– సంతాపానికీ నోచుకోని మాజీ సీఎం
– వైశ్య రత్నానికి ఇచ్చే మర్యాద ఇదేనా?
– సలహాదారులు, పార్టీ పెద్దలకు తెలియదా?
– అనుభవజ్ఞులు లేకనే ఈ అవమానం
– సోషల్ మీడియాలో విమర్శల వర్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్థికవేత్త. దశాబ్దాల తరబడి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ పార్లమెంటేరియన్. అంతేనా.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి ఆయనో బ్రహ్మాస్త్రం. సభలో-బయట విపక్షాలపై ముఖ్యమంత్రుల పక్షాన విరుచుకుపడే రాజకీయయోద్ధ. అందరు సీఎంలకు ఆ పెద్దాయనే తురుపుముక్క. ఆయనపై విమర్శలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మీడియా ముందుకు రావాలి. మీదుమిక్కిలి.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆ పెద్దాయనంటే అమిత గౌరవం. అన్నా అని ప్రేమతో పిలుచుకునే వాత్సల్యం. మరి అంత పెద్దమనిషి చనిపోయిన తర్వాత, ఆయనకు ఇచ్చే గౌరవం ఏ స్థాయిలో ఉండాలి? ఎంత సమున్నతంగా ఉండాలి? ఆయనకు ఇచ్చే నివాళి సందర్భంలో సభ ఏకమై, ఆయన సేవలు ఎంత ఏకరవుపెట్టి నివాళులర్పించాలి? ఇవే కదా.. అందరూ ఆ పెద్దాయనకు అర్పించే నివాళి గురించి ఆశించేది! ఆ పెద్దాయనే మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య.
మరి ఆ పెద్దాయన కు ఆ స్థాయిలో నివాళులర్పించలేదా?.. లేదు.
అసలు శాసనసభ-శాసనమండలి ఆయనకు నివాళులే అర్పించలేదా?..
యస్!
ఎందుకు?
ఏమో.. మర్చిపోయారట!
ఒక్క దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికే నివాళి అర్పించి, ఆయన ఘనత గురించి చర్చించారు.
పోనీ.. బీఏసీ మీటింగులోనయినా రోశయ్య గారిని జ్ఞప్తికి తెచ్చుకున్నారా? అంటే అదీ లేదు.
సరే.. అధికార వైసీపీకి అంటే రోశయ్య గారెవరో తెలియకపోవచ్చు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లి ఆయనకు నివాళి అర్పించలేకపోవచ్చు. పైగా ఆయన కాంగ్రెస్‌కు పార్టీకి చెందిన వాడు కాబట్టి, పార్టీపరమైన కోణం ఉందనుకోవచ్చు. రోశయ్య తన తండ్రికి కుడి-ఎడమ భుజమైనప్పటికీ, తనకు రావలసిన ముఖ్యమంత్రి పదవిని తన్నుకుని పోయినందున, సహజంగా ఆ కోపం ఉండవచ్చు. పైగా ఆయనకు నివాళి అర్పించినందున, పెద్దగా ఓట్లు కూడా రావన్న ముందుచూపూ ఉండవచ్చు. మేకపాటి అంటే సొంత పార్టీ. అదీగాక సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు నివాళి అర్పించి, సభ వాయిదా వేశారనుకోవచ్చు.
కానీ.. కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి వచ్చి ఇప్పుడు వైసీపీలో చేరిన సీనియర్లు, ఒకప్పటి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఒకప్పుడు కాంగ్రెస్‌లో పనిచేసి, ఇప్పటికీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్లు, చివరాఖరకు సలహాదారులు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పకపోవడమే వింత. అదే సమయంలో వారు చెప్పినా.. దానిని సీఎం గారు అమలుచేయలేదా అన్నది మరో ప్రశ్న.
అయితే.. రోశయ్య కౌన్సిల్ మాజీ సభ్యుడయినందున, ఆయనను కూడా మాజీ ఎమ్మెల్సీగానే పరిగణించి, ఈనెల 10న నిర్వహించే సంతాప తీర్మానాల్లో ఆయన పేరూ చేరుస్తామని అసెంబ్లీ అధికారి ఒకరు వెల్లడించారు. అంటే రోశయ్యను మాజీ ఎమ్మెల్సీగానే పరిగణిస్తున్నారన్న మాట. అదీ సంగతి!
ఇక రోశయ్య గారికి జమిలిగా జరిగిన అన్యాయం-అవమానంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు- నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అవి సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశమయింది. ‘నాడు నీ నైజాన్ని నిజస్వరూపాన్ని బయట ప్రపంచానికి తెలిపింది రోశయ్య అనే నీకు ఇంక కక్ష అనేది బయట టాక్. నీ
స్నేహితుడయిన సంతాపం తెలిపిన నువ్వు .. మీ తండ్రి, అన్నలా భావించిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలపలేదు’ అని ట్వీట్ చేశారు.
అటు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా.. ప్రభుత్వం రోశయ్యను అవమానించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైశ్యులకు జరిగిన అవమానం. మరి నాపై దాడి చేస్తున్న వైసీపీ వైశ్య నేతలు,
రోశయ్య గారికి జరిగిన అవమానంపై ఎందుకు స్పందించడం లేదంటూ వైసీపీ వైశ్య నేతలను అడ్డంగా ఇరికించడం ఆసక్తికరంగా మారింది.
నిజమే. రఘురామకృష్ణంరాజు ఎప్పుడూ కీలెరిగి వాతపెడుతుంటారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర నిషేధంపై రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేసినందుకు, వైసీపీకి చెందిన వైశ్య నేతలు ఆయనపై అగ్గిరాముళ్లయ్యారు. అదే వర్గానికి చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనినాస్ కూడా రఘురామపై విరుచుకుపడ్డారు. ఆవిధంగా పార్టీకి చెందిన వైశ్య రత్నాలంతా ముఖ్యమంత్రిని మెప్పించేందుకు.. రఘురామపై తిట్ల దండకం అందుకోవడం, ఆ తర్వాత వారంతా కలసి సీఎం జగనన్న వద్దకు వెళ్లడం, చింతామణి నాటకంపై నిషేధించడం చకచకా జరిగిపోయాయి. సరే.. దానిపై కోర్టు సర్కారును యక్ష ప్రశ్నలు వేసిందనుకోండి. అది వేరే విషయం.
బాగానే ఉంది. తమ కులం- కుల నాయకులకు జరిగే అన్యాయంపై అలుపెరుగని పోరాటం చేసే మంత్రి వెల్లంపల్లి అండ్ కో.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదని ఇప్పటిదాకా ఎందుకు గళం విప్పలేదు? వారి స్వరపేటిక ఎందుకు సన్నబడింది? చింతామణి
నాటకం అంశంపై అప్పుడు రఘురామ దిష్టిబొమ్మలు దహనం చేసిన వైశ్య రత్నాల చేతులు, ఇప్పుడెందుకు గజగజ వణికిపోతున్నాయి? మరిప్పుడు అదే రఘురామ ఒక్కరే .. రోశయ్యకు జరిగిన అవమానంపై పార్టీ పక్షాన గళం విప్పినందున.. ఆయన వైశ్యమిత్రనా? వైశ్యద్రోహినా? ఇంతకూ వైశ్య సంఘాలు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు చెప్మా?! ఇవీ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్.