– సాధారణ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధం ప్రారంభించా
– నాకు మంత్రి పదవి రాలేదని ఎవరూ బాధపడొద్దు
– ఇకపై జగన్మోహన్ రెడ్డిని వాడు, వీడు అనను
– ఇప్పటి పాలక పక్షం… అప్పటి ప్రతిపక్షాలు మేల్కొన ముందే తొలి కోడిలా నేను మేల్కొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించా
– నాలుగేళ్లలో 1400 నుంచి 1500 గంటల పాటు రచ్చబండ కార్యక్రమం, ఏబీఎన్, టీవీ5 ప్రైమ్ టైం షో లలో, వివిధ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టా
– 2020 లో నేను యజ్ఞాన్ని ప్రారంభిస్తే మహామునులైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి వారు ఆ క్రతువు ముగించారు
– ఈ మహాక్రతువులో నా పాత్ర నాయకులకు తెలిసినా తెలియనట్టు నటించవచ్చు… కానీ ప్రజలందరికీ తెలుసు
– జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని కష్టపడ్డాను. ఎన్నో కేసులు వేశా
-కాబట్టి చంద్రబాబు నాయుడు నాకు ఏ పదవి ఇవ్వకపోయినా తప్పు లేదు
– మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం ఖర్చు చేసిన షుమారు ముప్పైకోట్ల రూపాయలను వెనక్కి తిరిగి ఇవ్వాలి
– కర్మ సిద్ధాంతం ప్రకారం మనమేదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది
– చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు
– కానీ అదే జగన్మోహన్ రెడ్డికి దేవుడు, ప్రజలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదానే లేకుండా చేశారు
– కోడెలని ఫర్నిచర్ దొంగ అంటూ నానా యాగి చేసిన వైకాపా నేతలు… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి?
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజా వ్యతిరేక విధానాలపై ఇప్పటి పాలకపక్షం అప్పటి ప్రతిపక్షాలు మేల్కొనముందే తొలి కోడిలా మేల్కొని ప్రశ్నించానని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నేను యుద్ధం మొదలు పెట్టినప్పుడు, రానున్న ఎన్నికల్లో అతను కచ్చితంగా ఓడిపోతాడని భావించ లేదు కానీ ప్రయత్నం మాత్రం మొదలు పెట్టాను.
అప్పటికే నాకు నిక్షేపంగా కేంద్ర సహాయ మంత్రి హోదా కలిగిన లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ పదవి తో పాటు నాలుగున్నర సంవత్సరాల ఎంపీ పదవీకాలం కూడా ఉన్నదని గుర్తు చేశారు. నాకున్న పదవి ఖచ్చితంగా పోతుందని తెలిసిన కూడా జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న సంకల్పంతో అప్పుడే తాను యుద్ధం మొదలు పెట్టానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడించడమే కాదని, ఈ ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన గురించి పూర్తిగా వివరించాలని 2020లో నేను యజ్ఞాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ప్రారంభించిన యజ్ఞక్రతువును ముగించడానికి మహామునులైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి పెద్దలు వచ్చి చేరారన్నారు. నేనొక సాధారణ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధం ప్రారంభించానని, అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది రాజు గారికి అన్యాయం జరిగిందని అంటున్నారని తెలిపారు.
నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, తెదేపా, జనసేన , బిజెపి కలుస్తాయన్న ఆలోచన వారికి కూడా రాకముందే… ఈ మూడు పార్టీలు కలుస్తాయని నేను చెప్పానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా, ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈ మూడు పార్టీలు కలవాలన్నది నా ఆశయం అని తెలిపారు. నా ఆశయాన్ని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెరవేర్చారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలన్నది నా ఆశయమని, ఆ ఆశయం నెరవేరిందని తెలిపారు.
రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పడిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి సారథ్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రామాయణ యుద్ధం రామ, లక్ష్మణ, హనుమంతుడు చేసినప్పటికీ, ఉడుత సహాయం కాకుండా చాలా ఎక్కువే. ఈ క్రతువులో నా పాత్ర కూడా ఉంది. నాయకులకు ఈ విషయం తెలిసిన తెలియనట్లు నటించవచ్చునని కానీ ప్రజలందరికీ తెలుసునన్నారు.
