-వైకాపాలో అసంతృప్తి పతాక స్థాయికి చేరే ఛాన్స్
-తాము చెప్పినట్టు పడి ఉండాలంటే… ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తిరగబడతారు
-హవ్వ… అంబేద్కర్ పేరు తొలగించి, జగన్ పేరు పెట్టుకోవడమా??
-గదిలో రక్తపు మరకలు శుభ్రం చేసిన వారికే వైఎస్ వివేక హత్యతో ప్రమేయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
వైకాపా నేతల్లో అసంతృప్తి క్షణక్షణానికి, దినదినానికి అంతకంతకు పెరుగుతోంది. అసంతృప్త నేతలను తమ పార్టీ నాయకులతో ఒకరిద్దరు తిట్టించినంత మాత్రాన ఈ అసంతృప్తులు ఆగవు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే మన ఆలోచన విధానం మారాలి. మనం ప్రభుత్వానికి కేవలం ట్రస్టీలమనే ఇంగిత జ్ఞానంతో వ్యవహరించాలి. మనం నియంతలం… ఎవరైనా మనం చెప్పినట్టే వినాలని అనుకుంటే మాత్రం, పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే ప్రమాదం ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.
మనల్ని ఈ పిచ్చి ప్రజలు ఎన్నుకున్నారని, ఏమి చేసినా భరించాలనుకోవడం తప్పు. ఇక పార్టీ ప్రజా ప్రతినిధులు తన బొమ్మ పెట్టుకుని గెలిచారని, తాము చెప్పినట్టే పడి ఉండాలనుకోవడం సరైన విధానం కాదన్నారు… ఈ అందగాడి బొమ్మను మాలాంటి అడ్రస్ లేని వాళ్ళం పెట్టుకుని గెలిచామట అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే గా ఎన్నికైన జగన్, ముఖ్యమంత్రి అయినప్పుడు, అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కున్న అధికారాలలో రవ్వంత అధికారాన్ని కోరుకోవడం తప్పేమీ కాదు కదా అని ప్రశ్నించారు.
జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?
వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి పార్టీ ఎందుకు పెట్టారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , ముఖ్యమంత్రి పదవిని ఆయనకు కట్టబెట్టడానికి నిరాకరించారు. దానితో, జగన్మోహన్ రెడ్డి అలిగి కాంగ్రెస్ ను వీడి శివకుమార్ దగ్గర పార్టీని కొనుక్కుని, ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యారు . సోనియా గాంధీనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే జగన్ కాంగ్రెస్ ను వీడి ఉండేవాడు కాదు.
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్ ఒక రూల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరొక రూలా? అంటూ ప్రశ్నించారు. పార్టీ పెట్టుకుని కీర్తించబడుతున్న జగన్ మాదిరిగానే, మంత్రి అవ్వాలనో, మరొకటి కావాలనో, లేకపోతే ఈ దురవస్థకు దూరంగా ఉండాలనో భావిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దేశద్రోహి గా, పార్టీ ద్రోహి అన్నట్లు చిత్రీకరించడం ఎంతవరకు సబబు అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు. ముఖ్యమంత్రి పిచ్చి మహారాజుని అందరినీ నమ్ముతుంటారని ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య పై స్పందిస్తూ… అందరినీ నమ్మితే టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎలాగైతే దారి చూసుకున్నారో … అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన దారి తాను చూసుకుంటుంటే విమర్శించడం మన భావ దారిద్రం తప్ప మరొకటి కాదని అన్నారు..
