-వైసీపీ జమానాలో సలహాదారుగా పనిచేసిన పద్మజారెడ్డి
– ఆమె పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ
– మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇప్పటి వరకూ రిటైర్మెంట్ బిల్లులకు మోక్షం వేని వైచిత్రి
– పెండింగ్ లో ఇంకా 80 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్
– పెన్షన్ కూడా ఇంకా సెటిల్మెంట్ కాని వైచిత్రి
-జగన్ పై పోరాటానికి ఇదేనా బహుమతి?
– జగన్ పై పోరాటంతో ఏబీకి మానసిక-ఆర్థిక నష్టం
– ఇప్పటికే పులివెందుల వైసీపీ కాంట్రాక్టర్లకు వంద కోట్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ
– వైసీపీ జమానాలో కాంట్రాక్టర్లకు అలవోకగా బిల్లుల చెల్లింపు
– షిర్డిసాయి ఎలక్ట్రికల్ కు పువ్వుల్లో పెట్టి పెండింగ్ బిల్లుల అప్పగింత
-కేశవ్ సారథ్యంలో బ్రహ్మాండంగా ‘సర్దుకు’ పోతున్న ఆర్థిక శాఖ
– గతంలో టీడీపీ కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేసిన జగన్ సర్కారు
– కోర్టుకు వెళ్లిన తర్వాతకే కొందరి బిల్లులకు మోక్షం
– ఇప్పటికీ పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించలేని వైనం
– ఆర్థిక శాఖలో వైసీపీ అబ్రకదబ్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)
పయ్యావుల కేశవ్ సారథ్యంలోని ఆర్థికశాఖ వైసీపీ సంబధీకులకు అప్పగింతలు చాలా సుహృద్భావం.. సౌభ్రాతృత్వం కమ్ విశాల దృక్పథంతో ముందుకుపోతోంది. సంతోషం. ఇది ముందే చెప్పినట్లు ‘మంచి ప్రభుత్వం’ కాబట్టి, దానిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. అదే చేత్తో.. అదే సమ న్యాయాన్ని జగన్ బాధితులకూ చేస్తే.. ఇది ఇంకా ‘అతి మంచి ప్రభుత్వం’ అన్న పేరు సొంతం చేసుకుంటుంది కదా అన్నది విజ్ఞులు కమ్ జగన్ బాధితుల వాదన.
జగన్ జమానాలో వైసీపీ అధికార ప్రతినిధి, జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబరు నుంచి 2024 మే వరకూ మహిళా, శిశు సంక్షేమ శాఖకు సలహాదారుగా నారమల్లి పద్మజారెడ్డి వ్యవహరించారు. ఆ ప్రకారంగా ఆమెకు 13.90 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. సరే.. ‘మంచి ప్రభుత్వం’ ఆమెకు న్యాయంగా రావలసిన 13.90 లక్షల వేతన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ, ఈనెల 19న ఉత్తర్వులిచ్చింది. మహా సంతోషం. ఆల్ హాపీసు! దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు.
ఎందుకంటే అవి ఆమెకు న్యాయంగా రావలసిన బకాయిలు కాబట్టి. అందువల్ల ఊరి భాషలో చెప్పాలంటే ఇది ‘తల్లీబిడ్డా న్యాయం’ కూడా! రావుగోపాలరావు భాషలో చెప్పాలంటీ ఇంకా హ్యాపీసు!! తాము జగనన్న లెక్క ఎవరిపైనా కక్ష కట్టబోమని ‘మంచి ప్రభుత్వం’ ముందే చెప్పినందున.. వైసీపేయులపై కూటమి సర్కారు కక్ష సాధిస్తుందని, తెలుగు తమ్ముళ్లే కాదు..సామాన్యులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇది ‘జగన్విదితం’! గత జగన్ సర్కారు, అంతకుముందు టీడీపీ కాంట్రాక్టర్లకు రావలసిన పెండింగ్ బిల్లులను తొక్కిపెట్టింది.
