Suryaa.co.in

Editorial

వైసీపీ సేవకుల ‘వేటు’తో అధికారుల వెరపు!

వైసీపీ నేతలు చెప్పింది వింటే వేటే
ఇప్పటికే ఇద్దరు అధికారుల సస్పెన్షన్
అదే దారిలో మరికొందరు అధికారులు
ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
దానికోసం టీడీపీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు
సెల్‌లో 29 మంది కో ఆర్డినేటర్లు, 108 మంది సిబ్బంది
ఢిల్లీలో ఈసీతో సంప్రదింపులకు 12 మంది లాయర్ల బృందం
పయ్యావుల పట్టుతో ఇప్పటికే ఇద్దరు అధికారుల అవుట్
అధికార పార్టీకి సేవ చేస్తే బలికాక తప్పదా?
కనీసం విచారణలో కాపాడని నేతలపై అధికారుల క న్నెర్ర
చెప్పినట్లు చేసినా కాపాడని అధికార పార్టీపై అధికారుల ఆగ్రహం
తమను ఎవరూ కాపాడలేరని అర్ధమైన అనుభవం
రెడ్డి అధికారుల్లో మారుతున్న కులాభిమానం
ఉద్యోగాలు పోతాయన్న భయంలో రెడ్డి అధికారులు
అధికార పార్టీ కోసం తమ సర్వీసును ఎందుకు పణంగా పెట్టాలన్న భావన
అధికార పార్టీ నేతలపై అడ్డం తిరుగుతున్న అధికారులు
కావాలంటే బదిలీ చేసుకోమంటున్న వైనం
విస్తుపోతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు
పనిచేయని బదిలీ బెదిరింపులు
బలి కావడం కంటే బదిలీనే నయమంటున్న అధికారులు
మా పార్టీ మాట వింటే జైలుకు వెళతారని వైసీపీ ఎంపీ రాజు హెచ్చరిక
వైసీపీ నేతలు కాపాడరని ఎంపీ రాజు స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘మా పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్ల మాట వింటే మీరు జైలుకు వెళతారు. గతంలో జగన్ కోసం జైలుకు వెళ్లిన అధికారుల గతి ఏమైందో తెలుసు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు మా పార్టీ నేతల మాట వింటే మీకూ జైలు తప్పదు. మిమ్మల్ని ఎవరూ కాపాడరు. ఈసీ ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. మా పార్టీ నేతలు మిమ్మల్ని ఏం కాపాడారు? అందువల్ల తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి. ఆత్మసాక్షితో పనిచేయండి. మీకు మా పార్టీ క్షేమం కంటే కంటే మీ కుటుంబాల క్షేమం ముఖ్యం. మహా అయితే మిమ్మల్ని బదిలీ చేస్తారు. మీ జీతం అయితే ఆపలేరు కదా?’. ఇదీ.. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తాజాగా ఏపీ ప్రభుత్వ అధికారులకు సూచనలతో సుత్తిలేకుండా సుతిమెత్తగా చేసిన హెచ్చరిక.

క్షేత్రస్థాయిలో ఎంపి రాజు హెచ్చరికల ప్రభావం.. అధికారులపై బాగానే కనిపించడం ప్రారంభమైంది. తమను ఎవరూ కాపాడలేరన్న ఎంపీ రాజు మాటలు .. అక్షరసత్యాలయిన ఘటనతో, అధికారులు అప్రమత్తమవుతున్న వైనం చర్చనీయాంశమయింది.

ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్పించేందుకు అధికార పార్టీకి సహకరించిన ఇద్దరు అధికారులను, ఈసీ ఆదేశాలతో స్వయంగా వైసీపీ ప్రభుత్వమే సస్పెండ్ చేయడం.. ఆ సమయంలో తాము శ్రమదానం చేసిన పార్టీ నేతలు, భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడం, వారిలో కొత్త ఆలోచనకు దారితీసింది.

ప్రధానంగా రెడ్డి సామాజికవర్గ అధికారుల్లో ఈ ఘటన భయాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. వైసీపీపై సామాజికవర్గ అభిమానంతో.. ఉద్యోగాలను పణంగా పెట్టి పనిచేస్తున్న రెడ్డి అధికారులను, తాజా సస్పెన్షన్ పరిణామాలు కలవరపెట్టాయి. పైగా సస్పెండ్ అయిన వారిలో ఒకరు రెడ్డి అధికారే ఉండటంతో, ఇకపై నిబంధనల ప్రకారమే పనిచేయాలన్న నిర్ణయానికి రావడం కీలక పరిణామం.