ఏ పదవి ఆశించి ఈ పని చేయలేదన్న రఘురామకృష్ణం రాజు, నాకున్న పదవిని కూడా లెక్క చేయలేదని గుర్తు చేశారు. నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని నేను కష్టపడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని కష్టపడ్డాను. ప్రజలు నా కోరిక నెరవేర్చారు. ఒక రాక్షసుడిని పదవిలో నుంచి దించానని అత్యంత ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఇద్దరు మంచి వ్యక్తుల నేతృత్వంలో రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పడడానికి అందులో నా పాత్ర కూడా చాలా ఉన్నదని ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించనందుకు భగవంతుని సాక్షిగా చెబుతున్నానని… నేనేమీ బాధపడడం లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఎంతోమంది ఫోన్ కాల్ చేస్తూ, మెసేజ్ లు పంపుతూ నాకు మంత్రి పదవి రానందుకు వారు బాధపడుతూ నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని పోరాటం చేశాను. నా కోరిక నెరవేరింది. నాకు మంత్రి పదవి కావాలన్నది, ఇంకొక పదవి కావాలన్నది నా కోరిక కాదు. నన్ను ప్రేమించే అభిమానులు ఎవరూ కూడా నాకు మంత్రి పదవి రాలేదని బాధపడవద్దని రఘురామ కృష్ణంరాజు కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కానీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి , ప్రతిపక్షం అన్నదే లేకుండా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీకే దక్కాలని ఆశించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మొదటి రోజు నుంచే హాజరుకావాలని, ప్రతిపక్ష హోదా దక్కకపోయినప్పటికీ, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.
మా ప్రభుత్వం తప్పు చేయదు.. ఏమైనా తప్పు చేస్తే, గతంలో నేను ఈ తప్పు చేశాను… మీ ప్రభుత్వం లో ఆ తప్పులు చేయవద్దని సూచనలు ఇవ్వండని హితవు పలికారు. ప్రజల తరపున పోరాటం చేయడానికి ఒక్కరైనా చాలు. ఒక్కడిగానే నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటం చేశాను. ఆ తరువాత ప్రజలు, నాయకులు నాతో పాటు కలిసి వచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉంటూ ఆయన ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపాను.
పోరాటం చేయడానికి ఒక్కరు చాలని, కానీ వైకాపాకు అసెంబ్లీలో 11 మంది సభ్యుల బలం ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు కూడా గైర్హాజరు కావద్దని జగన్మోహన్ రెడ్డికి సూచించిన రఘురామకృష్ణంరాజు, పార్లమెంట్ సమావేశాలలో ఎంపీగా 100కు 100% సమావేశాలలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలలో కూడా ఎమ్మెల్యేగా నేను పెద్దగా చేసేది ఏమీ లేకపోయినప్పటికీ పాల్గొంటానని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే గతాన్ని మర్చిపోయి కలుసుకుందామని చెప్పారు.
ప్రభుత్వం మీపై కేసులు పెట్టవచ్చు. మీరు తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తారు. తప్పు చేసిన వారెవరైనా చట్ట ప్రకారం శిక్షార్హులేనని గుర్తుంచుకోవాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం యాత్ర చేపట్టనున్నారు.
పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేయడానికి ఆయన కంకణ బద్ధులై ఉన్నారు. ఇప్పటికే అమరావతి వెలిగిపోతోందని, ప్రజలంతా కోరుకున్నట్లుగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నేతృత్వంలో ఇప్పటికే అడుగులు పడ్డాయన్నారు. తాజ్ మహల్ కు రాళ్ళెత్తిన కూలీల మాదిరిగా ఈ ప్రయత్నానికి మా లాంటి వారంతా సహాయ సహకారాలను అందజేస్తారని తెలిపారు.
ఒక్క నిమిషం ఎక్కువే మాట్లాడాను తప్ప… తక్కువ మాట్లాడలేదు
2020 జూన్ లో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగు సంవత్సరాల పాటు వారానికి కనీసం ఐదు రోజులు, ఒక్కొక్కసారి వారానికి ఏడు రోజుల చొప్పున సంవత్సరానికి 365 రోజులు 50 వారాల్లో, 100 రోజులు తీసివేసి 250 రోజులపాటు అంటే నాలుగు సంవత్సరాలలో 1000 రోజులు ప్రతిరోజు 45 నిమిషాల చొప్పున 800 నుంచి 900 గంటలపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అప్రజా స్వామికమైన విధానాలను, తప్పుడు కేసులను, దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగట్టానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డెడ్ గా ఉన్నదని, కావాలంటే ఇంటర్నెట్ లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చునని అన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారానే కాకుండా వారానికి మూడు రోజులపాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 లు నిర్వహించే ప్రైమ్ టైం చర్చ గోష్టి కార్యక్రమాలలో వెంకటకృష్ణ, సాంబశివరావు, మూర్తి లతో తొలి 20 నిమిషాల పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లా చర్చించే వారినని గుర్తు చేశారు. ఇక వారానికి వివిధ ఛానళ్లతో రెండు, మూడు ఇంటర్వ్యూల రూపంలో మాట్లాడానని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, అదొక 400 గంటల సమయంగా లెక్కిస్తే 1400 నుంచి 1500 గంటలపాటు మీడియాతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను వివరిస్తూ, ప్రజలతో చర్చించానని తెలిపారు. నేనేమీ సొంత డబ్బా కొట్టుకోవడం లేదని, ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు.
