వరుస పిటిషన్లతో న్యాయవ్యవస్థకు తలనొప్పిగా మారిన చంద్రబాబు
రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
అక్టోబర్ 21: న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతగా ఉందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఈ అంశంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.
వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమని గగ్గోలు పెడుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆమె దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు గారి ప్లీడర్లు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారని, వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఇప్పటికే పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు చంద్రబాబు తలనొప్పిలా మారాడని అన్నారు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందని చెప్పారు.
విశాఖ నుంచి కూడా సమర్ధవంతంగా పరిపాలన
జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి అని విపక్షాలు గుర్తించాలని అన్నారు. ఇది కొత్త డిజిటల్ యుగమని, విజయవాడ నుండి సీఎంఓ ఎలా పనిచేస్తుందో వైజాగ్ నుండి కూడా సమర్థవంతంగా పని చేయవచ్చని అన్నారు. వైజాగ్‌లో సీఎం ఉండడం మూలంగా పరిపాలనను మరింత మెరుగుగా ఉంటుందని, రాష్ట్రంలోని అతిపెద్ద, అత్యంత ఆధునిక నగరం పురోగతికి దోహదపడుతుందని అన్నారు.
గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
విజయదశమి వేళ నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించిందని, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. ఆగస్టులోనే 508 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, తాజాగా మరో 212 పోస్టులకూ ఓకే చెప్పిందని అన్నారు. అలాగేగత నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, మరో 230 కూడా భర్తీ చేయనుందని, మొత్తంగా 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని అన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ దసరా కానుక
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించారని అన్నారు.గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం గెజిట్లో ముద్రించిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు.