Suryaa.co.in

Andhra Pradesh

పవన్‌కళ్యాణ్‌కు నాలుగు నాలుకలు

-అలాంటి తీర్మానాలు మీకే సాధ్యం
-మహిళా మంత్రులపై దాడి చేసి సమర్థించుకుంటారా?
-ఆ పార్టీ చరిత్ర అంతా అబద్ధాలే
-విశాఖ దాడులపై పదే పదే అసత్యాలు ప్రచారం
-తద్వారా సానుభూతి పొందే ప్రయత్నం
-కాల్‌మనీ కాలనాగులు పవన్‌కు చుట్టాలా?
-మాజీ మంత్రి, ఎమ్మైల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)

అలాంటి తీర్మానాలు మీకే సాధ్యం!:
ఏదైనా ఒక రాజకీయ పార్టీలో అత్యంత ఉన్నత ప్రాధాన్యత కలిగి ఉండేది రాజకీయ వ్యవహారాల కమిటీ. ఆ సమావేశం అనేది చిన్న రాజకీయ పార్టీ అయినా, లేదా దేశాన్ని పాలించే పార్టీ అయినా చాలా ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రజల కోసం ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుందనే వాటిపై రాజకీయ నిర్ణయాలు చేస్తారు. కానీ ఇవాళ కొండను తవ్వి, ఎలుకను తీసినట్లు, ఒక రాజకీయ పార్టీ పీఏసీ సమావేశంలో వారం క్రితం చేసిన తీర్మానాలనే మరోసారి ఆమోదించారు. ఎవరెవరో తమను పలకరించడానికి వచ్చారట. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం. రాష్ట్రంలో మంత్రుల మీద దాడి, మహిళా మంత్రులను అసభ్య పదజాలంతో దూషించి, భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులను అభినందిస్తూ, వారికి అండగా నిలబడిన వారి నాయకుడిని అభినందిస్తూ మరో తీర్మానం. గొప్ప రాజకీయ పార్టీ. గొప్ప తీర్మానాలు. ఇక ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆరేళ్లపాటు హైసెక్యూరిటీ జోన్‌లో రాజకీయాలు చేశాడట. ఆయన అంటున్నాడు. తనకు సెక్షన్‌–30 ఉన్నదని తమకు తెలియదని. దాని గురించి ఎవరూ చెప్పలేదని.

విశాఖలో ఉద్దేశపూర్వకంగా..:
హైసెక్యూరిటీలో ఆరేళ్లు రాజకీయాలు చేసిన వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. విశాఖలో వారి కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోస ఉద్యమిస్తున్న ఒక జేఏసీ ఏర్పాటై వారు ర్యాలీకి అనుమతి కోరితే, పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ విధంగా వారికీ, మీకు ఇద్దరికి అనుమతి ఇచ్చారు. అయితే మీరు పోలీస్‌ పర్మిషన్‌ వచ్చాకే టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటారు కదా? కానీ మీరు జేఏసీ ర్యాలీపై సమాచారం వచ్చిన తర్వాత 7వ తేదీన హడావిడిగా టికెట్లు బుక్‌ చేసుకుంటారా? ఇంకా ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ కారు ఎక్కాడని విమర్శిస్తున్నారు. ఆయన ఆ పని చేయలేదు. ఫుట్‌బోర్డు మాత్రం ఎక్కి, త్వరగా హోటల్‌కు వెళ్లాలని కోరాడు. దాన్ని కూడా తప్పు పట్టి, ఆ పని చేయబోమంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

పార్టీ చరిత్ర అంతా అబద్ధాలే:
అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి మాదిరిగా పదే పదే అసత్యాలు చెప్పి, సానుభూతి పొందే ప్రయత్నం. నాలుగున్నర గంటల పాటు అనుమతి లేని ప్రదర్శన నిర్వహించారు. అయినా పోలీసులు సంయమనం పాటిస్తే, దాన్నీ రాజకీయం చేశారు. మర్నాడు సభ, కార్యక్రమం నిర్వహించుకోమని పోలీసులు కోరితే, అందుకు నిరాకరించిన పవన్‌కళ్యాణ్, తాను ఆ కార్యక్రమానికి పోకుండా, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తానంటే, పోలీసుల ఒప్పుకోలేదు. దీంతో డ్రామా మొదలైంది. చంద్రబాబుకు ఎప్పుడు కష్టం వచ్చినా, కలుగులోంచి బయటకు వచ్చే వారంతా రంగంలోకి దిగారు. వారుణవాహిని పెద్దమనుషులంతా వరస కట్టి పవన్‌కళ్యాణ్‌కు పరామర్శ మొదలు పెట్టారు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ హోటల్‌లోనే ఉండి, అందరినీ అక్కడికి రమ్మని మెసేజ్‌లు పెట్టి, హడావిడి చేసే ప్రయత్నం.