2019 నవంబర్ లో రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని నేను అప్పుడే తప్పు పట్టానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని, ప్రజలకు ఇచ్చిన మాట తప్పవద్దని జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించినట్లు తెలిపారు. అలాగే 2014 నుంచి 19 వరకు శాసనసభాపతిగా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు గురించి అనుచితంగా మాట్లాడడాన్ని నేను పూర్తిగా విభేదించాను.
ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీఈఓ గా కొనసాగుతున్న వెంకటకృష్ణ, అప్పట్లో ఏ పీ 24/7 టీవీ లో కొనసాగుతున్నారు. ఆయన నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొని కోడెల శివప్రసాదరావును ఉద్దేశించి వైకాపా నేతలు , మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తప్పని వ్యతిరేకించాను. శాసనసభాధిపతిగా వ్యవహరించిన కోడెలకు గౌరవం ఇవ్వాలని, వ్యక్తికి కాకపోయినా ఆయన కూర్చున్న కుర్చీకైనా గౌరవం ఇవ్వాలని సూచించాను.
కోడెల శివప్రసాద రావు ఫర్నిచర్ అపహరించారని చేసిన ఆరోపణలు అసంబంద్ధంగా గా ఉన్నాయని ఒక్కొక్క కుర్చీకి పదివేల రూపాయల చొప్పున లెక్క కట్టిన 100 కుర్చీలకు పది లక్షల రూపాయల కూడా కావని పేర్కొనడం జరిగింది. దానికోసం ఇంతా యాగి చేయడం అవసరమా?, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎంపీగా ఎన్నికైన రెండవ నెలలోనే పార్టీ నాయకత్వానికి సూచించడం జరిగిందన్నారు. ఏమైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు అవి కన్స్ట్రక్టివ్ గా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని, లేకపోతే లేకి, చెత్త కామెంట్లు చేయడం సరైనది కాదని ఎన్టీవీ, ఏపీ 24/7 లలో నిర్వహించిన కార్యక్రమాలలో చెప్పానని పేర్కొన్నారు.
ఒకరకంగా అప్పుడే నాకు పార్టీ నాయకత్వానికి మధ్య విభేదానికి చిన్న బీజం పడింది . నేను ఇప్పుడు ఎవరి మెప్పుకోసమో ఈ విషయాన్ని చెప్పడం లేదు. నేను ఎన్టీవీ , ఏపీ 24/7 టీవీ ఛానెళ్ల లో పాల్గొన్న డిబేట్ కార్యక్రమం రికార్డెడ్ గా ఉంటుందని, ఎవరైనా పరిశీలించుకోవచ్చునని తెలిపారు . ఇది చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు… చింపేస్తే చిరిగిపోయేది కాదన్నారు.
అప్పుడే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నాతో పార్టీకి ఒక లైన్ ఉంటుందని, పార్టీ లైన్ ప్రకారం తిట్టమంటే తిట్టాలని పరోక్షంగా చెప్పడం జరిగింది. అక్రమంగా అన్యాయంగా మాట్లాడడం తన వల్ల కాదని, ఇలాంటి పనికిమాలిన సలహాలు దయచేసి నాకు ఇవ్వవద్దని వారి విజ్ఞప్తిని తిరస్కరించాను. ఇది వారి మనస్థాపానికి ఒక కారణమై ఉంటుంది.
గతంలో జగన్మోహన్ రెడ్డిని వాడు, వీడని అన్నానని, అది కూడా నన్ను చంపాలని చేసిన ప్రయత్నం గుర్తుకు వచ్చినప్పుడల్లా అనడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇప్పుడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వయసులో నాకంటే చిన్నవాడైనప్పటికీ, నా స్నేహితుడి కుమారుడిగా ఆయన్ని గౌరవిస్తానని తెలిపారు. చాలా కాలం తర్వాత రచ్చబండ పేరుతో మళ్లీ చర్చ ప్రారంభిస్తున్నాను.
