– మోసం చేసిన కమిటీ పెద్దలపై విచారణ జరపి శిక్షించాలి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జెఎన్జేహెచ్ఎస్ సభ్యుల విజ్ఞప్తి
మార్చి 26ః వెయ్యి మంది జర్నలిస్టుల కుటుంబాలను రోడ్డున పడేసే కమిటీ పెద్దల కుట్రలపై విచారణ జరిపించాలని…పేట్ బషీరాబాద్, నిజాంపేట్ స్థలాలనే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సోసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సోసైటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 16 ఏళ్ల నుంచి తాము పడుతున్న కష్టాలను మీడియా ముందు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరే మాకు దిక్కంటూ వేడుకున్నారు.
సోసైటీ ఏర్పడిన నాటి నుంచి సభ్యులను కమిటీ పెద్దలు మభ్యపెడుతూ కుట్రలకు పాల్పడ్డారని.. ప్రభుత్వాలు ఇచ్చిన నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాలను కుట్రపూరితంగా డెవలప్ చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారని జెఎన్‌జే హెచ్ ఎస్ సభ్యులు ఆరోపించారు. నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్లో అక్రమ కట్టడాల వెనకాల అప్పటి కమిటీ పెద్దలు ఉన్నారని, వారిపై విచారణ చేపడితే వారి మోసాలన్నీ బయటకు వస్తాయన్నారు.
2008లో జెఎన్‌జే సోసైటీ ఏర్పడిన తర్వాత ఒక్కక్కరి నుండి 2లక్షల చొప్పున దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేశారని, అందులో 12.33 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ చేశారన్నారు. అప్పటి నుండి సభ్యుల డబ్బులను దుబారా చేయడమే కాకుండా…ఎలాంటి జీబీలు, సమావేశాలు, ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా సోసైటీని నడిపించారని ఆరోపించారు.
సభ్యులు అఫిడవిట్ ఇచ్చి స్థలాలు తీసుకోవచ్చని 2010లో హైకోర్టు చక్కని రూలింగ్ ఇచ్చినా… సభ్యులకు తెలియజేయకుండా దాచిపెట్టడమే గాక, కనీసం జీబీ లేకుండా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారని జర్నలిస్టు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో డెవలప్ చేసుకోవచ్చని, 2022లో నిర్మాణాలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఆ తీర్పును కాలదోషం పట్టించి సభ్యులను కమిటీ పెద్దలు నిండా మంచారని తెలిపారు. మరోవైపు నిజాంపేట్ , పేట్ బషీరాబాద్‌లో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ లాభం పొందినట్లు సభ్యులు ఆరోపించారు.
ముఖ్యమంత్రి మీరే దిక్కు
అపాయింట్ మెంట్ ఇస్తే కష్టాలు చెప్పుకుంటాం. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళితే సావధానంగా విని, అధికారంలోకి వచ్చిన వెంటనే పేట్‌బషీరాబాద్ స్థలాన్ని అప్పగించినందుకు సభ్యులు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఎంతో ఉదారంగా ఇచ్చిన స్థలాన్ని కూడా కమిటీ పెద్దలు కుట్రపూరితంగా హ్యాండోవర్ చేసుకోకుండా తమ పొట్ట కొట్టారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిటీ పెద్దల తీరుతో ఇప్పటికే చాలా అన్యాయమై పోయిన తమను ముఖ్యమంత్రి ఆదుకోవాలని, ఏ స్థలాల కోసం 16 ఏళ్ల కిందట డబ్బులు కట్టామో వాటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగ బాధ్యతలు చూస్తున్న జర్నలిస్టులకు నగరానికి సుదూరంగా ఇవ్వడం సరికాదన్నారు. ఇక్కడ కూడా బడుగు జర్నలిస్టుల పొట్టకొట్టడానికి బడా జర్నలిస్టుల పేరిట అవే కుట్రలు జరుగుతున్నాయని, వారిని దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే దాదాపు 90 మంది సభ్యులు చనిపోయారని, మరో 200 మందికి పైగా జర్నలిస్టులు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇస్తే… 16 ఏళ్ల నుంచి తమపై జరుగుతున్న మోసాలు, తాము పడుతున్న కష్టాలను వివరిస్తామని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సోసైటీ సభ్యులు వేడుకున్నారు.