దాడి చేసి.. ఎదురు దాడి:
నిజానికి ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి ఘటనను కనీసం ఖండించలేదు. చివరకు చెత్తబుట్టను ఏకంగా మంత్రి రోజాపైకి విసిరారు. ఆమె పక్కకు తప్పుకుంటే, ఆయన పీఎ తలకు తగిలి 8 కుట్లు పడ్డాయి. కనీసం దాన్ని కూడా ఎవరూ ఖండించలేదు. చంద్రబాబు కోసం దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు.

ఎవరిది దుర్మార్గ ప్రభుత్వం:
జగన్‌గారిది దుర్మార్గ ప్రభుత్వమా? మరి చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హత్య చేయాలని చూశారు. దాంతో దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి కాపు నేతలు హైదరాబాద్‌లో సమావేశమై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చివరకు చిరంజీవి రాజమండ్రి వస్తే, ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కు పంపారు. చివరకు తుని వద్ద రైలును కూడా వైయస్సార్‌సీపీనే తగలబెట్టింది అంటూ దుర్మార్గమైన మాటలు. ఆరోజు ప్రభుత్వంలో ఉంది చంద్రబాబే కదా? ఆరోజు కేసులు పెట్టింది కాపు వాళ్ల మీదే కదా? ఆ కేసులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం.

దిగజారుడు రాజకీయాలు:
ఆరోజు సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్‌కళ్యాణ్‌ కాపు రిజర్వేషన్లను తప్పు పట్టారు. ఇవాళేమో ఆరోజు తునిలో రైలును మా పార్టీ వారు కాల్చారని అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. ఇంకా దిగజారి మంత్రుల ఇళ్ల మీద వైయస్సార్‌సీపీ కార్యకర్తలే దాడి చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టమని డిమండ్‌ చేశారు. సీఎంగారు ఆ నిర్ణయం తీసుకోగానే, దాన్ని సమర్థించకపోగా, అక్కడే అంబేడ్కర్‌ పేరు పెట్టాలి? కడపకు పెట్టొచ్చు కదా? అని మాట్లాడారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల మీద దాడి చేసి తగలబెడితే, కనీసం అంతరాత్మ లేకుండా మాట్లాడుతున్నారు. మీకూ భార్యా పిల్లలు ఉన్నారు కదా?

చంద్రబాబు ‘వాయిస్‌’:
మీ కార్యకర్తలు ఇంకా కొందరికి బెయిల్‌ రాలేదని విమర్శిస్తున్నారు. అంటే మీవైపు ధర్మం లేదా? జగన్‌గారి తనపై దాడి చేయించుకుంటున్నారని అంటున్నారు. అచ్చం చంద్రబాబు వాయిస్‌. చంద్రబాబుకు ఎప్పుడు కష్టం వచ్చినా, జగన్‌కి పదవి ఉన్నా, లేకపోయినా.. దత్తపుత్రుడు రావడం మాట్లాడడం. దిగజారిన రాజకీయాలు తప్ప, మరేమీ కావు. ఇంకా అంటున్నారు. 26 జిల్లాలు కాదు. 26 రాజధానులు అంటున్నారు. అంటే అది మీ మేనిఫెస్టోనా? ధైర్యం ఉంటే చెప్పండి? మీకు మాట మార్చడం అలవాటే కదా? ఇదే రాజధాని అమరావతి గురించి ఎప్పుడెప్పుడు, ఏం మాట్లాడారు. మాట మార్చడంలో నిపుణులు. ఎక్కడా స్పష్టత లేదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. మా పార్టీని గెలిపించవద్దు అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామనంటున్నారు.

నాలుగు నాల్కలు..:
తమకు జనవాణి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలలో 1671 ప్రభుత్వానికి పంపితే, రసీదులు కూడా ఇచ్చారని చెప్పారు. అంటే ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే ప్రభుత్వం అని, మీ నోటితోనే మీరు చెప్పారు. ఇది ప్రజలకు అర్ధం అవుతుంది. మా ప్రభుత్వాన్ని, సీఎంని తిడతారు. మళ్లీ అర్జీలు పంపామని, అవి ప్రాసెస్‌ అవుతున్నాయని మీరే అంటారు. అంటే మీకు రెండు నాల్కలు కూడా కాదు. అంత కంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇంకా జగనన్న కాలనీల్లో సోషల్‌ ఆడిటింగ్‌ చేస్తారట. అక్కడ పనులు సక్రమంగా జరగడం లేదంటున్నారు.

ఒక్కరికైనా ఇచ్చారా?:
జగన్‌ ప్రభుత్వం 2019, జూన్‌ 8న ఏర్పడింది. అంటే ఇప్పటికి మూడు సంవత్సరాల నాలుగు నెలలు అయింది. అంటే జగనన్న కాలనీల్లో ఇళ్ల పురోగతి లేదంటున్నారు హైసెక్యూరిటీలో రాజకీయాలు చేసిన వ్యక్తి. 2014లో మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామన్నారు. కనీసం ఒక్కరికైనా ఇంటి స్థలం ఇచ్చారా? ఇల్లు కట్టించి ఇచ్చారా? మరి మీ నోరు పడిపోయిందా? చంద్రబాబును నిలదీశారా? మీకు ఓటేయమని కోరాను. కాబట్టి మాట నిలబెట్టుకోండి అని అన్నారా? అదే సీఎం అధికారం చేపట్టిన వెంటనే 31 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అంతే కాకుండా తొలి దశలోనే 15 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ప్రతి వారం రివ్యూ చేస్తున్నారు. అంత పక్కాగా స్థలాలు పంచి, శరవేగంగా ఇళ్లు కట్టిస్తుంటే కళ్లకు కనిపించడం లేదా? ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి, విమర్శలు చేస్తున్నారు.

