– జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ధీమా
కడప: రాబోయే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. సోమవారం పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ నెల 12వ తేదీన జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో సవిత మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. రాబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి గెలుపు తథ్యమని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు.
సవితకు ఘన స్వాగతం
అంతకుముందు ఎర్రిపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇన్చార్జి మంత్రి సవితకు, ఇతర కూటమి నాయకులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటి వద్ద టీడీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తామని మాటిచ్చారు. అవినీతికి తావులేకుండా పథకాలు అందుతున్నాయని, సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, కూటమి అభ్యర్థికే తమ ఓటు అని స్పష్టం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సవిత సహా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, టీడీపీ నియోజక వర్గ ఇన్ఛార్జ బీటెక్ రవి, అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి, ఇతర కూటమి నాయకలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.