నాలుగేళ్లలో గత ప్రభుత్వాని కంటే మూడున్నర రెట్లు ఎక్కువ అప్పులు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం గత నాలుగు ఏళ్లలో చేసిన అప్పులు మూడున్నర రెట్లు ఎక్కువని రఘురామకృష్ణం రాజు తెలిపారు. టిడిపి ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 1.83 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయగా, గత నాలుగేళ్ల తమ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులను కలుపుకొని ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. అప్పుల విషయంలో తమ ప్రభుత్వ పెద్దలు చెప్పేవన్నీ అబద్ధాలే. వివరాల అడిగితే ఇవ్వరని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేవలం 16 వేలకోట్ల రూపాయల అప్పులను మాత్రమే చేయగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 80 వేల కోట్ల రూపాయల అప్పులు చేయడం విడ్డూరం. ఒకవైపు ప్రజా సంక్షేమం అంటూనే, ప్రజలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. పత్రికల్లో ప్రచార్భాటాన్ని చూసి ప్రజలంతా భ్రమలో పడిపోతారనేది సరి కాదు. ప్రజలు కూడా వాస్తవాలను గ్రహిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల పింఛన్ల సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. వాలంటీర్లను తప్పించి తమ పార్టీ కార్యకర్తలే, లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని దేవుడి మీద ప్రమాణం చేయిస్తూ, వృద్ధులకు పింఛన్ సొమ్ము అందజేస్తున్నట్లు సమాచారం. దేవుడి పైన ప్రజలకు ఉండే భక్తిని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ, రానున్న ఎన్నికల్లో ఓట్లను దండుకోవాలని తమ పార్టీ పెద్దల లక్ష్యంగా కనిపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తలు వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేస్తూ, ప్రమాణాలు చేయించే దృశ్యాలను చిత్రీకరించి, ఆ వీడియోను ప్రజలు ఎన్నికల సంఘానికి పంపాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. వృద్ధులకు ఇస్తున్న పింఛన్ సొమ్ము రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్మేనని గుర్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ విదేశీ విద్యకు ప్రతి ఏటా 300 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం… కేవలం 19 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన జగన్ సర్కార్
దళిత, గిరిజన విద్యార్థుల విదేశీ విద్య కోసం గత టిడిపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ప్రతి ఏడాది 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, నాలుగువేల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేసిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాల్పడిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట అంబేద్కర్ విదేశీ విద్య అని ఆ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు పెట్టారు. అయితే, ఇప్పుడు ఆ పథకం పేరును మార్చి, జగనన్న విదేశీ విద్య అని నామకరణం చేశారు. అంబేద్కర్ వంటి మహానీయుడి పేరును తొలగించి, ముఖ్యమంత్రి తన పేరును పెట్టుకోవడం సబబేనా?. ఈ విషయం గురించి జగన్ ఒకసారి ఆలోచించాలి… పునరాలోచించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి కొత్త పథకాన్ని తీసుకువచ్చినట్లుగా ప్రజల్లో అపోహ కలిగించే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. అయితే ప్రజలన్నీ అర్థం చేసుకుంటున్నారు. 213 మంది విద్యార్థులకు కేవలం 19 కోట్ల రూపాయలను కేటాయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రచారర్బాటం కోసం కోసం మాత్రం సాక్షి దినపత్రికలో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అడ్వర్టైజ్మెంట్ వేయించింది. గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యకు చెల్లింపులు ఆగాయని జగన్ ప్రభుత్వం పత్రిక ప్రచార అడ్వర్టైజ్మెంట్ లో పేర్కొనడం హాస్యాస్పదం.
ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వం తన చివరి సంవత్సరంలో చెల్లింపులు చేయడం కష్టం. కాబట్టి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దానికి గత ప్రభుత్వం అంటూ పెడార్థాలు తీయడం విడ్డూరమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పై దళిత గిరిజన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై మహాసేన రాజేష్ చక్కటి విశ్లేషణ చేశారు. రాజేష్ విశ్లేషణతో ఏకీభవిస్తున్నాను. దళిత గిరిజన విద్యార్థుల కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకుండా చేశారు. దీనితో ఆయా వర్గాల విద్యార్థులకు నాణ్యమైనవిద్య అందుబాటులో లేకుండా పోయింది. దళిత గిరిజన విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, కేవలం అమ్మ ఒడి పథకం నగదు అందజేస్తున్నామన్న సాకును చూపెట్టి, కల్పించడం లేదు. విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకు వచ్చామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, 6000 విద్యాసంస్థలను మూసివేసి, విద్యార్థులకు స్కూళ్లను దూరం చేసింది. ఒక్క ఉపాధ్యాయ నియామకం లేకుండానే, విద్యార్థులంతా ఇంగ్లీషులోనే మాట్లాడాలని చెప్పడం హాస్యాస్పదం.
