. తన తాత పేరుతో మామయ్య చంద్రబాబునాయుడు నిర్మించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును, జగన్ ప్రభుత్వం మార్చి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు జగన్ సర్కారు చర్యను ఖండించారు. అయితే తన తాత పేరును తొలగించిన జగన్ నిర్ణయాన్ని ఎన్టీఆర్ కనీసం ట్విట్టర్‌లో ప్రశ్నించేందుకూ భయపడటం విశేషం.

అయితే అప్పుడు ఆ యూనివర్శిటీకి ఎన్టీఆర్ స్థానంలో.. వైఎస్ పేరు పెట్టి జగన్ కళ్లలో మెరుపులు చూసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు, కూటమి సర్కారులోనూ వెలిగిపోతున్నారు. అది వేరే విషయం.

జగన్ జమానాలో చంద్రబాబు-భువనేశ్వరి-బాలయ్య-లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని, కొడాలి నాని-వల్లభనేని వంశీ-జోగి రమేష్- రోజా వ్యక్తిగత విమర్శలు కురిపించారు. దానికి పరాకాష్ఠగా నిండు సభలోనే భువనేశ్వరిని దూషించటంతో, మనస్థాపం చెందిన నాటి విపక్షనేత చంద్రబాబు ఆగ్రహంతో సభ నుంచి నిష్ర్కమించారు. మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగుపెడతానని శపథం చేశారు.

మరుసటిరోజు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతున్న బాబు.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయి, తన భార్యను దూషించారంటూ కన్నీరు పెట్టుకోవటం, పార్టీ శ్రేణులను ఖిన్నులను చేసింది. నిండుసభలో ఒక మహిళను కించపరిచిన వైసీపీ కీచక ఎమ్మెల్యేలపె, మహిళాలోకం భగ్గుమంది.

ఏనాడూ రాజకీయాల్లోకి రాని ఎన్టీఆర్ కుమార్తె, తన మేనత్త భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా అవమానించినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఖండిస్తూ కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఎన్టీఆర్ మౌనంపై టీడీపీ సోషల్‌మీడియా సైన్యం అప్పుడే నిప్పులు చెరిగింది. దానితో భువనేశ్వరి పేరు ప్రస్తావించకుండా మొక్కుబడిగా ట్వీట్ చేసి, చేతులుదులుపేసుకున్నారు.

తన సొంత కుటుంబాన్ని జగన్ సహా.. వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా దూషించిన ఏ సందర్భంలోనూ, ఎన్టీఆర్ ఒక్కసారి కూడా స్పందించిన దాఖలాలు లేవు. సాటి నటుడైన పవన్ సినిమాలకు జగన్ రేట్లు పెంచని సందర్భంలో కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. పవన్ తరచూ పెళ్లాలను మారుస్తాడని జగన్ అనేకసార్లు నిందించినప్పుడు సైతం ఎన్టీఆర్ ఖండించలేదు. చివరకు చిరంజీవి వంటి తెలుగు సినిమా అగ్రహీరోలను, జగన్ తన తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు పిలిపించి, అవమానించినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దానిని ఖండిస్తూ కనీసం ట్వీట్ కూడా చేయలేదు.

కానీ సమంత-అక్కినేని విడాకులకు సంబంధించి.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఎన్టీఆర్ ట్వీట్ చేసిన వైనం టీడీపీ సోషల్‌మీడియా సోల్జర్స్‌కు పాత ఘటనలు గుర్తుచేసినట్టయింది. వైసీపీ ఎమ్మెల్యేలు సొంత మేనత్తను అసెంబ్లీలో అవమానించినప్పుడు.. చంద్రబాబు-లోకేష్‌ను వైసీపీ సోషల్‌మీడియా ఐదేళ్లు నిర్విరామంగా ట్రోల్ చేసినప్పుడు… రాంగోపాల్‌వర్మ అనే దర్శకుడు బాబు-పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించినప్పుడు.. పోసాని మురళీకృష్ణ అనే సినీ రచయిత చంద్రబాబును బహిరంగంగా తిట్టిపోసినప్పుడు గుర్తుకురాని ఆవేదన-ఆగ్రహం.. సమంత-అక్కినేని విడాకులపై మంత్రి సురేఖ వ్యాఖ్యానించినప్పుడు రావడంపై, టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

అంటే ఎన్టీఆర్‌కు, సొంత మేనత్త-మామయ్య-బావ -బాబాయ్‌లకంటే.. అక్కినేని కుటుంబమే ముఖ్యమా? వారిని మంత్రి సురేఖ అవమానించారనుకుంటే.. మేనత్త-మామయ్య-బాబాయ్-బావలను వ్యక్తిగతంగా దూషించిన, వైసీపీ ఎమ్మెల్యేలను ఏమనాలి? వారిపై నాడు ఎన్టీఆర్ ఎందుకు ఇదేమాదిరి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదు? ఎన్టీఆర్ పేరు పెట్టుకుని, ఎన్టీఆర్ కుటుంబాన్ని దూషిస్తున్న వారిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయవు? ఏమిటీ డ్రామా? అసలు నువ్వు ఎవరివైపు? ఎన్టీఆర్ కుటుంబం వైపా? ఎన్టీఆర్ కుటుంబాన్ని దూషించేవారి వైపా? అంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A RESPONSE