– రాళ్లలో పెరిగిన ధైర్యం..
గాలిలో నిండిన పట్టుదల..
కష్టాల్లోనూ నవ్వే మనుషుల మంచితనం..
అదే మన రాయలసీమ! నవంబర్ 18. ఇది కేవలం క్యాలెండర్లోని ఓ అంకె కాదు. ఇది రాయలసీమ అస్తిత్వం మళ్లీ సగర్వంగా నిప్పు కణికలా తలెత్తిన చారిత్రక ఘట్టం. ‘దత్త మండలాలు’ (Ceded Districts) అనే అన్యాయపు, అవమానకరమైన సంకెళ్లు తెగిపోయిన రోజు. సీమ ప్రజల స్వాభిమానం పతాకమై ఎగిరిన పవిత్ర దినం.
చరిత్ర గాయం: 1800 – దత్తత కాదు… దారుణం… 1800 సంవత్సరం: మా ఆత్మగౌరవానికి ఏమాత్రం సంబంధం లేకుండా, మా నేలను, మమ్మల్ని నిస్సిగ్గుగా ‘దత్తత’ పరిచిన సంవత్సరం. కట్టు బానిసల్లా నిజాం, మా మట్టిని బ్రిటిష్ వారికి ధారాదత్తం చేసిన సంవత్సరం. ‘దత్త మండలం’ అనే పేరు మా చరిత్రపై, సంస్కృతిపై పడిన చెరగని మకిలి. అప్పటి పాలకులు కేవలం ఎండిన నేలను మాత్రమే చూశారు — కానీ ఆ నేల గుండెల్లో దాగివున్న పోరాట స్ఫూర్తిని చూడలేకపోయారు.పోరాటం మా నరనరాల ఊపిరి. ఆత్మగౌరవం మా జీవనాడి. చరిత్రలో రాయలసీమ ఎప్పుడూ తలవంచలేదు. త్యాగాలకు వెరవలేదు.Ceded Districts’ అనే పేరులో మా చరిత్ర, మా సంస్కృతి, మా పౌరుషం అన్నీ దాచబడ్డాయి. మట్టిని మాత్రమే చూశారు — కానీ ఆ మట్టిలో పెరిగిన ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని చూడలేదు.
నవంబర్ 18, 1928 … ఆత్మగౌరవం తల ఎత్తిన రోజు…
(నంద్యాల — ఆంధ్ర మహాసభ )
నవంబర్ 18, 1928: అస్తిత్వానికి ఆయువు పోసిన రోజు నంద్యాల ఆంధ్ర మహాసభలో… స్వర్గీయ శ్రీ చిలకలూరి నారాయణరావు గారి గొంతులోంచి మా ఆత్మఘోష, ఆవేశం ప్రస్ఫుటమైంది. ఆ క్షణం… ‘దత్త మండలం’ అనే అవమానపు పదాన్ని ఛేదించి… విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, మా పౌరుషాన్ని గుర్తుచేసే ‘రాయలసీమ’ అని నామకరణం జరిగిన మహోన్నత రోజది. ఆ నామకరణం ఒక రాజకీయ నిర్ణయం కాదు… మా అస్తిత్వాన్ని ప్రకటించిన ఆత్మగౌరవ యుద్ధభేరి.అది నేటికీ మా ఉనికిని, పోరాట పటిమను దిగ్విజయంగా చాటుతోంది. కీర్తిశేషులు శ్రీ చిలకలూరి నారాయణరావు గారి గొంతులోంచి వినిపించిన రాయలసీమ పేరు ప్రతిపాదన ….సీమ వాసుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూ…. పుస్తకాల్లో, కరపత్రాల్లో, పత్రికల్లో నిప్పురవ్వలా ఎగిసింది.నేటికీ సీమవాసుల ఉనికిని దిగ్విజయంగా చాటుతోంది.ఆత్మగౌరవ పతాకాన్ని అవనతం కాకుండా నేటికీ నడుపుతోంది.
రాయలసీమ: తెగువ త్యాగం పౌరుషం అవసరమైతే తెగే తెగువ, అన్యాయంపై ఎగిరే ధైర్యం. ప్రాణమైనా ఇచ్చే స్నేహం, మాట తప్పని నమ్మకం, బంధానికి ప్రాణం ఇచ్చే నిబద్ధత. పేదరికంలో ఉన్నా, అడిగితే సహాయం చేసే పెద్దమనసు, అతిథిని దైవంగా భావించే గుణం. కష్టాలు ఎన్ని వచ్చినా తలవంచని మొండి పట్టుదల.
త్యాగాల గడ్డ… కన్నీళ్లతో తడిసిన చరిత్ర :
సీమ చేసిన త్యాగాలు… మాకు శాపాలుగా మారినా, మా త్యాగనిరతి మాకు గర్వకారణం….ధైర్యం, త్యాగం మాత్రం ఎన్నడూ మసకపడలేదు.
1953: మద్రాసు నగరాన్ని విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి మార్గం చూపిన బలమైన పెద్దమనసు
1956: విశాలాంధ్ర కోసం రాజధాని హక్కును వదిలిన మహాత్యాగం
2014: రాష్ట్ర విభజన సమయంలో కర్నూలు రాజధాని అవకాశం ఉన్నప్పటికీ… మౌనంగా పెద్దమనసుతో వెనక్కి తగ్గిన సహన హృదయం. ఈ మట్టి మనుషుల ఆప్యాయత…… మా త్యాగాలు మాకు శాపాలైనా…పేదరికం, పిల్లల్లో పోషకాహార లోపం, నిరుద్యోగం, నిరక్షరాస్యత,రైతుల ఆత్మహత్యల బాధాకర కథలు.. బతుకుదెరువు కోసం వలసలు,చరిత్రలో ఫ్యాక్షన్ గాయాలు..ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా… ఈ నేల మనుషుల ధైర్యం, మంచితనం, ఆప్యాయత ఎప్పటికీ తరిగిపోలేదు. పొలంలో తడి లేకపోయినా… గుండె తడి ఏమాత్రం ఎండలేదు. మాట ఎంత కఠినంగా ఉన్నా… మనసు మాత్రం వెన్నలా కరగడం ఆగలేదు… రాయలసీమ దినోత్సవం సందర్భంగా… ఈ ప్రాంత అభివృద్ధికి పునరంకితమవుదాం… అభివృద్ధి, అవకాశాల కోసం మరింత శ్రమిద్దాం… పిల్లల చదువులకై మరింత పాటు పడుదాం… నా ఉనికి…రాయలసీమ. రాళ్లలో పెరిగిన ధైర్యం, గాలిలో నిండిన పట్టుదల, కష్టాల్లోనూ నవ్వే మనుషుల మంచితనం — అదే మన రాయలసీమ. భుక్తి కోసం,ఉద్యోగం కోసం, ఎక్కడున్నా….నా నేలపై మమకారం,సీమ ప్రజలను పట్ల ఆప్యాయత తగ్గలేదు. హృదయపూర్వక రాయలసీమ దినోత్సవ శుభాకాంక్షలతో…
– కే.వీ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం
