సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాజ్ భవన్ లో నివాళులర్పించిన గవర్నర్
విజయవాడ, అక్టోబర్ 31: దేశవ్యాప్తంగా ఉన్న రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా సమగ్ర భారతదేశాన్ని నిర్మించటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అనిర్వచనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రతి సంవత్సరం పాటిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పటేల్ కీలకపాత్ర పోషించారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో గుజరాత్‌లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల ఎత్తైన సర్ధార్ విగ్రహాన్ని ప్రతిష్టించారని గవర్నర్ ప్రస్తుతించారు. పటేల్ దేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా సామ, దాన, భేద, దండో పాయాలతో 565 రాచరిక సంస్థానాలు భారత్‌లో విలీనం చేయటం వల్లే, దేశం ఐక్యంగా, సమగ్రంగా ఉందని గవర్నర్ అన్నారు. ఆ మహానేతకు యావత్ జాతి రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్, రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.