-పవన్‌కళ్యాణ్ నిజంగా ఒక రాజకీయ నాయకుడేనా?
-మా బస్సు యాత్రను పవన్‌కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు
-మరి మహానాడు ఎందుకు నిర్వహించారో ప్రశ్నించడా?
-చంద్రబాబును దాని గురించి అడగడా?
-అంబేడ్కర్ పేరు పెట్టాక ఎందుకు మాట్లాడడం లేదు?
-మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెడితే ఎందుకు ఖండించలేదు?
-ఒక టెండర్‌లో నిబంధనపై నానా యాగీ
-అది ప్రభుత్వం దృష్టిలో లేదు. ఒక ఈఈ నిర్ణయం
-బాపట్లలో ఎందుకు జరిగిందో తెలుసుకుంటాం
-బాధ్యుడిపై అవసరమైతే చర్యలు తీసుకుంటాం
-ప్రెస్‌మీట్‌లో నిలదీసిన మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఏమేం మాట్లాడారంటే..:
అల్లర్లకు ఆయనా కారణం:
కోనసీమలో అల్లర్లు జరుగుతుంటే, జిల్లాకు అంబేడ్కర్ పేరెందుకు పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అక్కడ అల్లర్లు జరుగుతుంటే కాదు.. కోనసీమలో అల్లర్లు జరిగాయి. వాటిని నియంత్రించాం. అల్లర్లకు కారణం పవన్‌కళ్యాణ్ కూడా కారణం. ఇది ప్రజలంతా అంటున్నారు. ఎందుకంటే కోనసీమకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని, పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ డిమాండ్ చేశారు. కానీ పెట్టిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదు. అల్లర్లను ఎందుకు ఖండించడం లేదు.
ఎందుకు ఖండించలేదు?:
నేను అడుగుతున్నాను. పవన్‌కళ్యాణ్‌కు నిజంగా రాజకీయాలు తెలిసి ఉంటే, ఆయన రాజకీయ నాయకుడే అయి ఉంటే, జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టిన తర్వాత జరిగిన గొడవలను ఖండించాలి. ఒక దళిత మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టడాన్ని ఖండించాలి. కానీ ఆ పని చేయకుండా, జిల్లాకు మేము పేరు పెట్టామని అనడం ఏం మాటలు అవి?
చంద్రబాబును ఎందుకు అడగవు?:
అలాగే బస్సు యాత్రకు, దానికి ఏమిటి సంబంధం? కోనసీమలో అల్లర్లు జరిగాయి. వాటిని నియంత్రించారు. మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు యథావిథిగా జరుగుతాయి.
పవన్‌కళ్యాణ్.. నిజానికి చంద్రబాబును అడగాలి. కోనసీమలో అల్లర్లు జరుగుతుంటే మహానాడు ఎందుకు నిర్వహించారని. మరి అది అడగడా? మమ్మల్ని మాత్రమే అడుగుతారా?.
అది మా దృష్టిలో లేదు:
చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పిదాలు మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని ప్రభుత్వం మీద మొత్తం రుద్దేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశం చంద్రబాబునాయుడకు, ఆయనను బలపర్చే ఎల్లో మీడియాకు ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జల వనరుల శాఖకు సంబంధించి, ఒక టెండర్‌లో ఒక షరతు పెట్టారు. ఒకే ఒక ప్రాంతంలో బాపట్ల డ్రైనేజీ డివిజన్‌లో రూ.13 కోట్ల పనులకు సంబంధించి. నిధుల అందుబాటులో ఉంచుకునే టెండర్లు పిలవాలని, అవి లేకుండా టెండర్లు పిలిస్తే బిల్లులు చెల్లించేటప్పుడు ఇబ్బంది అవుతుందని, అక్కడ ఎందుకో వ్యక్తిగత నిర్ణయం తీసుకుని షరతు పెట్టారు. నిజానికి దాన్ని మా ప్రభుత్వం సమర్థించడం లేదు. పైగా అది మా దృష్టిలో కూడా లేదు.
ఆయన నీతులు ఆశ్చర్యకరం:
అయినా రాష్ట్రంలో ఏదో జరుగుతోందని, రాష్ట్రమంతా అప్పుల పాలవుతోందని, అన్ని టెండర్లకు షరతులు పెడుతున్నట్లు ఒక పత్రికలో రాయడం, చంద్రబాబు దాన్ని పదే పదే ట్వీట్లు చేస్తూ, రాష్ట్రంలో అంతా గందరగోళంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఎన్ని వేల కోట్లు అప్పులు పెట్టారు. ఎంత మందికి ఎగ్గొట్టారు. అన్ని అప్పులు పెట్టినాయన, అన్ని ఎగ్గొట్టిన ఆయన ఇవాళ నీతులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చంద్రబాబు వదిలిపోయిన బకాయిలు:
2019లో చంద్రబాబు పదవి నుంచి దిగిపోతూ వదిలిపెట్టి పోయిన బకాయిలు చూస్తే..
– వర్కుల బిల్లుల పెండింగ్: రూ.40,000 కోట్లు
– విద్యుత్ డిస్కంలకు బకాయిలు: రూ.20,000 కోట్లు
– ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: రూ.1880 కోట్లు.
