– మీరు తీసుకురానున్నది నైట్ ఎకానమీ కాదు.. దారం తెగిన తెలంగాణ కైట్ ఎకానమీ
– ముఖ్యమంత్రి కి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి
– మధ్యలో పరిశ్రమలు పెట్టి ఏ విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేస్తారు?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కెటిఅర్ ప్రసంగం
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, అప్పుల పైన అధికార పక్షానికి ఒక ఓరియెంటేషన్ సెషన్ పెట్టాలి. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని అపవాదులకు గురి చేస్తే, దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కేంద్ర ఆర్థిక సంస్థలు స్పష్టంగా వివరించాయి. సోషియో ఎకనామిక్ సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించి నిజాలను చెప్పింది.
స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూస్ లో దేశంలోనే ఉత్తమ స్థానంలో తెలంగాణను నిలబెట్టింది మా ప్రభుత్వం. దర్జాగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాము. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదాయం అంచనాలకు అందడం లేదు. ఒకప్పుడు ఉస్సేన్ బోల్ట్ లెక్క పరిగెత్తిన ఆర్థిక వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఎందుకు చతికిలపడింది?
ఆర్థిక చక్రం పూర్తిగా అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. రెవెన్యూ మిగులు రాష్ట్రానికి ఎందుకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నది? కరోనా కాలంలో మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ కాలంలోనే ఇట్లాంటి పరిస్థితి వస్తున్నది.
ఉన్న డే ఎకానమీని ఖరాబు చేసి నైట్ ఎకానమీ తీసుకువస్తాం అంటున్నారు. మీరు తీసుకురానున్నది నైట్ ఎకానమీ కాదు, దారం తెగిన తెలంగాణ కైట్ ఎకానమీ మాదిరిగా మార్చిర్రు మీరు. తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకత్వం కేసీఆర్ ది. కానీ ఈరోజు రాష్ట్రం తలసరి ఆదాయంలో 6వ స్థానానికి పడిపోయాము. రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జీఎస్టీ గ్రోత్ తగ్గింది. మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది.
మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగటివ్ సెంటిమెంట్ అయిపోయింది. లాభాలు ఉన్నవాళ్లకే మంత్రి. సారా దుకాణాలు తెరవాలని డిమాండ్లు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాము. ఒకప్పుడు నీరో చక్రవర్తి గురించి చూశాము, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాము. ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈయనే ఉన్నారు.
ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితికి రావడానికి నెగటివ్ మైండ్సెట్, నెగటివ్ పాలసీలే ప్రధాన కారణం. టీ-హబ్ సైతం చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏమో తెలియదు కానీ, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. అంటే అర్థం ఏందంటే ముఖ్యమంత్రి కి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రజల ఆర్థిక స్తోమత భారీగా పెరిగింది. కుటుంబ ఆదాయం పెరిగింది. కుటుంబ తలసరి ఆదాయంలో కూడా దేశంలోనే అత్యధిక అత్యుత్తమ స్థానంలో ఉన్నది అంటే తెలంగాణ అని.
రాష్ట్రం ఈరోజు నాలుగు ఐదు నెలలుగా నెగటివ్ ద్రవ్యోల్బణం చవిచూస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ప్రచారాలు చేసిండ్రు. కేవలం పొలిటికల్ ప్రాపగాండా కోసం రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకుపోతున్నారు. గ్లోబల్ సమిట్ అని చెప్పి ఒక గోబెల్స్ కాన్ఫరెన్స్ పెట్టి 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం చేసుకున్నారు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పెట్టుబడుల నంబర్ని రాసింది.
100 కోట్ల రూపాయల టెంట్ వేసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు చూపించి ప్రచారం చేసుకున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందరినీ కోటీశ్వరులుగా చేస్తే కోటి ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రం అవుతుంది. ఎందుకు ఇలాంటి అసత్యాలు, ఆచరణ సాధ్యం కాని మాటలను ఎందుకు చెబుతున్నారు?
డావోస్తో పాటు మొన్న జరిగిన కాన్ఫరెన్స్ అన్నిటి పైన కలిపి ఒక శ్వేతపత్రాన్ని రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల అంశం పైన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మేము ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలను సేకరించాము. కానీ అక్కడ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలోకి రాకముందు ప్రజలకు తిరిగి ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వం అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి అబద్ధాలు చెప్తున్నది. ఫార్మా సిటీ భూసేకరణ కేవలం ఫార్మా అవసరాల కోసమే వాడుకోవాలనే నిబంధనలు ఉన్నాయి.
అయినా ఇవన్నీ పక్కన పెట్టి కంపెనీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇండ్లు ఇస్తామని చెప్పి అందరినీ మోసం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇంకొక మోసానికి పాల్పడుతున్నది. కాలుష్య కారక పరిశ్రమలు వద్దు అని చెప్పి ఆరోజు పోరాటం చేసిన కాంగ్రెస్ నేతలు, ఈరోజు మధ్యలో పరిశ్రమలు పెట్టి ఏ విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేస్తారు?
ఇన్ని అబద్ధాలు చెబితే పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం కలుగుతుంది? రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తుపాకీ పెట్టి బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలి. గ్లోబల్ సమిట్ అని ఏర్పాటు చేసిన సమావేశంలోనే ప్రపంచంలోని అనేకమంది ఆర్థికవేత్తలు గత ప్రభుత్వం యొక్క ఘనత గురించి చెప్పారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి వంటి వాళ్లందరూ కూడా తెలంగాణ సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రగతిని మీ ముందట స్పష్టంగా దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఒక్కప్పుడు హిరణ్యకశిపుడు ఆయన రాజ్యంలో నారాయణ మంత్రం వినొద్దు అని నిషేధించినట్టుగానే, ఈరోజు తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటే తెలంగాణ అణువణువునా అడుగడుగునా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నాయి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే శక్తి ఎవరికీ లేదు.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న సచివాలయం, కమాండ్ కంట్రోల్, ఫ్యూచర్ సిటీ.. చివరికి తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కదా?
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి2024-25లో అంచనాల్లో సగం కూడా రాలేదు. 2023-24లో 14,295 కోట్లు వస్తే..2024-25 లో 8473 కోట్లకు పతనమైంది. పదేండ్ల కాలంలో 25 శాతం సగటు గ్రోత్ రేటుతో .. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది రిజస్ట్రేషన్ ఆదాయం.
ఇప్పడంతా..నేల చూపులు! గత ఏడాది షాక్ అంచనాలు తగ్గించి ఈ సారి 19వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అందులో జనవరి నాటికి చేరుకున్నది 64 శాతమే! కరోనా తర్వాత ఇది..సెకండ్ లోయస్ట్.