-కేంద్రానికి కూడా సంబంధం లేదు
-రాజధాని గా అమరావతికి బిజెపి సంపూర్ణ మద్దతు
-రైతుల పాదయాత్రలో అల్లర్లకు రాష్ట్రప్రభుత్వం ప్లాన్
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్ర పునర్విభజన చట్టం లో మార్పులు చేయాలంటే, పార్లమెంటే చేయాలని… కేంద్రానికి కూడా ఆ అధికారం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. మూడు రాజధానులు అంశం పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం శిరసా వహిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతికి , తిరుపతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మద్దతు ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రను నిర్వహించాలని గత పది నెలల క్రితమే అమరావతి రైతులను బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు కోరారని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాసిందని పేర్కొన్నారు. ఇక ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు అంశాలతో కూడిన లేఖను రాసిందని వెల్లడించారు. ఇందులో ప్రత్యేకించి రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి కి ర్యాపిడ్ ట్రైన్ నెట్వర్క్ గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం దక్షిణాఫ్రికా స్ఫూర్తితో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందన్న ఆయన, ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు కూడా వెళ్ళ లేదని గుర్తు చేశారు. గతంలో అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెట్టగా, అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు.
ఒకవేళ ఈసారి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మూడు రాజధానులు బిల్లును ప్రవేశపెడితే కోర్టు మరొకసారి చివాట్లు పెట్టడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తాయన్న ఆయన, రాజ్యాంగ పరంగా కూడా ఇబ్బందులు తప్పవని చెప్పారు. మా పార్టీ వారికి ఆ భయం కూడా ఉందన్న రఘురామకృష్ణంరాజు, అందుకే మంత్రులను, మాజీ మంత్రులను ముందుపెట్టి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే, తుపుక్కున పోతుందన్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును స్పీకర్ ఆమోదించినా, కోర్టు ముందు నిలవదని చెప్పారు. అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లు కేవలం ప్రజలను మోసగించడానికి ఉపయోగపడుతుందన్న అయన , మూడు రాజధానులు ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ప్రయత్నించాడని చెప్పుకోవడానికే మాత్రం, తమ పార్టీ నాయకులకు దోహదపడుతుందని ఎద్దేవా చేశారు .
రెఫరెండం గా ఎన్నికలకు వెళ్ళండి… ప్రజలు ఎలా గౌరవిస్తారో చూద్దాం
2024 సాధారణ ఎన్నికలలో మూడు రాజధానులు ఏర్పాటు అంశాన్ని రెఫరెండం గా భావిస్తూ, ఎన్నికలకు వెళ్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు గా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని రెఫరెండం గా పేర్కొంటూ ఎన్నికలకు వెళితే… ప్రజలు ఏమి చేస్తారో, ఎలా సత్కరిస్తారో, గౌరవిస్తారో చూద్దామని అన్నారు. విశాఖ పట్టణ ప్రజలు, తమ ప్రాంతాన్ని రాజధానిగా కోరుకోవడం లేదని ఆయన అన్నారు . విశాఖ ప్రజలు నిన్నటి మొన్నటి వరకు స్థానికంగా ఉన్న పాలెగాని కబ్జాలు రుచి చూశారన్నారు. ఇప్పుడు ఆ పాలెగాన్ని అక్కడి నుంచి బదిలీ చేశామని చెబుతున్నారని, కానీ ఇప్పటికీ చేయాల్సిందంతా ఆ పాలెగాడు చేశారన్నారు. పాలె గాన్ని బదిలీ చేసిన ప్రజలు ఆ పాత గుర్తులు, ఆస్తులు కోల్పోయిన ఆవేదనను ఇంకా మరిచిపో లేదన్నారు . ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు, ఏమి జరిగినా తమకు సంబంధం లేదని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏమి జరిగినా మీకే సంబంధం అంటూ ఆయన తేల్చి చెప్పారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రపై కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో అధికారుల నిఘా ఉంటుందని, ఈ మేరకు తాను కూడా హోమ్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని తెలిపారు .
