– సీనియారిటీ-సిన్సియారిటీకి అర్ధం చెప్పిన గుంటూరు ఎమ్మెల్యే గళ్లా మాధవి
– చంద్రబాబును అంబటి తిట్టినా స్పందించని గుంటూరు సీనియర్ నేతలు
– పార్టీ ఆదేశించకపోయినా అంబటి ఇంటికి వందలాది మహిళలతో కలసి గళ్లా మాధవి చీపుర్లు, చెప్పులతో నిరసన ప్రదర్శన
– మాధవి ధైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్‌మీడియాలో పసుపుదళాల పోస్టింగులు
– గుంటూరు టీడీపీలో మగాళ్లు లేరంటూ వ్యంగ్య వ్యాఖ్యలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును మీడియా సాక్షిగా అనాగరిక భాషలో బూతులు తిడుతూ.. కారెక్కి సగర్వంగా తన ఇంటికి వెళ్లిపోయిన సందర్భం.
ఈలోగా రాంబాబు అనాగరిక భాష సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
అప్పటికే రాంబాబు వీడియో వైరల్ అయి గంటలు దాటింది.
కానీ గుంటూరులో సీనియర్లమని చెప్పుకునే మోతుబరులు.. చంద్రబాబునాయుడు-లోకేష్‌తో తరచూ ఫొటోలు తీసుకునే వి‘నాయకులు’.. పొద్దున్న లేస్తే మంగళగిరి పార్టీ ఆఫీసులో తెల్లచొక్కాలతో దర్శనమిచ్చే సీనియర్లు.. మేం పార్టీ పుట్టినప్పటి నుంచీ జెండా మోస్తున్నామని తెగ ప్రచారం చేసుకుని, అన్ని పార్టీల వారితో సఖ్యతగా ఉండే వ్యాపారులు.. వీళ్లెవరికీ తమ పార్టీ అధినేత చంద్రబాబును, నగరంలోనే ఉండే అంబటి రాంబాబు అనాగరికంగా-దారుణంగా తిట్టిపోసిన సంగతి తెలియనే తెలియదు. ఎందుకు తెలియద ంటే.. ఎవరి యాపారాలు వారివి.. ఎవరి ఫ్రెండ్‌షిప్పు వారిది మరి!
ఆ మధ్య సమయంలో ఒక మహిళా నేత కొంగు బిగించి, వందలమంది మహిళా కార్యకర్తలను వెంటేసుకుని.. తన పార్టీ అధినేతను తిట్టిపోసిన అంబటి రాంబాబు ఇంటికి వెళ్లింది. ఇంటిముందు మహిళలతో నిరసన ప్రదర్శనకు దిగింది. బాబుపై నోరు పారేసుకున్న రాంబాబుకు చెప్పులు-చీపుర్లు చూపిస్తూ మహిళలు శివతాండవం చేశారు.
ఆలోగా పోలీసులొచ్చి వారిని బుజ్జగించారు. వెనక్కి వెళ్లమని అభ్యర్ధించారు. కానీ ఆ మహిళా నేత మాత్రం ససేమిరా అని మొండికేసింది. చంద్రబాబుకు, రాంబాబు క్షమాపణ చెబితే తప్ప కదిలేది లేదని భీష్మించింది. అది మీడియాలో సంచలనంగా మారింది.
ఇంతకూ రాంబాబు ఇంటి వద్ద వందలాదిమంది మహిళలతో వెళ్లి బైఠాయించిన ఆ మహిళా నేత, టీడీపీలో సీనియర్ కాదు. పార్టీలో తాను సీనియర్ నాయకురాలినని చెప్పుకునే నేత కూడా కాదు. గత ఎన్నికల్లో పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా ఎన్నికయిన బీసీ నేత గళ్లా మాధవి!
* * *
ఇది చాలాకాలం క్రితం ముచ్చట.
అది ఉమ్మడి రాష్ట్రం. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. పాణ్యం ఉప ఎన్నిక వచ్చింది. కోట్లపై పోటీకి టీడీపీ సీనియర్లు జంకుతున్న పరిస్థితి. ఆయనను ఢీకొట్టలేమంటూ చేతులెత్తేసిన వైనం. ఐదు వేల ఓట్లు కూడా రావని సీనియర్లు భయపెట్టిన సందర్భమది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో, రేణుకాచౌదరి శివంగిలా ముందుకొచ్చి.. కోట్లపై పోటీ చేసి, సై చెప్పిన ఆశ్చర్యకర పరిణామం.
