Home » పవన్ కళ్యాణ్.. బిజీబిజీ

పవన్ కళ్యాణ్.. బిజీబిజీ

• ఇటు శాఖల సమీక్షలు చేస్తూ…. అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..
• అధికారులతో శాఖలవారీగా సమీక్షలు
• ప్రజల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ
* శుక్రవారం బిజీబిజీగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి: ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగు హామీలను ఇచ్చారు.

బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి…
• ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో తాము బోధనలో ఉన్నామని తెలిపారు. 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు.
• ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 1986 నుంచి ఈ పోస్టులు భర్తీ చేయడం లేదని విన్నవించింది.

• ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోవడం వల్ల తన కుమార్తె సర్టిఫికెట్లతో పాటు ఆమె చదువుకోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెను చదువులకి సాయం అందించాలని కోరారు.
• పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Leave a Reply