సాక్షి దిన పత్రిక చూస్తే ప్రభుత్వ పెద్దల కుట్ర స్పష్టం
సాక్షి దినపత్రికలో రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై పేలిన అవాకులు, చవాకులను ప్రముఖంగా ప్రచురించడాన్ని రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మంత్రులు విడుదల రజిని, గుడివాడ అమర్నాథ్, అప్పలరాజు, మాజీ మంత్రి కన్నబాబు లు అమరావతి రైతుల పాదయాత్రపై విషం కక్కారని విమర్శించారు . ఇక మాజీ మంత్రి కన్నబాబు 20 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పని చేసి, ఈనాడు దినపత్రిక నిందించడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు, మా పార్టీని జైలు పార్టీ అని కన్నబాబు సంబోధించారని గుర్తు చేశారు. రేపు పొద్దున్న మళ్ళీ పార్టీ మారితే, మళ్లీ ఆయన ప్రాధాన్యతలు మారుతాయని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి
ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను మంత్రులు, మాజీ మంత్రులు చేస్తున్న విషయాన్ని ప్రతిపక్ష నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. మంత్రులపై ఐపీసీ 153 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని తమ ఫిర్యాదులో పేర్కొవాలన్నా రు . పోలీసులు కచ్చితంగా కేసులు నమోదు చేయరని, కానీ ఫిర్యాదు చేసిన… వారం రోజుల తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. మెజిస్ట్రేట్ కోర్టు కూడా చర్యలు తీసుకోకపోతే, హైకోర్టులో ప్రతిపక్షాలు పిటిషన్ వేయాలన్నారు . రేపు పొద్దున ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నదని, వారు అల్లర్లు చేసే సమయములో ఈ పిటిషన్లు ఆదుకుంటాయని చెప్పారు. అప్పుడైనా సరే… మంత్రులను అరెస్టు చేయవలసిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఏ ప్రాంత మంత్రిపై ఆ ప్రాంతం ప్రతిపక్ష పార్టీల నాయకులుసంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని, అల్లర్లు జరిగితే పూర్తి బాధ్యత మంత్రులే వహించాలని తమ ఫిర్యాదులో పేర్కొనాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలు గా ప్రతిపక్షాలు ఫిర్యాదులు ఇవ్వడం మంచిదని సూచించారు. అమరావతి రైతులు కూడా అమరావతి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయ వచ్చునని అన్నారు. ఏలూరులో ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, అతని పై అనంతపురం జిల్లా శింగనమల లో సీఐడీ చీఫ్ పివి సునీల్ కుమార్ కేసు నమోదు చేశారని, అలాగే టీడీపీ నాయకురాలు గౌతు శిరీషను శ్రీకాకుళం నుంచి విచారణ నిమిత్తం స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో కాకుండా, గుంటూరులోని సిఐడి కేంద్ర కార్యాలయానికి పిలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అమరావతి రైతులు, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు ముందు జాగ్రత్త చర్యగా కేసుల నమోదుకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వ పెద్దలు ఎంతకైనా తెగిస్తారనడంలో సందేహం లేదన్నారు. ఇష్టం లేకపోయినా సాక్షి దినపత్రికను చదివితే ప్రభుత్వ పెద్దల కుట్రలు తెలిసిపోతాయన్నారు.
పెయిడ్ ఆర్టిస్టులకు తో జగన్ పాదయాత్ర చేయలేదా?
అమరావతి రైతుల పాదయాత్రలో భాగంగా బయో టాయిలెట్స్ ను వినియోగించడాన్ని సాక్షి ఛానల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తప్పు పట్టడాన్ని రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఆక్షేపించారు. అమరావతి రైతులు భోజనం చేయవద్దా?, ఊరూరా వెళుతూ… బయో టాయిలెట్స్ వినియోగిస్తే సాక్షి ఛానల్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినప్పుడు, రోడ్డుపై పడుకుని,పొదల్లోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నారా ? అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన్నప్పుడు ఆయన పాదయాత్ర లో బౌన్సర్లు లేరా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు , అమరావతి రైతుల పాదయాత్రలో బౌన్సర్లు ఉన్నారంటూ ఎందుకీ దిగజారుడు రాజకీయమని విరుచుకు పడ్డారు. కేంద్ర మద్దతు రాజధానిగా అమరావతి కే ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. ఇక తాము కార్యాలయాలు నిర్మించుకో వద్దా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలతో, రుషి కొండపై నిర్మిస్తున్నవి ప్రభుత్వ కార్యాలయా లేనని స్పష్టం అయిందన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా శివారెడ్డి కొనసాగుతున్నారని, అయినా అమరావతి రైతుల పాదయాత్ర ను కమ్మ కులస్తుల పాదయాత్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పాదయాత్రకు ట్రాక్టర్ ఇచ్చింది కమ్మవారే నంటూ మాజీ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, తమకేదో కులం ఫీలింగే లేనట్టు… ఇతరులకు మాత్రమే కులం ఫీలింగ్ ఉన్నట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పార్టీ రీజినల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1000 నామినేటెడ్ పోస్టులు నియమిస్తే, అందులో 750 పోస్టులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం జరిగిందన్నారు.పార్టీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షులు కూడా ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని, విశ్వవిద్యాలయాలకు 12 మంది వైస్ చాన్స్లర్ల ను నియమిస్తే, తొమ్మిది మంది ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారే నని పేర్కొన్నారు. ఇక మనమా కులం గురించి మాట్లాడే దని ఎద్దేవా చేశారు.
