– అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు
– నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు
– నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌ల గుర్తింపు
-మంత్రి కొల్లు రవీంద్ర
గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటు వివరాలు ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇసుక విధానంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎండీసీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 16 నుంచి 108 ఇసుక రీచ్‌లు తెరవాలని నిర్ణయించామని తెలిపారు. నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు తీసుకొస్తామన్నారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరకు పట్టా భూముల్లోని ఇసుక పొందవచ్చన్నారు. నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌లు ఉంటే గుర్తింపు ఇస్తామన్నారు. అలాగే కొత్త ఇసుక రీచ్‌లపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 1-2 నెలల్లో రాష్ట్రమంతటా ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ఇసుక విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన 40 వాహనాలు జప్తు చేసినట్లు గుర్తుచేశారు. ఇసుక కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు.
ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక పొందవచ్చన్నారు. రోబో శాండ్‌పై త్వరలో విధానం రూపొందిస్తామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక నిల్వలన్నీంటిని ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో అందుబాటులో 35 లక్షల టన్నుల ఇసుక ఉందన్నారు.
ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల ఇసుక వినియోగదారులకు అందించామన్నారు. ప్రస్తుతం ఇసుక తవ్వకం, వెలికితీత, ర్యాంప్ నిర్మాణం, సీనరేజ్ పన్ను మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మద్యం దుకాణాల ద్వారా రూ.30 వేల కోట్లు ఆదాయం అంచనా వేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కంటే 10-15 శాతం అదనపు ఆదాయం అంచనా వేశామన్నారు.
గత ప్రభుత్వం మద్యం విధానాన్ని భ్రష్టుపట్టించింది
తయారీ నుంచి విక్రయాల వరకు గత ప్రభుత్వం మద్యం విధానాన్ని ప్రభుత్వ అధీనంలోనే పెట్టుకుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకొని దోపిడీ చేశారని దుయ్యబట్టారు. తాజాగా మద్యం విధానాలపై సబ్‌కమిటీ అధ్యయనం చేసి, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇచ్చేలా విధానం రూపొందించిందని అన్నారు. అన్ని మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవాలని చెప్పారు.
‘‘ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. గుడికి, బడికి 100 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ దుకాణాలను మూసివేయిస్తాం.
గత ప్రభుత్వంతో పోలిస్తే పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా తయారైంది. బెల్ట్ షాపులు నిర్వహిస్తే తీవ్ర చర్యలుంటాయి’’ అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్, అబ్కారీ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.