పాణ్యంలో కోట్లపై పోటీ చేయలేమని ఆమె భర్త కూడా నిరుత్సాహపరిచారు. కానీ టీడీపీ సీనియర్ నేత, ఇప్పటి తెలంగాణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండూరి సాంబశివరావు ఆమెకు ధైర్యం నూరిపోసి, కదనానికి సిద్ధపడదామన్నారు. దానితో రేణుకా పాణ్యం టీడీపీ అభ్యర్ధిగా మారారు. చివరకు ఆమె నామినేషన్ ఫీజు కూడా ఆమె అనుచరుడయిన మండూరి సాంబశివరావే చెల్లించారు. ఆ విషయం ఆమెనే స్వయంగా చెప్పారు. అది వేరే కథ.
చావో రేవోగా భావించి బరిలోకి దిగిన ఆ ఉప ఎన్నికలో.. ఐదువేల ఓట్లు రావని సీనియర్లు భయపెట్టిన అదే రేణుకాచౌదరికి, 30 వేలకు పైగా ఓట్లు వచ్చిన వైనమది.
అప్పుడే కాదు.. అంతకు కొన్నేళకు ముందు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో .. గర్భవతిగా ఉండి, పోలీసు దాడులను తొడకొట్టి సవాల్ చేసింది కూడా అదే రేణుకా చౌదరినే!
సీనియర్లమని చెప్పుకునే వారంతా చేష్టలుడి చేతులెత్తేస్తే..సివంగి అవతారమెత్తి కాంగ్రెస్‌పై విరుచుపడిన రేణుకాచౌదరి తెగింపునకు సంబరపడిన ఎన్టీఆర్.. టీడీపీలో ‘ఒక్క మగాడు’ అని నోరారా ప్రశంసించారు. అంతకుముందు.. మరో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న నాటి సనత్‌నగర్ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ధైర్యాన్నీ ఎన్టీఆర్ ప్రశంసించారు.
ఇక్కడ గమ్మతేమిటంటే.. అప్పటికి కాట్రగడ్డ ప్రసూన గానీ, రేణుకాచౌదరి గానీ సీనియర్లు కాదు. అసలు వారికి రాజకీయ నేపథ్యమే లేదు. కానీ ఉన్నదల్లా లాభనష్టాలతో పనిలేనితెగింపు. ఆ తెగింపే వారిని ఎన్టీఆర్‌తో శహభాషనిపించుకునేలా చేసింది.
* * *
ఇప్పుడు మళ్లీ గుంటూరులోకి వెళితే.. అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు మహిళలను తీసుకువెళ్లి ధర్నా చేసిన గళ్లా మాధవి కూడా టీడీపీలో సీనియర్ కాదు. అసలు గత ఎన్నికల ముందు వరకూ ఆమెఎవరో జనాలకూ తెలియదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే ఆమెవరో తెలిసింది. ఈ రెండేళ్లలో ఆమె చుట్టూ లెక్కలేనన్ని వివాదాలు. గత కమిషనర్‌తో విబేథాలు. అది వేరే కథ.
కానీ రాంబాబు మాటలతో కార్యకర్తలు రగిలిపోతున్న వేళ.. అంబటి ఇంటి దగ్గర ప్రత్యక్షమై, రాంబాబుకు హెచ్చరికలు జారీ చేసిన గళ్లా మధవి కూడా.. ఇప్పుడు గుంటూరు టీడీపీలో ‘ఒక్క మగాడు’ కిందే లెక్క అన్నది, టీడీపీ సోషల్‌మీడియా సైనికుల కితాబు. ఎందుకంటే.. అంబటి ఇంటి ముందు ధర్నా చేయమని పార్టీ నాయకత్వమేమీ ఆమెను ఆదేశించలేదు. తనంతట తానే స్పందించి చేసిన నిరసన అది! సీనియారిటీ-సిన్సియారిటీ మధ్య ఇదే తేడా మరి!
గత ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించిన సీనియర్లు, రాత్రి వేళ వైసీపీ నేతలతో కులాసా కబుర్లు చెప్పే మరికొందరు సీనియర్లు, అధినేతలు-పార్టీ ఆఫీసు చుట్టూ చొక్కా నలగకుండా, ప్రదక్షణలు చేసే సో కాల్డ్ సీనియర్ల కంటే.. తానే మెరుగన్న సంకేతంతోపాటు, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమన్న మరో సందేశం-సంకేతం ఎమ్మెల్యే మాధవి చర్యలో కనిపించిందన్నది కార్యకర్తల మనోగతం. మొత్తానికి అంబటి ఎపిసోడ్లో గుంటూరు కారం తగిలింది.