Home » రెండు మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు

రెండు మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు

•ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ఖరీఫ్ లో సివారు భూములకు సాగు నీరు అందజేస్తాం
•పట్టిసీమ పంపులన్నింటినీ ఆపరేషన్ లోకి తీసుకువచ్చి రెండు మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేర్చుతాం
•గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పులిచింతల ప్రాజక్టులో 0.5 టిఎంసి నీరు కూడా నిల్వలేకుండా పోయింది
•గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజక్టుల గేట్లు కొట్టుకు పోయాయి
•రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు

అమరావతి, జులై 5: రాష్ట్రంలో పలు నీటి పారుదల ప్రాజక్టుల నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదిన చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. వర్షాకాలంలో నీటి పారుదల ప్రాజక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజక్టుల్లోకి చేరనున్న నేపధ్యంలో ప్రాజక్టుల్లోకి వచ్చే ఇన్ ప్లో, అవుట్ ప్లో పైన మరియు ప్రాజక్టుల గేట్లు, లాక్ ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజక్టుల పరిధిలోని సివారు ఆయకట్టు భూమికి కూడా సాగునీరు అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన సిల్టును, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించే పనులను చేపట్టాలని, అందుకు అవసరమైన నిధుల అంచనాలను కూడా రూపొదించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ప్రాజక్టులో జల వనరులను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకుని ఖరీఫ్ లో సివారు భూములకు కూడా సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో యుద్ద ప్రాతిపదికన ప్రాజక్టుల నిర్వహణ పనులను చేపడుతున్నామన్నారు. ప్రాజక్టుల పరిధిలో ఆయకట్టు భూములకు ప్రణాళికా బద్దంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజక్టుల గేట్లు కొట్టుకు పోయాయని, పులిచింత ప్రాజక్టులో నిల్వఉండాల్సిన 30 నుండి 40 టిఎంసిలకు బదులు కేవలం 0.5 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉందని, ఇటు వంటి పరిస్థితులు తమ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పులిచంతల ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, పట్టిసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన కారణంగా నేడు కృష్టా డెల్టాలో త్రాగునీటి సమస్య తలెత్తడానికి కూడా గత ప్రభుత్వమే కారణమన్నారు.

గత నాలుగేళ్లుగా పట్టిసీమ నిర్వహణ పనులు చేపట్టక పోవడంతో గేట్లు, బోల్టులు కూడా తృప్పుపట్టి పోవడంతో పాటు లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం క్రింద నున్న 24 పంపుల్లో మూడు పంపులతో పథకాన్ని ప్రారంభించి ప్రస్తుతం 15 పంపులు పనిచేస్తున్నాయని, రానున్న మూడు నాలుగు రోజుల్లో మొత్తం 21 పంపులు పనిచేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఫలితంగా రానున్న రెండు మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రాజక్టుల నిర్వహణకు ఏమేరకు నిధులు వెచ్చించారో అన్న విషయాన్ని ఆరాతీస్తున్నామని, ఈ ఏడాది ఏ మేరకు నిధులను వెచ్చించగలమో అంచనా వేస్తున్నామన్నారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజక్టుల నిర్వహణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు

Leave a Reply