Suryaa.co.in

Telangana

ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకవ్యక్తి న్యాయ కమిషన్

– కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి
– రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు
– యుద్దప్రాతిపదికన బీసీ సామాజిక ఆర్థిక కుల గణన,బి.సి ఓటర్ల గణనకు తీర్మానం
– పంజాబ్,తమిళనాడు లలో అధ్యయనం చేసిన అధికారుల బృందం
-నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏక వ్యక్తి కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉపసంఘం తీర్మానించింది.

ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలు లోకి తీసుకొస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై, రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్,దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం విదితమే.

ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో నాలుగోసారీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది.

మంత్రులు దామోదర రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ ,సితక్క లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ,అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్,లా సెక్రటరీ తిరుపతి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు.

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రజాభిప్రాయ సేకరణకు గాను, మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైంబౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేయాలన్నారు.

LEAVE A RESPONSE