Suryaa.co.in

National

ఆఖరి రోజు పోటెత్తిన ఐటీ రిటర్నులు

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22) ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు ఆదివారం (జూలై 31)తో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో రిటర్నులు దాఖలు చేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. గంట గంటకు లక్షలాది రిటర్నులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో రాత్రి 11 గంటల వరకు 68 లక్షల రిటర్నులు దాఖలైనట్టు ఐటీ విభాగం ప్రకటించింది. దాంతో, మొత్తం రిటర్నుల సంఖ్య 5.78 కోట్లకు చేరుకుంది. తుది గడువు అయిన ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు మరో 5 లక్షలు దాఖలై ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలు అవుతాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 5.89 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి.

కాగా, అపరాధ రుసుము లేకుండా ఐటీ రిటర్ను ఫైల్ చేయడానికి నిర్దేశించిన గడువును పెంచే ప్రసక్తే లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అపరాధ రుసుముతో ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఇందుకు రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారు వెయ్యి రూపాయల జరిమానా కట్టాలి. ఐదు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లు రూ. 5 వేల రుసుము చెల్లించి డిసెంబర్ 31వ తేదీ వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చు.

LEAVE A RESPONSE