గత 25 ఏళ్ల క్రితం ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి కనీసం శిక్షణ కూడా ఇవ్వకుండా, ఇంగ్లీషులో పాఠాలు బోధించాలని చెప్పడం విడ్డూరం. ఇక మునిగిపోనున్న పడవ లాంటి బైజుస్ సంస్థ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకొని వందల కోట్ల రూపాయలు కట్టబెట్టింది. ట్యూషన్లు చెప్పే సంస్థతో, ఎవరైనా పాఠాలు బోధించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంటారా?. మళ్లీ ఆ పాఠాలు కూడా అంతగా కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఉపాధ్యాయులనే చెప్పమనడం సిగ్గుచేటు. విద్యా వ్యవస్థను బాగు చేస్తామని చెప్పి అవస్థల పాలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్, మెడికల్ ఎడ్యుకేషన్ నిధులను లాక్కొని ప్రభుత్వం ఖర్చు చేసిందంటూ రఘురామకృష్ణం రాజు ఫైర్ అయ్యారు. విద్యా వ్యవస్థను బాగు చేయడం అంటే కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడడం కాదు… క్షేత్రస్థాయిలో విద్యార్థులకు మౌలిక వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించడం అని పేర్కొన్నారు..
వైఎస్ వివేక హత్య సూత్రధారుల అరెస్టుకు రంగం సిద్ధం
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య లో సూత్రధారుల అరెస్టుకు రంగం సిద్ధం అయిందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇప్పటికే హత్య పాత్రధారులు అరెస్టు కాగా, ఇప్పుడు సూత్రధారులను అరెస్టు చేస్తూ ఉండవచ్చు. గత ఎన్నికలకు ముందు జరిగిన కోడి కత్తి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంఘటనలు తమ పార్టీకి కలిసి వచ్చాయి… ఇప్పుడా రెండు సంఘటనలు తమ పార్టీకి ప్రమాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సిబిఐ అధికారులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిని, వైయస్ భారతి రెడ్డి సహాయకుడు నవీన్ ను విచారణకు పిలిచి ఆరు గంటలపాటు విచారించినట్లు పత్రికలలో కథనాలు వచ్చాయి. వివేక హత్య కేసు ఇప్పటివరకు నత్త నడక సాగగా, ఇప్పుడు వేగం పుంజుకున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ వివేక హత్యాకాండ అనంతరం టెలిఫోన్ కాండపై సిబిఐ అధికారులు దృష్టి సారించి, హత్యకు ముందు రోజు, ఆ మరుసటి రోజు వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ డేటాను సేకరించి, దాని ఆధారంగా తమ అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి ఓఎస్డిని, భారతీ రెడ్డి సహాయకున్ని పిలిచి తమ వద్దనున్న ఆధారాల ఆధారంగా ప్రశ్నించి ఉంటారు. వైయస్ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల విచారణలో చెప్పిన సమాధానాలతో, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ రెడ్డి సహాయకుడు నవీన్ ఇచ్చిన సమాధానాలతో సరి చూసుకుంటారు. కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విచారణలో పేర్కొనే సమాధానాల ఆధారంగా, వారి యజమానులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిని, నవీన్ ను విచారణకు పిలుస్తున్నట్లు పత్రికా ప్రతినిధులకు ముందే ఎలా తెలిసిందని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
గతంలో తనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఒక కేసు విషయంలో నోటీసులు జారీ చేయకముందే, జారీ చేసినట్లుగా సాక్షి దిన పత్రికకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. జర్నలిస్టులు సత్యాన్వేషణ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయినా ఈ కేసులో నవీన్ ను మాత్రమే విచారిస్తారని జర్నలిస్టులు గుర్తించారని, ఓ ఎస్ డి నీ విచారణకు పిలుస్తారని వారు కూడా భావించలేదన్నారు. సాక్షి దినపత్రికలో ముఖ్యమంత్రి ప్రతిష్టను మసకబార్చే విధంగా టిడిపి కుట్రలంటూ ప్రత్యేక వార్తా కథనం రాయడం విడ్డూరం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సిబిఐ అధికారులను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటే, ఈ కేసు ఇన్ని రోజులు సాగదీసే అవకాశం ఉండేదా?. చిరు వ్యాపారికి ఉండే సమయస్ఫూర్తి కూడా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నాయని భావిస్తున్న సజ్జలకు లేదా అంటూ ఎద్దేవా చేశారు.
