బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు
ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలను కాంగ్రెస్ కబంధహస్తాల నుండి గెల్చుకోవడం ద్వారా, ఇంకా మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారం నిలుపుకొనడం ద్వారా బిజెపి హ్యాట్రిక్ సాధించింది. 2024 మరోసారి కేంద్రంలో బిజెపి అధికారం సాధించనున్నది అనేదానికి ఇది ముందస్తు సంకేతం. “మరోసారి మోడీ సారు” అనే నినాదం ప్రజల మనసు లోతుల నుంచి ఇప్పుడు వస్తున్నది.
ఈసారి దేశవ్యాప్తంగా 400 కు పైగా లోక్సభ స్థానాలను సాధించగలమన్న ధీమా మాలో ఉంది. కాంగ్రెస్ గ్యారెంటీ నినాదాన్ని చూపి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించినా ప్రజలు నమ్మలేదు. బిజెపి-కాంగ్రెస్ ల మధ్య పోటీలో కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా నమ్మరని రుజువైంది. దేశంలో ప్రజలు నమ్మే ఏకైక గ్యారెంటీ, మోడీ గ్యారెంటీ.
దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి
ఇకపై బీజేపీ దృష్టి దక్షిణాది రాష్ట్రాలను గెలవడమే. ఆ రకంగానే మా కార్యాచరణ ఉంటుంది. తెలంగాణలో మా సీట్లను పెరుగుపరుచుకోవటం మాత్రమే గాక ఓట్ల శాతాన్ని కూడా రెట్టింపు చేసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ బిజెపి-కాంగ్రెస్ ల మధ్య మాత్రమే ఉండబోతోంది. ఆ పోటీలో ఖచ్చితంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 90% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధిస్తుంది.
స్వయంగా “ఇండియా” కూటమిలోని పార్టీలే కాంగ్రెస్ ను నమ్మలేని పరిస్థితి కనిపిస్తూఉంది. వాళ్లు కాంగ్రెస్ హస్తం అంటే భస్మాసుర హస్తమనీ నమ్మటమే దీనికి కారణం. గతంలో గెలవని నియోజకవర్గాల్లో కూడా ఈసారి విజయం సాధించాలని బిజెపి గట్టి పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగానే కార్యాచరణ ఉండబోతుంది. ఇకనుండి తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులు కొట్టుకునే చరిత్ర, ఢిల్లీ యాత్రల అధ్యాయం మొదలవుతుంది.
జనసేనతో గత మూడు సంవత్సరాల నుంచి మేము పొత్తులో ఉన్నాం. రాబోయే రోజుల్లో పొత్తుల నిర్ణయం పూర్తి స్పష్టతతో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపిని ప్రజలు ఆదరించాలని, మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లోకూడా అమలు చేయాలని మా పార్టీ మోడీ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళుతుంది. దేశంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలనేది పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచన.
కాంగ్రెస్ విజయోత్సాహంలో తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించడంపై ఆ పార్టీ నాయకత్వమే స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు తెలంగాణ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతిస్తున్నట్లు బాహాటంగా చెప్పినట్లు మాకు ఎటువంటి సమాచారం లేదు.