అనంతపురం జిల్లాలో , అధికార వైసీపీ నేతల మెహర్బానీ కోసం పనిచేసిన తమ ఇద్దరు ఉన్నతాధికారులను, స్వయంగా అదే వైసీపీ సర్కారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అయినా తాము ఏ అధికార పార్టీ కోసమైతే పనిచేశామో, అదే అధికార పార్టీ నేతలు.. కనీసం తమకు సాయం చేయకపోగా, ఆపద సమయంలో పారిపోవడం అధికారులు, కింది స్థాయి ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదుతో.. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి, అక్రమంగా తొలగించిన వ్యవహారం అధికారుల్లో ఆత్మపరిశీలకు కారణమయింది. 2020-21 సంవత్సరాల్లో అధికార వైసీపీ నేతల ప్రోద్బలంతో టీడీపీ ఓటర్ల తొలగింపు- దొంగ ఓట్ల నమోదుకు.. అప్పటి జడ్పీ సీఈఓ స్వరూపారాణి సహకరించారని, కేశవ్ సీఈసీ వద్దకు కాళ్లకు బలపాలు కట్టుకుని అదేపనిగా ఫిర్యాదు చేశారు. దానితో ర ంగంలోకి దిగిన సీఈసీ అధికారులు ఉరవకొండలో క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించారు.

స్వరూపారాణి అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని గుర్తించారు. దానితో ఆమెను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఫలితంగా.. ఆమె ఏ పార్టీ కోసమైతే తన ఉద్యోగం పణంగా పెట్టి శ్రమదానం చేశారో, అదే వైసీపీ సర్కారు ఆమెను సస్పెండ్ చేయడం విశేషం.

అంతకంటే ముందు… అదే జిల్లా సీఈఓ భాస్కర్‌రెడ్డిని కూడా ఇలాంటి ఆరోపణలపైనే, ఈసీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం అధికారుల్లో భయాందోళనకు కారణమైంది. ఓటర్ల తనిఖీ సమయంలో అధికారుల వెంట వాలంటీర్లు ఉండకూడదని ఈసీ ఆదేశించింది. తనిఖీల సమాచారాన్ని విపక్షాలకు ఇవ్వాలని స్పష్టం చేసింది.

అయినా వాటిని లెక్కచేయకుండా అధికారులు, వైసీపీ నేత ఇంట్లో కూర్చుని 6 వేల ఓట్లు తొలగించడం వివాదానికి దారితీసింది. ఈ సమాచారం అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే కేశవ్, సీఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, స్థానిక అధికారులు మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదని సర్టిఫై చేశారు. అయినా అనుమానంతో రంగంలోకి దిగిన సీఈసీ అధికారులు, క్షేత్రస్థాయి విచారణ చేశారు.

ఈ వ్యవహారానికి సీఈఓ భాస్కర్‌రెడ్డిని బాధ్యుడిగా గుర్తించారు. ఆయనను సస్పెండ్ చేయాలని ఆదేశించడం, వైసీపీ సర్కారు ఆయనపై సస్పెన్షన్ వేటు వేయటం శరవేగంగా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్‌లో కీలకపాత్ర పోషించిన మరో ఈఆర్వోపై, రేపో మాపో వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈవిధంగా ఒకే నియోజకవర్గానికి సంబంధించి.. ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ కావడంతో, అధికారులు ఆత్మపరిశీలనలో పడటం అనివార్యంగా మారింది. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు, తాజా పరిణామాలతో భయపడే పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ కోసం అడ్డదారులు తొక్కిన అధికారులను, ఆ పార్టీ రక్షించడం లేదన్న వాస్తవం.. ఆ ఇద్దరి ఉన్నతాధికారుల సస్పెన్షన్‌తో మిగిలిన వారికి అర్ధమైంది. అదే సమయంలో ఉన్నతాధికారులకు సహకరిస్తే. రేపు తాము కూడా సస్పెండ్ అవుతామన్న భయం, కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో మొదలయింది.

