– సమాజ సేవ అందరి బాధ్యత
– సేవా భారతి బాలమేళాలో హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్
విజయవాడ: గత 36 సంవత్సరాలుగా విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో గల అనేక బస్తీలలో విద్యార్థిని విద్యార్థులకు వారి వారి చదువు సందెలతో పాటు సామాజిక స్పృహ ఆరోగ్య అవగాహన దేశభక్తి సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ అనేకమంది దాతల సహాయ సహకారాలతో సేవా భారతి అనేక సేవా కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాలలో భాగంగా 126 కేంద్రాలలో చదువుకుంటున్న 4196 పిల్లలందరి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలని బాలమేళా పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ విచ్చేశారు. ముఖ్యఅతిథిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి ప్రత్యేక అతిథిగా, MDL మస్గం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ చందు విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ సేవ అందరి బాధ్యతగా గుర్తించాలి. చిన్నతనం నుంచే పిల్లలకు కూడా ఈ విధమైన సేవా కార్యక్రమాలు అలవాటు చేస్తూ దేశభక్తిని ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ, పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత సేవా భారతి కలగజేయడం చాలా సంతోషం అని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రభుత్వం తన వంతు బాధ్యతగా వివిధ రకాలుగా సహాయపడుతుందని చెప్పారు.
ముఖ్య వక్తగా విచ్చేసిన భయ్యా వాసు మాట్లాడుతూ, మన పూర్వీకులు నేర్పినది.. సమాజ సేవ మాధవ సేవనే మానవసేవగా గుర్తించి పనిచేయమని మహర్షులు మనకు తెలియజేశారు. తను- మన- ధన పూర్వకంగా ప్రతి ఒక్కరూ సమాజరూపీ సర్వేశ్వరుని సేవిస్తే వ్యక్తి కుటుంబం సమాజంతో పాటు దేశం ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని చెప్పారు.
సేవా భారతి సంస్థ ద్వారా విజయవాడ మరియు పరిసర ప్రాంతాలలో నిర్వహించే 44 ట్యూషన్ సెంటర్లలో 1000 మంది పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతూ, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల సాంస్కృతి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
విజయవాడలోని 44 సేవా బస్తీలలో ,గుంటూరు ,పెద్దనందిపాడు, బాపట్ల, ఏలూరు, మచిలీపట్నం, కృతివెన్ను, జగ్గయ్యపేట, నూజివీడు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే మన 126 అభ్యాసికలలో 4196 బాల బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు.
విశిష్ట అతిథి జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ పిల్లలలో మంచి సంస్కారాలు నేర్పుతున్నటువంటి సేవా భారతికి అభినందనలు. ముఖ్యంగా పిల్లలు తల్లితండ్రులను గౌరవించడం, గురువుకి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. దేశభక్తి అంటే ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించడం. ఎవరి పనులు వాళ్ళు చేయడం అనే చెప్పారు. సేవా భారతి సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శనీయమని చెప్పారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి మాట్లాడుతూ అన్ని దానాలలో శ్రమదానమే గొప్పదని, సేవా భారతి చేసే శ్రమదానం చాలా హర్షణీయమని చెప్పారు. యువత మాదకద్రవ్యా ల జోలికి పోకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పారు.