అమరావతి : కొత్త జిల్లాల్లో పాత భవనాల్లోనే కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆర్థిక వనరులు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల సర్థుభాటు తదితర అంశాలపై వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఆర్ధికశాఖ సెక్రటరీ (హెచ్‌ఆర్) శశిభూషణ్‌కుమార్ అధ్యక్షతన అన్ని శాఖల హెచ్‌ఓడిలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మౌళిక వసతులు కల్పన, కార్యాలయాల నిర్వహణ, ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలు కోసం జిల్లాకు కనీసం రూ.65 కోట్ల నుంచి రూ.100కోట్లు కావాలని కలెక్టర్లు కోరుతున్నారని హెచ్‌ఓడిలు తెలిపారు.
దీనిపై స్పందించిన ఆర్థికశాఖ అధికారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనపు నిధులు ఇవ్వలేమని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని పాత భవనాల్లోనే కొంత కాలం కార్యాలయాలు నిర్వహించుకోవాలని చెప్పారు. అదే విధంగా ఇప్పుడున్న సిబ్బందినే కొత్త జిల్లాలకు కూడా విభజిస్తామని, అదనపు పోస్టులు ఉండవని తెలిపారు. సిబ్బంది సర్ధుబాటులో ఎక్కడైనా అత్యవసరమైతే కొద్ది మందిని ఔట్‌సోర్సింగ్ పోస్టులు తీసుకునే అంశాన్ని పరిశీలించవచ్చన్నారు.