Home » పల్లాకు పార్టీ పగ్గాలు

పల్లాకు పార్టీ పగ్గాలు

– యాదవుల చేతికి టీడీపీ సారథ్యం
– పల్లా మెజారిటీకి బాబు గుర్తింపు
– మళ్లీ ఉత్తరాదికే దక్కిన టీడీపీ అధ్యక్ష పదవి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు అద్భుత విజయానికి, తగిన గుర్తింపు-గౌరవం లభించింది. మంత్రి గుడివాడ అమర్నాధ్‌పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లాకు, మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చాలామంది భావించారు. అయితే ఆయనకు చోటు లేకపోవడంపై పార్టీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేశాయి.

క్యాబినెట్ ప్రకటించిన తర్వాత కుటుంబసభ్యులతో బయటకు వచ్చిన సందర్భంలో.. ఆయనతో ప్రజలు సెల్ఫీ తీయించుకున్నారు. మీకు మంత్రి పదవి రాకపోవడం దురదృష్టకరం. మీకు మంత్రి పదవి ఇవ్వకుండా, ఎవరో కొత్తవారికి ఇవ్వడం అన్యాయం అంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. దానితో మూడురోజుల్లో పల్లా సెలబ్రిటీగా మారారు.

అయితే యాదవ వర్గాలను మెప్పిస్తూ, ఉత్తరాది వారికి మరో కానుకగా పల్లా శ్రీనివాసరావును, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబునాయుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది రాష్ట్రంలో యాదవులను మెప్పించే నిర్ణయమే. నిజానికి పల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉన్నప్పటికీ.. అప్పటికే కొలుసు పార్ధసారథికి టీడీపీ నుంచి, సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దానితో కులసమీకరణలో భాగంగా పల్లాకు నిరాశ ఎదురైంది.

కానీ ఏకంగా కీలకమైన పార్టీ అధ్యక్ష పదవి లభించడం పల్లా సైతం ఊహించనిదే. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి లభించడంతో, ఆయన స్థానంలో అదే ఉత్తరాంధ్రకు చెందిన పల్లాకు స్థానం కల్పించారు. దీనితో చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రపై తన ప్రాధాన్యతను చాటుకున్నట్లయింది.అదే సమయంలో అత్యధిక మెజారిటీ దక్కిన నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న విమర్శలకు తెరదించినట్లయింది.

ఉత్తరాంధ్ర జగన్ బాధితుల్లో పల్లా ఒకరు. ఆయనను పార్టీలోకి తీసుకువచ్చేందుకు, అప్పట్లో విజయసాయిరెడ్డి చాలా ప్రయత్నించారు. పదవులు ఆఫర్‌చేశారు. పల్లా తిరస్కరించడంతో ఆయన భవనాన్ని కూల్చివేశారు. పోలీసుల వేధింపులకు గురైన నేతలలో పల్లా ఒకరు.

కాగా రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్న యాదవులకు, రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం సహజంగా ఆ వర్గాన్ని మెప్పించేదే. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి, యాదవులు ఆ పార్టీతో కొనసాగుతున్నారు. తెలంగాణలో సైతం యాదవుల అనుబంధం టీడీపీతోనే అన్నది తెలిసిందే.

Leave a Reply