వివేక హంతకులకు శిక్షపడినప్పుడే ఆయన ఆత్మకు శాంతి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హంతకులకు శిక్ష పడినప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మూడేళ్ళ క్రితం వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని, ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్య చేయించారని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా ఆరోపిస్తూ, హంతకులను కనిపెట్టడానికి సిబిఐ విచారణ డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను ముఖ్యమంత్రి కాగానే, వివేకా హత్య కేసును విచారిస్తున్న సిబిఐని తప్పించి, సి ఐ డి కి విచారణ బాధ్యతలు కట్టబెట్టారన్నారు . కానీ సిఐడి విచారణలో, హత్య కేసు ఎటువంటి పురోగతి లేకపోవడంతో, వివేకా కుమార్తె సిబిఐ విచారణను కోరారని, సిబిఐ విచారణ సజావుగా సాగకుండా, విచారణ అధికారి పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారని రఘు రామ తెలిపారు.
మెజిస్ట్రేట్ ఇది కరెక్టు కాదని పేర్కొనడంతో, రాష్ట్ర ప్రభుత్వమే అప్పీల్ కు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేసు పురోగతిని అడ్డుకోవడానికి అధికారులను మేనేజ్ చేశారని అపవాదు కూడా లేకపోలేదన్నారు. ఈ కేసు వ్యవహారంలో ప్రజలను తప్పుదారి పట్టించడానికి సకల శాఖ మంత్రి మీడియా సమావేశాలను నిర్వహించగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ల సిద్ధాంతాన్ని చెప్పారన్నారు. వంట బాగా లేకపోతే నిజాయితీగా చెప్పే జగన్మోహన్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ కు సహకరించి, వివేకా హత్య కేసులో నిందితుల అరెస్టు చర్యలు తీసుకోవాలన్నారు. తన చిన్నాన్న హంతకులనే, ఇంతవరకూ అరెస్ట్ చేయించకపోతే, ప్రజలకు ఏమీ రక్షణ కల్పిస్తారనే అనుమానాలు చిన్నపిల్లలకు కూడా తలెత్తడం ఖాయమన్నారు. వివేకా హత్య కేసులో ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, బిజెపి నాయకుడు ఆదినారాయణ రెడ్డి దోషులయితే వారిని అరెస్ట్ చేయాలని, లేకపోతే మన చుట్టూ ఉన్న వారే దోషులయితే వారిని అరెస్టు చేయించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా కలగజేసుకుని దోషులెవరు తేల్చేందుకు సీబీఐ కి సహకరించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తి పలువురి పేర్లను వెల్లడించారని, వారిని ఇంతవరకూ విచారించ లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక బ్లాక్ లో దొరుకుతున్న విషయం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జేపీ సంస్థ యజమాని గౌరు కు మినహా అందరికీ తెలుసునన్నారు.
విజయ సాయికి ఉన్న నాలుగు పోస్టులు పీకేస్తారేమో?
తమ జాతీయ పార్టీ కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఉన్న నాలుగు పోస్టులలో, రెండు పీకేస్తారేమోనని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ ప్రాంత పార్టీ బాధ్యతలు, సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలను తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. విజయసాయి ఇచ్చిన భరోసాతోనే కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేయగా, వారిలో ఏడు మంది ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే నన్నారు. వీరిలో సింహభాగం ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషమన్నారు.
గరికపాటికి జన్మదిన శుభాకాంక్షలు
గరికపాటి నరసింహారావు రఘురామకృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గరికపాటి అంటే తెలియని తెలుగు వారుండరేమో నని వ్యాఖ్యానించారు.