సజ్జల అత్యుత్సాహం వల్ల ఈ కేసులో అంతంత మాత్రంగానే ఉన్న వారి పరిస్థితి మరింత దిగజారినట్లుగా కనిపిస్తోంది. వైయస్ అవినాష్ రెడ్డికి, వివేకానంద రెడ్డి హత్య జరిగిందని తెలిస్తే, ఎందుకని సంఘటనా స్థలానికి వెళ్లలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతి రెడ్డికి సమాచారం అందించి, వైఎస్ వివేక కుమార్తె సునీతకు హత్య జరిగిన విషయాన్ని వెంటనే ఎందుకు తెలియజేయలేదన్న లాజిక్ సజ్జల రామకృష్ణారెడ్డి మిస్సయ్యారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇక సాక్షి దినపత్రికలో రకరకాల పేర్లను వైఎస్ వివేక హత్యతో జోడిస్తూ విపరీత ప్రయోగం చేశారు. ఒకవేళ వైఎస్ వివేక హత్యతో వీరికి సంబంధం లేకపోతే రక్తపు మడుగులా ఉన్న గదిని శుభ్రం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. శవానికి కుట్లు వేయాల్సిన అవసరం ఏముంది. కాంపౌండర్ జయప్రకాశ్ రెడ్డి వైఎస్ వివేక శవానికి కుట్లు వేసి, బ్యాండేజ్ ఎందుకు కట్టారు. హత్య జరిగితే, గుండెపోటుతో మరణించినట్లుగా సీన్ ఎందుకు సృష్టించారు. ఈ హత్యను వీరికి సంబంధం లేని వ్యక్తులు చేసి ఉంటే సీఐ శంకరయ్య నోరును ఎందుకు నొక్కారు. నూటికి నూరుపాళ్ళు వీరికి కావలసిన వారి నేతృత్వంలోనే హత్య జరిగి ఉండకపోతే, హత్యను గుండెపోటుగా మార్చాల్సిన అవసరమే లేదు. ఈ కేసు విచారణ నిమిత్తం స్టాచ్యూరిటీ బెయిల్ పై ఉన్న వ్యక్తిని మరొకసారి విచారణకు పిలిచినట్లు తెలిసింది… అసలు వాళ్లను ఈ కేసులో విచారణకు పిలిచే ముందు ఇదంతా ఒక ప్రక్రియ. వీళ్ళు చెప్పేదానికి, రేపు యజమానులు చెప్పే దానికి సిబిఐ అధికారులు సరి పోల్చుకొని ఒక నిర్ణయానికి వస్తారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ప్రయోగాత్మకంగా 11మద్యం షాపులలో డిజిటల్ లావాదేవీలట…
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల కోసం ఒక వైపున పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో మాత్రం 2980 మద్యం షాపులు ఉండగా కేవలం 11 వాక్ ఇన్ మద్యం దుకాణాలలో ప్రయోగాత్మకంగా డిజిటల్ లావాదేవీలను నిర్వహించనున్నట్లు పేర్కొందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మద్యం విక్రయాలను నగదు లావాదేవీలలో కాకుండా, డిజిటల్ లావాదేవీల ద్వారా విక్రయించాలని తాను పార్లమెంటులో లేవనెత్తాను. నగదు లావాదేవీల వల్ల కొంత మొత్తం నగదు చేతులు మారుతున్నట్టుగా అభియోగాలున్నాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాశాను. ప్రధానమంత్రికి రాసిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేసి విచారణకు కోరాను. హోం మంత్రిత్వ శాఖ నుంచి తనకు సమాధానం అందిందని లేఖను మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుంది. అందుకే, గత నాలుగేళ్లుగా మద్యం విక్రయాలలో నగదు లావాదేవీలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టకేలకు 11 మద్యం దుకాణాలలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి అంగీకరించింది. అయితే, వాకిన్ మద్యం దుకాణాలు కావడంతో, ఈ మద్యం దుకాణాలలో చీఫ్ లిక్కర్ ఉండే అవకాశం లేదు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలలో డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తామని పేర్కొనడం పరిశీలిస్తే, ఎన్నికలకు ముందు సాక్షి దినపత్రికలో నాలుగైదు సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని, మద్యం షాపుల్లో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడం పట్ల హైకోర్టు చివాట్లు పెట్టింది. కంప్యూటర్లు పనిచేయకపోవడం వల్లే పనిచేసిన వారికి చెల్లింపులు చేయడం లేదని పేర్కొనడం హాస్యాస్పదం. నాలుగో తేదీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు సింహభాగం జీతాలు అందలేదు. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు రాజు కాదు… ప్రధాన సేవకుడు. ఆయన ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఒక మాజీ మంత్రి పేర్కొనడం విడ్డూరమని రఘురామకృష్ణం రాజు అన్నారు. సచివాలయం, అసెంబ్లీ ఉన్న దానినే రాజధాని అని అంటారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటే దానిని రాజధాని అనరు.. అలాగని అభివర్ణించడం సిగ్గుచేటని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.