( మార్తి సుబ్రహ్మణ్యం)
విజయవాడ.. నిన్నటి వరకూ ఈ పేరు చెబితే అక్కడి వారికి బోలెడు గర్వం. ఎయిర్‌పోర్టు మా విజయవాడలోనే ఉందని చెప్పుకునేవాళ్లు. ఒక్క ఎయిర్‌పోర్టేనా? హెచ్‌సీఎస్, టెక్‌మహీంద్రా, హైటెక్‌సిటీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ మా బెజవాడలోనే ఉన్నాయని తెగ ఫీలయ్యేవాళ్లు. పెద్ద కంపెనీలన్నీ తమ బెజవాడ చుట్టూనే ఉన్నాయని బోల్డెంత గర్వపడేవారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న కొత్త జిల్లాల నిర్ణయంతో పాపం.. ఆ ఖ్యాతి అంతా కొత్తగా ఏర్పాటయిన కృష్ణాజిల్లాలో కలిసిపోవడంతో బెజవాడ వాసులు బావురుమంటున్నారు. ఇప్పుడు బెజవాడ వాళ్లకు మిగిలింది కృష్ణా బ్యారేజీ, బస్టాండు, బెంజిసర్కిల్, ఏలూరు రోడ్, బందరురోడ్డే.
కొత్తగా ఏర్పాటయిన జిల్లాల ప్రక్రియలో విజయవాడ చాలా కోల్పోయిందన్నది బెజవాడ వాసుల వేదన, రోదన. జిల్లా విభజనతో విజయవాడ నగరం జిల్లా ముఖ్యపట్టణం గా మారింది. ఇదే సందర్భంలో కొన్నింటిని కోల్పోయింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న గన్నవరం ప్రాంతం కృష్ణాజిల్లా లోకి వెళ్లిపోయింది. విమానాశ్రయం విజయవాడ పేరుతో ఉన్నా, ఇది జిల్లా పరిధిలోకి రాదు. కేసరపల్లిలోని ఐటీ సెజ్ అంతా కూడా విజయవాడ ఐటీ సెజ్ కిందకే వస్తుంది. అయితే భౌగోళికంగా ఇది కూడా కృష్ణాజిల్లాలో కలిసిపోవడంతో హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఏపీఐఐసీ – ఏస్ అర్బన్ హైటెక్ సిటీలను కూడా విజయవాడ కోల్పోవాల్సి వచ్చింది.
విజయవాడ ఇండస్ర్టియల్ పార్కులుగా వీరపనేనిగూడెం, మల్లవల్లి ఐపీలు ఉన్నాయి. వీటికి తోడు మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్ కూడా ఉంది. వీటన్నింటినీ విజయవాడ కోల్పోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంలో విజయవాడ కోసం పలు కేంద్ర సంస్థలను ప్రకటించింది. ఇవన్నీ కూడా కొండపావులూరులో ఏర్పాటయ్యాయి.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం, సీపెట్ తదితర అనేక సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వీటిని కూడా విజయవాడ కోల్పోవాల్సి వస్తోంది. అన్నింటికంటే మరీ ముఖ్యంగా విజయవాడ గ్రేటర్ నగరంగా విలీనం జాబితాలో ఉన్న కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు, గంగూరు, గోసాల, ఈడుపుగల్లు , పునాదిపాడు, ఉప్పులూరు, కేసరపల్లి, వెంకట నరసింహాపురం, అజ్జంపూడి, బుద్ధవరం, గన్నవరం, వెదురుపావులూరు, సావారిగూడెం, జక్కులనెక్కలం, రామచంద్రాపురం, పురుషోత్తపట్నం, బీబీగూడెం, చిన్న అవుటపల్లి, అల్లాపురం గ్రామాలన్నీ కృష్ణాజిల్లాలో విలీనం అయ్యాయి. గ్రేటర్ విలీన జాబితాలో ఉన్న మొత్తం 45 గ్రామాల్లో 25 కృష్ణాజిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో 20 గ్రామాలు మాత్రమే జిల్లాలో మిగిలాయి.
దీనితో తల ఉండీ శరీరం లేని ఆకారంలా విజయవాడ మిగిలిపోయింది. విజయవాడకు ఇప్పుడు మిగిలింది డి.వి.మేనర్, గేట్‌వే, మెడ్‌సిటీ, హోటల్ మినర్వా, నోవాటెల్, పాస్‌పోర్టు ఆఫీసు, స్వీట్‌మ్యాజిక్, కనకదర్గ గుడి, భవానీ ఐలాండ్, ప్రకాశం బ్యారేజీ, నైట్‌ఫుడ్‌కోర్టు, మాత్రమే.