ఇటీవల మీడియా సమావేశంలో పత్రికా, టీవీ చానల్స్ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. రచ్చబండ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకోక పోయినప్పటికీ, ఈరోజు న్యూస్ పేపర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం 45.5 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టడం గురించి ప్రజలతో చర్చించాలని అనుకున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఇంటి మరమ్మతులు, ఫర్నిచర్, ఇతర సామాగ్రి కల్పన కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని అణా పైసల తో సహా తిరిగి వసూలు చేయాలని రఘు రామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం దాదాపు 45.5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంటి కోసం, తన సొంత అవసరాల కోసం ఇంత ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారంటే ఆశ్చర్యం అనిపించక మానదు.
జగన్మోహన్ రెడ్డి తన ఇంటి మరమ్మతులు, ఇతరత్రా సౌకర్యాల కోసం చేసిన ఖర్చులో ఏ ఖర్చును జగన్మోహన్ రెడ్డి నుంచి వెనక్కి రాబట్టాలన్న దానిపై ఒకసారి చర్చిద్దాం అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్కతో తలుపుల ఏర్పాటు కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అవి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇవ్వాలి.
2019లో జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ పది మీటర్ల రోడ్డు వెడల్పు కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ప్రజలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో ఈ ఖర్చును వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి రక్షణ కోసం ఆయన ఇంటి పరిసరాలలో ప్రత్యేక ఏర్పాట్లు, హెలిపాడ్, పోలీస్ భారీ కేడ్లు నిర్మాణం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి రక్షణ కోసం ఖర్చు చేసిన ఈ కోటి రూపాయలను జగన్మోహన్ రెడ్డి వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, సీసీటీవీలను అమర్చడం కోసం 3.62 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చును వెంటనే జగన్మోహన్ రెడ్డి నుంచి రికవరీ చేయాలి. అత్యధిక ఏసీ సౌకర్యం కల్పన కోసం కోటిన్నర ఖర్చు పెట్టారు. కచ్చితంగా ఈ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట లైటింగ్ కోసం 11.5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి లైటింగ్ కోసం చేసిన ఖర్చులు తిరిగి రాబట్టాలి.
ప్రజా దర్బార్ కోసం ఏర్పాట్ల కోసం 32 లక్షల రూపాయలు వెచ్చించారు. క్యాంపు కార్యాలయంలో పీవీసీ రూఫ్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటుకు 22.5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి తిరిగి వెనక్కి రాబట్టాలి. ఇంటి చుట్టూ రహదారి కోసం 7.8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రోడ్డు నిర్మాణం అనేది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఆ మొత్తాన్ని వదిలేద్దాం. క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ నిర్వహణ కోసం 3.45 కోట్లు ఖర్చు చేశారు.
అలాగే 85 అంగుళాల ఓ ఎల్ ఈ డి టీవీ ల కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారంటే ఇక్కడే దాదాపు 5కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. విలువైన సోఫాలు, కుర్చీలు, లాంజ్ సోఫాలను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని జగన్మోహన్ రెడ్డి ఉంచేసుకుని, బిల్లుల ప్రకారం వాటి కోసం అయిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాలి. దేవాలయ సెట్టింగ్, ఇతర సెట్టింగ్ కోసం కోటి అరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి దేవాలయానికి వెళ్ళరని అందుకే సెట్టింగ్ వేశారు. ప్రస్తుతానికి ఈ ఖర్చును సస్పెన్స్ లో పెడదాం. ఈ లెక్కన ఎన్నో కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే ఫర్నిచర్ వ్యవహారంలోనే శాసనసభాధిపతిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ను గతంలో అంబటి రాంబాబు చేత నానా మాటలు అనిపించారని గుర్తు చేశారు. ఆ మంచి వ్యక్తిపై కారు కూతలు కూశారని, ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే కుర్చీలను కొట్టేశారని నీలాప నిందలు మోపారు . తన వద్ద కొంత ఫర్నిచర్ ఉందని దానికి లెక్క కడితే ఆ మొత్తాన్ని చెల్లిస్తానని కోడెల శివప్రసాదరావు మంచి మనసుతో ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే, ఆ లేఖను తొక్కి పెట్టి ఆయన్ని ఫర్నిచర్ దొంగ అంటూ అందరి చేత మాట్లాడించారన్నారు. కోడెల శివప్రసాదరావు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునే విధంగా మానసికంగా హింసించారు.
కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు అదే విమర్శలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకున్న సౌకర్యాలు, సామాగ్రికి లెక్క కట్టి తానే ముందుకు వచ్చి ప్రభుత్వానికి అందజేయాలి. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా, పారిశ్రామిక వేత్త గా గుర్తింపు పొందిన జగన్మోహన్ రెడ్డి చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు. లేకపోతే కంప్యూటర్లు కొట్టేశారని, ఫర్నిచర్ దొంగిలించారని, పెద్ద పెద్ద టీవీలను సోఫాలను కొట్టేశారనే అపవాదును ఎదుర్కోవలసి వస్తుంది.