కమ్మ- కాపులకు తప్ప.. ఏ కులానికి చెందిన కాంట్రాక్టర్లయినా బిల్లు లిస్తామని.. ఆ రెండు కులాలకు చెందిన కాంట్రాక్టర్లకు సిఫారసు చేయవద్దని జగనన్న సర్కారు తమ ఎమ్మెల్యే, ఎంపీలకు, నిస్సిగ్గు – నిర్మొహమాటంగా చెప్పిన విషయం విస్మరించకూడదు ! మరి తమ పార్టీ అధికారంలోకి వస్తే.. అలాగే చేస్తుందన్న తెలుగు తమ్ముళ్ల పిచ్చి భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. అది వేరే వ్యవహారం! అవును. ఎందుకంటే.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల్లో, అక్షరాలా వందకోట్ల రూపాయలను పయ్యావుల కేశవ్ సారథ్యంలోని ఆర్థిక శాఖ, పువ్వుల్లో పెట్టి అప్పగించింది.
ఒక్క పులివెందుల వైసీపీ కాంట్రాక్టర్లకే కాదు. రాష్ట్రంలో జగన్ జమానాలో పనులు చేసిన, వైసీపీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను కూడా.. పయ్యావుల నేతృత్వంలోని ఆర్థికశాఖ ‘విశాలహృదయులు’ అదే పువ్వుల్లో పెట్టి అప్పగించిన సంగతి తెలిసిందే. షిర్డిసాయి, మేఘా ఇంజనీరింగ్ వంటి బతకనేర్చిన బడా కంపెనీలకు, వందల కోట్ల పెండింగ్ బిల్లులు వెల్లించి, వారి కళ్లలో ఆనందం చూసింది మరి. సరే.. చేస్తే చేశారు. ఇస్తే ఇచ్చారు. మరి అదే చేత్తో.. జగన్పై తొడగొట్టి సవాల్ చేసి, ఉద్యోగంలో ఉన్నంతకాలం జగన్ కి సెల్యూట్ చేయకుండా.. జగన్ సర్కారుపై సమరశంఖం పూరించిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు రావలసిన పెండింగ్ బకాయిలు కూడా అదే పువ్వుల్లో పెట్టి అప్పగించవచ్చు కదా అన్నదే ప్రశ్న.
ఎందుకంటే.. ఏబీ వెంకటేశ్వరరావు రిటైరయిన తర్వాత, ఆయనకు ఇప్పటికీ అక్షరాలా 80 లక్షల రూపాయల పెండింగ్ బకాయిలు ప్రభుత్వం నుంచి రావలసి ఉంది. పెన్షన్ కూడా ఇప్పటికీ సెటిల్మెంట్ చేయలేదన్నది సమాచారం. దానికోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తులు, ఆర్థికశాఖ పేషీ చెత్తబుట్టలో సుఖనిద్ర పోతున్నాయట. మరి వైసీపీ కాంట్రాక్టర్లు, వైసీపీ ప్రభుత్వ సలహాదారుల పెండింగ్ బిల్లులను, విశాల హృదయంతో మంజూరు చేస్తున్న పయ్యావుల కేశవ్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ.. అదే విశాల హృదయంతో.. నాలుగున్నరేళ్లు జగన్ పై అవిశ్రాంత యుద్ధం చేసి, ఆయన బాధితుడైన ఏబీ వెంకటేశ్వరరావు పెండింగు బకాయిలు మంజూరుచేస్తే, ఏలిన వారి పుణ్యం ఎక్కడికీ పోదు కదా అన్నది తమ్ముళ్ల హితవు. అదే.. ఇదే ఏబీ.. పద్మక్క లెక్క .. వైసీపీ సర్కారుకు సేవ చేసి ఉంటే, ఈపాటికి ఆయన పెండింగ్ బకాయిలు ఎప్పుడో వచ్చి ఉండేవన్నది మరికొందరి ఉవాచ. నిజం నారాయణుడికెరుక ?