– సుమన్‌కు జగనన్న మూడుసార్లు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆశకయినా హద్దుండాలి. ఆశ మంచిదే, కానీ అత్యాశ పనికిరాదు. ఏమిటీ పొద్దున్నే హితోక్తులనుకుంటున్నారా? అవునండీ. మరి లేకపోతే.. తాను సీఎం జగన్‌ను మూడుసార్లు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని మాజీ హీరో సుమన్ అనడమేమిటండీ?! అసలు పెద్ద పెద్ద తీస్‌మార్ఖానా, పచ్చీస్ మార్ఖానాల్లాంటి వాళ్లకే తాడేపల్లిలో ఎంట్రన్సుకు దిక్కులేదు. కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలకే జగనన్న దర్శనానికి ఠికాణా లేదు. అలాంటిది.. ఎప్పుడో చిన్నప్పుడు హీరోగా నటించిన సుమన్ అడగ్గానే, జగనన్న అపాయింట్‌మెంట్ ఇచ్చేస్తారేటి? మరీ చోద్యం కాకపోతే!
మరి అట్లయితే.. మొన్నామధ్య సిన్మాహీరోలను జగన్సారు ఎట్ల కలిశారమ్మా? అని అమాయకంగా అడగొచ్చు. కరస్టే. కలిశారు. కానీ, జగన్సారుకు వాళ్లందరినీ చూడాలనిపించింది. కాబట్టి ఓ కేక వేస్తే, స్పెషల్ ఫ్లైటెట్టుకుని అంతలావు చిరంజీవి, మహేష్, ప్రభాసూ తాడేపల్లికి తరలివెళ్లారు. అసలు వాళ్లొచ్చిందే వేరే మేటర్ కోసం. అంతలావు మెగాస్టారు కూడా జగన్సారును చేతులు జోడించి, తమరే మమ్మల్ని చూసుకోవాలని అభ్యర్ధించారు. తర్వాత అది వర్కవుటయిందనుకోండి . అది వేరే ముచ్చట.
సరే.. వాళ్లంటే ఇప్పుడూ మెగా, సూపర్, రెబెల్‌స్టార్లే. బట్టతలలొచ్చినా, విగ్గులు పెట్టినా స్టార్లు స్టార్లే సారూ?! మరి సుమన్ ఇప్పుడేమిటి? జస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్టు. అదీ అప్పుడప్పుడు. ఆయనకేమైనా మెగా ఫ్యామిలీ మాదిరిగా, మాస్ ఫాలోయింగు ఉందా అందీ లేదు. పోనీ ఏదైనా పార్టీలో ఉన్నారా అంటే.. చాలాపార్టీలు మారారు కాబట్టి, ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టం. ఓకే. పోనీ మెగా, సూపర్, రెబల్‌స్టార్ల మాదిరిగా విగ్గులు పెట్టుకుని బయటకు వస్తారా అంటే.. బట్టతలతోనే కనిపిస్తారాయె. మరి జగన్సారే కాదు, సినిమాటోగ్రఫీ మంత్రయినా ఆయనకు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారు? అబ్బే.. సుమనన్నయ్యకు పూర్తిగా లోకజ్ఞానం తెలియనట్లుంది!అసలు చిరు, మహేష్ లాంటి స్టార్లే సుమన్‌ను తాడేపల్లికి తీసుకువెళ్లకుండా, పులుసులోముక్కమాదిరి తీసి పారేస్తే.. జగన్సారు మాత్రం ఆయనను పిలిచి, వన్‌టు వన్ మీటింగుకు అపాయింట్‌మెంట్ ఇచ్చేత్తారేంటి?
అసలు సుమనన్నయ్యకు, జగన్సారు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంట? రోజూ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, రేషన్‌కార్డుల వంటి పరేషాన్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎమ్మెల్యే, ఎంపీలకే జగన్సార్ దర్శనభాగ్యం దొరకడం కష్టం. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టుకుని, పోలీసు కేసులు పెట్టించుకుని, విపక్షాలతో బూతులు తిట్టించుకునే వాళ్లకే జగన్సారు దర్శనమివ్వకపోతే, ఇక ఎప్పుడో చిన్నప్పుడు హీరోగా చేసిన సుమన్సారుకు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారు పిచ్చి ఆశలు కాకపోతేనూ?!
వాళ్లను పక్కనపెడితే, మంత్రులకే జగన్సారు అపాయింట్‌మెంట్ దొరకడం దుర్లభం. ఆయనను ఒకట్రెండు సార్లు విడిగా కలిస్తే, వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలిగినంత సంబరం. ఇక కలిసి సమస్యల పరిష్కారం కోసం చర్చించడమా? హన్నా! ఇది అత్యాశ కదూ బుల్లబ్బాయ్?! ఇప్పుడు అజయ్ కల్లమన్న హవా తగ్గింది కాబట్టి.. ఇహ ఏ సజ్జలన్ననో, ఏ సాయిరెడ్డన్ననో కలిస్తే అదే చాలా ఎక్కువ. అసలు సీఎంఓ అధికారుల అపాయింట్‌మెంటే ఓ అద్భుతం. సజ్జలన్నను, సీఎంఓ అధికారులనూ క లిస్తే వారి జన్మ చరితార్ధమయినట్లే లెక్క.
అసలు జగన్సారుకు ఎన్ని వర్రీసు? ఎన్ని ప్రాబ్లెమ్సు? ఉద్యోగులకు కనీసం పదోతేదీనయినా జీతాలివ్వాలా? పెన్షనర్లకు కనీసం ఇరవై తారీఖునయినా బ్యాంకులో డబ్బులేయాలా? నవరత్నాలకు డబ్బులు సర్దుబాటు చేయాలా? ఇవన్నీ చూసుకుంటూనే కోర్టును కాసుకోవాలా? కోర్టుకెళ్లిన వారికి బిల్లులు చెల్లించాలా? ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు మళ్లీ సర్వీసులోకి రాకుండా ఉండేందుకు, ఢిల్లీ ప్లీడర్లకు ఫీజులివ్వాలా? మళ్లీ ఇన్ని చేస్తూనే.. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు, కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతకాలా? పనిమంతులను సలహాదారులుగా నియమించుకుని, వారికి జీతాలివ్వాలా? జగన్సారుకు ఎన్నివర్రీసు? ఎంత హర్రీసని? అందుకే కదా ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా, అన్నీ సజ్జలన్నకు, సీఎంఓకూ వదిలేసింది?
చివరాఖరులో ఓ మాట. చాలాకాలం క్రితం ముచ్చట ఇది. జగన్సారుతో మాట్లాడాలని మాజీ ప్రధాని దేవెగౌడ ట్రై చేశారు. సీఎంఓకు చాలాసార్లు ఫోన్లు చేశారు. లెటరు కూడా రాశారట. కానీ నో రెస్పాన్స్. మరి దేశానికి ప్రధానిగా చేసిన అంతలావు దేవెగౌడ సారుకే దిక్కూ మొక్కూ లేకపోతే, మాజీ హీరో సుమన్‌కు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారు.. కామెడీ కాకపోతే!?
సినిమా కష్టాలంటే సిన్మాయాక్టర్లకే కాదు. జగన్సారు లాంటి సీఎంలకూ ఉంటాయి మరి. అవన్నీ అర్ధం చేసుకోకుండా, జగన్సారు పడుతున్న కష్టమేమిటో గ్రహించకుండా.. ‘నేను మూడుసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేద’ని అట్లా అలిగితే ఎట్లా సుమన్ సారూ? అర్ధం చేసుకోవాలి కదా?!