లాలూచీ రాజకీయం:
ఈ విధమైన దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమాలు చేయడం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సొంత ఇంటి కల నిజం చేయకుండా జగన్‌గారు మోసం చేశారని అరోపిస్తున్నారు. కానీ నిజానికి ఆ పని చేసింది చంద్రబాబునాయుడు, మీరు. అందుకే ఇకనైనా మీరు రాజకీయ పార్టీగా పోరాడాలి. కానీ ఆ పని చేయకుండా లాలూచీ పడుతున్నారు. మైక్‌ ముందు పోరాడతామంటున్నారు. కిందకు దిగగానే చంద్రబాబుతో లాలూచీ పడుతున్నారు. అదే మీ కార్యకర్తల బాధ. ఈ రకంగా ఒక రాజకీయ పార్టీ, రాజకీయ తీర్మానాలు ఇంత హాస్యాస్పదంగా చేయడం, పస లేని తీర్మానాలు చేసి సంబర పడతారని ఎవరూ ఊహించరు. మీరు పని చేస్తోంది చంద్రబాబు కోసం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఏదో సామెత చెప్పినట్లుగా..:
ఏదో సామెతలో చెప్పినట్లు, మంత్రులపై చెప్పులు విసిరేసి, ఒక మహిళా మంత్రిని తీవ్ర పదజాలంతో దూషించి, మరో మహిళా మంత్రిపై ఇనుప వస్తువుతో దాడి చేస్తే, ఆమె తప్పుకోగా, ఆమె పీఏ తల పగలింది. ఒక బీసీ మంత్రిపై కర్రలతో దాడి చేశారు. ఇది మీ పార్టీ సంస్కృతి. దాన్ని దాడి అంటారా?
లేక హోటల్‌లో శుభ్రంగా కూర్చుంటే మేము దాడి చేసుకున్నట్లా? దాడి జరుగుతుందని మీకు సమాచారం ఉంటే, విజయవాడకు ఎందుకు వచ్చారు? మీ ఆఫీస్‌కు, నోవాటెల్‌కు మధ్య ఎన్నిసార్లు తిరిగారు? పార్టీ ఆఫీస్‌ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు నోవాటెల్‌ హోటల్‌లో ఉన్నారు. మీకు ప్రభుత్వం పూర్తి సెక్యూరిటీ ఇచ్చింది. పోలీసులు మీ వెంట ఉన్నారు. ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వం.

వారంతా మీకు శ్రీరామచంద్రులు:
కాల్‌మనీ వ్యవహారం చేసి మహిళల మాన, ప్రాణాలు దోచుకున్న వారు మీకు చుట్టాలు. అత్యాచారం చేసి మహిళలను చంపినవారు మీకు శ్రీరామ చంద్రులు. కోడి పందాలు నిర్వహించి, మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చిన వారు, రౌడీయిజమ్‌ చేసిన వారు, మిమ్మల్ని మీ అన్నగారిని పచ్చి బూతులు తిట్టిన వారు మీకు స్వాతిముత్యాలు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు కనిపించలేదు. ఆ విధంగా గత 5 ఏళ్లలో మీరు కూడా కళ్లకు గంతలు కట్టుకున్నారు. అవి తీస్తే, రౌడీలు ఎక్కడ ఉన్నారనేది మీకు అర్థం అవుతుంది. అసలు ఇప్పుడు పీఆర్పీ ఉందా? అది కాంగ్రెస్‌లో విలీనం అయింది కదా?

ఎవరివి కుల రాజకీయాలు?:
ముసుగులు. కుల సభలు ఏమిటి అంటున్నారు? మీ జనసేన పార్టీలో ఎస్సీ వింగ్, బీసీ వింగ్‌లు ఉన్నాయా? లేవా? అసలు కులాల గురించి మాట్లాడుతోంది ఎవరు? ఆరేళ్లు హైసెక్యూరిటీలో రాజకీయాలు చేశానంటున్న వ్యక్తి, ఆరోజు సోనియాను తీసుకొచ్చి బీసీ సభ పెట్టలేదా? చంద్రబాబు బీసీ సభలు నిర్వహించడం లేదా?

ఎందుకా కంగారు?:
నిజానికి మా పార్టీలో అత్యధికంగా 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా అత్యధికంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఉన్నారు. వారంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానిపై మీకుందుకు కంగారు? రాష్ట్రంలో అసలు కుల రాజకీయాల గురించి మాట్లాడేది మీరే కదా? రంగా ని కాపులు బతికించుకోలేదని అంటున్నది మీరే కదా?

LEAVE A RESPONSE