తమను ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే కాపాడలేరన్న వాస్తవం అధికారులకు స్పష్టం కావడంతో… ఇకపై అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటించకూడదన్న నిర్ణయానికి రావడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలకు సహకరిస్తే సస్పెండ్ అవుతామన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. తమను వాడుకున్న అధికార పార్టీ నేతలు, తాము సస్పెండ్ అయితే.. కనీసం కాపాడలేని పరిస్థితిలో ఉండటం, వారిలో మరింత ఆగ్రహం-తెగింపునకు అసలు కారణంగా కనిపిస్తోంది.

దానితో ఓటర్ల పరిశీలనకు వాలంటీర్లను వెంట రానీయవద్దని.. అలాంటి ఫిర్యాదులు వస్తే ముందు తామే చర్చలు తీసుకుంటామని, అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కొత్త మలుపు. అదే సమయంలో.. తాము ఏ సమయంలో తనిఖీలకు వస్తున్నామో, ఆ సమాచారాన్ని అన్ని పార్టీలకూ ఇవ్వాలని ఆదేశించడం విశేషం. క్షేత్రస్థాయిలో ఏది వాస్తవమైతే దానినే నివేదించాలని, ఆ సమయంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లను పట్టించుకోవద్దని ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. దీన్ని బట్టి..ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు ప్రభావం, మిగిలిన అధికారుల్లో ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్ వ్యవహారం.. అధికారుల తెగింపునకు కారణంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిధులు, ఇన్చార్జిల మాట వినకపోతే మహా అయితే బదిలీ చేస్తారే తప్ప, ఉద్యోగాలు తీసివేయరు కదా అన్న భావన బలపడుతోంది. వైసీపీ నేతల కోసం తమ ఉద్యోగాలను, ఎందుకు పణంగా పెట్టాలన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ‘బలి కావడం కంటే బదిలీ అవడమే సుఖం. అసలు ఈ ఎన్నికల సమయంలో లూప్‌లైన్ పోస్టింగులే హాయి’ అని ఓ నర్సరావుపేట జిల్లాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

కాగా.. దొంగ ఓట్లు, తమ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు చేస్తున్న వైసీపీ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు, టీడీపీ నాయకత్వం పెద్ద యంత్రాంగమే ఏర్పాటుచేసినట్లు సమాచారం. మంగళగిరి, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒక్కో సెల్‌లో 29 మంది కో ఆర్డినేటర్లు, 108 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

మంగళగిరి విభాగంలో మాత్రం ఈ సంఖ్య 300 వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ సేవలు కూడా వాడుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరంతా మంగళగిరి పార్టీ ఆఫీసులో కాకుండా.. మంగళ గిరిలోని ఒక మారుమూల గ్రామం కేంద్రంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

వీరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. దానిని ఈ సెల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తుంది. మళ్లీ దీని పర్యవేక్షణకు, 12 మంది సీనియర్ నేతలను నియమించినట్లు తెలుస్తోంది. ఐ-టిడిపి సెల్ సాంకేతిక నిపుణులు కూడా ఈ సెల్‌కు సలహాలిస్తున్నట్లు సమాచారం. తొలగింపు- దొంగఓట్ల నమోదు ప్రక్రియ విశ్లేషణను ఐ-టిడిపి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

వీరిని ఢిల్లీలో సీఈసీతో ఫిర్యాదులు- సంప్రదింపులకు ఏర్పాటు చేసిన.. 12 మంది లాయర్ల బృందంతో, అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఈసీ వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఒక ప్రముఖుడు, స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఆయన ఈపాటికే నియోజకవర్గ నాయకులతో, కొన్ని నెలల క్రితమే శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేసి, ఓట్ల నమోదు-తొలగింపు ప్రక్రియపై పూర్తి స్థాయి అవ గాహన కల్పించినట్లు, ఓ సీనియర్ నేత వెల్లడించారు. తరచూ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయా నియోజకవర్గాల నుంచి.. వైసీపీ నేతలు టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కోసం చేస్తున్న దరఖాస్తు వివరాలను వెల్లడించి, స్థానిక టీడీపీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు.

ఈ సెల్‌లో 29 మంది కో ఆర్డినేటర్లు, 108 మంది సిబ్బందితోపాటు.. ఢిల్లీలో ఈసీతో సంప్రదింపులకు, 12 మంది లాయర్ల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

LEAVE A RESPONSE