– అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ కే ప్రకాష్ ను అక్రమ కేసుతో సర్వీస్ నుంచి తొలగించడం పై జ్యుడిషియల్, సీబీఐ విచారణ కోరుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ లేఖ
తేది : 01.09.2022
గౌరవనీయులైన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అమరావతి.
విషయం: అనంతపురం జిల్లా ఎఆర్ కానిస్టేబుల్ శ్రీ కె.ప్రకాష్‌ను ఉద్యోగం నుంచి తొలగింపు – సర్వీసుకు సంబంధించిన ప్రభుత్వ బకాయిలు చెల్లించమని అడిగినందుకు వేధింపులు – దళిత ఉద్యోగిని అక్రమ కేసులో ఇరికించడం – బాధితుడి ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులపై కేసు నమోదు – జ్యుడీషియల్, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో నిష్పాక్షికంగా విచారణ జరపడం.
రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులపై ప్రభుత్వమే వేధింపులకు పాల్పడడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీ కె.ప్రకాష్ ఉదంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వం అనుసరించిన వైఖరి పూర్తి అక్రమంగా, అన్యాయంగా, దళిత ఉద్యోగులను వేధించే విధంగా ఉంది.
దళిత వర్గానికి చెందిన ఏఆర్.కానిస్టేబుల్ శ్రీ కె.ప్రకాష్ పోలీసు శాఖలో సిబ్బందికి పెండిరగ్ లో ఉన్న నిధుల విడుదలపై ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో మీ పర్యటన సమయంలో పెండిరగులో ఉన్న సరెండర్ లీవ్‌లు (SLs), అదనపు సరెండర్ లీవ్(ASL)లను చెల్లించాలని కోరుతూ ప్లకార్డును ప్రదర్శించినంత మాత్రాన సస్పెండ్ చేస్తారా? న్యాయంగా విడుదల కావాల్సిన బకాయిలపై ప్రజాస్వామ్యబద్దంగా ప్లకార్డు పట్టుకుని సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సహృదయంతో అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించకపోగా… అక్రమ కేసులు పెట్టి ప్రకాష్‌ను వేధించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల కోరినందుకు… సంబంధం లేని కేసులో ఇరికించి సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.
బాధితురాలిగా చెప్పబడుతున్న మహిళ శ్రీలక్ష్మి మీడియా ముందుకు వచ్చి, ప్రకాష్‌పై నమోదు చేసినది తప్పుడు కేసు అని, ప్రకాష్ తనను వేధించలేదని పేర్కొన్నారు. పైగా స్పందన కార్యక్రమంలో తన ఫిర్యాదు విషయంలో ప్రకాష్ తనకు సహకారం అందించారని కూడా స్పష్టం చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే కారణంగానే ప్రకాష్ పై కక్షగట్టి విధుల నుంచి తొలగించారన్నది ఇక్కడ సుస్పష్టం. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అహంకారపూరితంగా వ్యవహరించి ప్రకాష్‌ను బాధితుడిని చేశారు.
ప్రశ్నించిన వారిని వేధించడం, హింసించడం, బెదిరించడం, భయపెట్టడం అనేది రాష్ట్రంలో సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణిచివేతలలో దళితులు, అణగారిన వర్గాలు బాధితులుగా మారుతున్నారు. దళిత, బడుగు వర్గాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై వేధింపుల ద్వారా మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఘటనలు ప్రతి రోజూ వెలుగు చూస్తుండడం బాధాకరం.
తనపై అక్రమ కేసుల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. (క్రైం నంబర్ 209/2022 U/S 167, 177, 182 r/w 34 IPC sec 3 (1) (q) sec 3 (2) (VIl) of SC/ST POA Act). దీనిపై పారదర్శకంగా విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు గారు, సిసిఎస్ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా గారిని నిందితులుగా చేర్చారు.
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులు ప్రస్తుతం అదే జిల్లాలో కీలకమైన, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు.
వారు అదే జిల్లాలో విధుల్లో ఉన్నా, సర్వీసులో ఉన్నా విచారణను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఈ కేసులో సమగ్ర విచారణ పూర్తయ్యే వరకు నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులను విఆర్ లో ఉంచాలి. ఐపీఎస్ స్థాయి అధికారులు ముద్దాయిలుగా ఉన్న ఈ కేసులో నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాల్సి ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను డిస్మిస్ చేసేందుకు కుట్ర పన్నిన వ్యవహారంలో భాగస్వాములు ఎవరో తేల్చేందుకు జ్యుడీషియల్ విచారణ జరపాలి. అదే విధంగా శ్రీ ప్రకాష్ చేసిన ఫిర్యాదుపై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై సీబీఐతో దర్యాప్తు జరపాలి అని డిమాండ్ చేస్తున్నాను.
ధన్యవాదములతో…
నారా చంద్రబాబు నాయుడు.