ఆర్థికంగా దెబ్బతిన్న కోడెల శివప్రసాదరావును అన్ని మాటలు అన్నప్పుడు, దేశంలోనే అత్యంత ధనికుడైన జగన్మోహన్ రెడ్డిని అనకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి అంటే గత ఐదేళ్ల కాలంలో తన జీతం 50 లక్షల నుంచి కోటి రూపాయలని అనుకున్న ఆ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన సొమ్ము చెల్లిస్తే ఆయన కు తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంటుందన్నారు.
పోయేటప్పుడు డబ్బులు ఎవరూ పట్టుకుపోరని, ఇవాళ డబ్బు ఉంటుంది… పదవి ఉంటుంది కానీ రేపు డబ్బు పోతుంది … పదవి పోతుందన్నారు. కానీ శాశ్వతమైనది కీర్తి మాత్రమేనని, ఆ కీర్తి కోసమైనా షంషేర్ గా లెక్క కట్టి ప్రభుత్వానికి డబ్బులు వెనక్కి ఇవ్వాలన్నారు. పదవుల్లో ఎవరు శాశ్వతం కాదని ఈ సరికొత్త సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి నెలకొల్పితే, రేపు పదవి నుంచి దిగిపోయే ఎవరైనా ఈ సత్ సాంప్రదాయాన్ని పాటిస్తారని నా స్నేహితుడి కొడుకు అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహా, సూచనను ఇస్తున్నానని తెలిపారు.
ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది
ఏదైతే అవతలి వ్యక్తికి జరగాలని కోరుకుంటామో అదే తిరిగి మనకు వచ్చేయటం అన్నది కల్లారా చూస్తున్నామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా అన్నది కూడా లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. 23 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు మంది తమ వైపు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని, ఓ నలుగురు, ఐదుగురిని లాక్కున్నారు. అంతకుమించి లాక్కోలేకపోయారు.
అసెంబ్లీ కౌరవ సభగా మారిందని, కౌరవ సభ గౌరవ సభ గా మారిన తర్వాతే ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో కాలు పెడతానని నారా చంద్రబాబు నాయుడు, చాణక్య శపథం చేసి ప్రజాదరణతో తిరిగి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టడం జరుగుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు విధించిన శిక్ష ఏమిటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చూశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరిని లాక్కోవలసిన అవసరం లేకుండానే భగవంతుడే లాగేశారు.
ఫర్నిచర్ దొంగ అని చెప్పి గతంలో కోడెలపై ఏదైతే అభియోగాన్ని మోపారో అది ఇప్పుడు మీ మెడకు చుట్టుకోబోతుంది. ఈ సందర్భంగా చాలా కర్మ సిద్ధాంతాలు గుర్తుకు వస్తున్నాయి. ఎన్నికల కౌంటింగ్ కు ఒక రోజు ముందు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తెదేపాకు చాలా పరిమిత సంఖ్యలో సీట్లు రాబోతున్నాయని అన్నారు. ఇప్పుడు , కాస్తో కూస్తో అటు ఇటు గానే భగవంతుడు ఆ సీట్లనే మీకే ఇచ్చారు.
కుప్పంలో చంద్రబాబు నాయుడు ని ఓడిస్తానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమిళనాడు నుంచి తీసుకొచ్చి చేర్చిన 20వేల దొంగ ఓట్ల ను చూసుకొని బీరాలు పలికారు. అయ్యప్ప స్వామి భక్తుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏ దేవుడో కరుణించాడో తెలియదు కానీ 4500 మెజారిటీతో అతి కష్టం మీద విజయం సాధించారు.
చంద్రబాబు నాయుడును నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా అల్లర్లు, గొడవలు చేయిస్తే ఈరోజు ఆయనే నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దంటూ వేలాది మంది రోడ్డెక్కారన్నారు. ఒక ప్రజా ప్రతినిధికి ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. గతంలో పెద్దిరెడ్డి ఏదైతే చేశారో, ఇప్పుడు అదే ఆయనకు తిరిగి వచ్చిందన్నారు. నా నియోజకవర్గంలో కొంతమంది అప్పటి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇల్లు బద్దలు కొడతామని, ఇంకా ఎన్నో అవాకులు, చెవాకులు పేలారన్నారు. అటువంటి వారిలో ఒకరేమో 70 వేల, మరొకరేమో 72,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారన్నారు. ఇప్పుడు సమాజంలో తలెత్తుకో లేని పరిస్థితిని కొని తెచ్చుకున్నారన్నారు.