– ధాన్యం సేకరణ బకాయిలు: రూ.960 కోట్లు
– విత్తనాల సబ్సిడీ బకాయిలు: రూ.384 కోట్లు
– ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు: రూ.963 కోట్లు
– ఆరోగ్యశ్రీ బకాయిలుః రూ.680 కోట్లు
– రైతుల విద్యుత్ సబ్సిడీ బకాయిలుః రూ.9000 కోట్లు
– రైతుల సున్నా వడ్డీ బకాయిలుః రూ.1218.60 కోట్లు
– ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు: రూ.1100 కోట్లు
– మరణించిన రైతులకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా బకాయిలు: రూ.23.45 కోట్లు.
– గ్రామ పచాయతీలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లు బకాయిలు:రూ.3,481 కోట్లు
– అగ్రిగోల్డ్ బకాయిలు: రూ.264 కోట్లు
ఇన్ని బకాయిలు వదిలిపెట్టి పోతే, సీఎం వైయస్ జగన్ అన్నీ తీర్చారు. నిజానికి దివాళా తీసిన ప్రభుత్వాన్ని చంద్రబాబు మాకు అప్పగించారు. అయినా మాపై పదే పదే బురద చల్లుతున్నారు. నిజం చెప్పాలంటే మేము బిల్లులు ఎగ్గొట్టడం లేదు.
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు:
నిజానికి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? ఆయన గత ఎన్నికల ముందు ఏం చెప్పాడు. రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని వాగ్దానం చేసి, దాన్ని అమలు చేయకపోవడం వల్ల జరిగిన నష్టం మొత్తం ఏపీ ఆర్థిక వ్యవస్థనే తలకిందులు చేసిందన్నది నూటికి నూరు శాతం వాస్తవం. అలాగే రైతులు కూడా ఎంతో నష్టపోయారు. వారి ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. అంతే కాదు డ్వాక్రా మహిళల బకాయిలు కూడా తీర్చలేదు. ఎగ్గొట్టి పోయాడు.
ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీసిందెవ్వరు?:
ఇవాళ చంద్రబాబు ఇంకా అంటున్నాడు. ఏపీ బ్రాండ్‌కు ఏదో అన్యాయం జరిగిపోతుందట. మరి నీవు చేసిన పనులు ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీయాలేదా? నీవు ఎన్ని మాటలు చెప్పావు? ఎన్ని అప్పులు చేశావు? ఎంత మందికి ఎగ్గొట్టి పోయావు? అన్ని చేసిన చంద్రబాబు ఇవాళ మా ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించే పనిలో పడ్డారు.
3 ఏళ్ల సంక్షేమ పాలన:
మూడేళ్ల నుంచి ఎంతో చక్కని పాలన అందిస్తున్న ప్రభుత్వం మాది. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది. కేవలం బకాయిలు తీర్చడమే కాకుండా, కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి, ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం మాది. దాదాపు రూ.1.43 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మాది. అయినా దాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇటీవల జరిగిన మహానాడు తర్వాత తానేదో బాగా బలపడినట్లు అనుకుంటున్నాడు.
ధైర్యం ఉంటే ఆ మాట చెప్పండి:
ఒకవేళ చంద్రబాబు మహాబలుడు అయితే, ఆత్మకూరులో పోటీ చేయడం లేదు. దానికి ఒక సెంటిమెంట్ చెబుతున్నాడు. ఎవరైనా సిట్టింగ్ అభ్యర్థి చనిపోతే, వారి కుటుంబ సభ్యులను నిలబడితే పోటీ చేయబోమని.
మరి నీకు ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా బరిలోకి దిగుతాము. మాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఎవరితోనూ పొత్తులకు పోము. జగన్‌గారి మాదిరిగా సింగిల్‌గా పోటీ చేస్తామని చెప్పు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట చెప్పు.
అది బలం కాదు. వాపు:
నీకు మహానాడు ద్వారా వచ్చింది బలం కాదు. అది వాపు. ఎందుకుంటే నీవు వారినీ వీరినీ తీసుకొచ్చావు. బాగా డబ్బులు ఖర్చు పెట్టావు. బాగా తొడలు కొట్టే వారిని తీసుకొచ్చి మాట్లాడించావు. బూతులు మాట్లాడే వారితో తిట్టించావు.
ఇక మా బలం పెరిగింది. జగన్‌గారి పనై పోయింది. మాదే విజయం అని చెబుతున్న చంద్రబాబుగారూ, నేను ఒక్కటే అడుగుతున్నాను. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని తొడ కొట్టండి. నీవు కానీ, మీ అబ్బాయి కానీ ఆ పని చేయండి. కానీ మీరు తొడ కొట్టలేరు. ఎందుకంటే ఏదో ఆత్మకూరు నుంచి మీరు తప్పించుకోవచ్చు కానీ, రాబోయే ఎన్నికల్లో మీకు ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకు లేదు. అలాగే అందరూ కలిసి వచ్చినా మీకు గెలిచే సత్తా అంత కంటే లేదు.
పోలవరం–కేంద్ర ప్రభుత్వం:
ఇక గౌరవ సీఎం జగన్‌గారు, ఇవాళ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. నిన్న, ఇవాళ ప్రధానిగారితో పాటు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, షెకావత్, అమిత్‌షాను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలతో పాటు, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు, కీలకమైన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని కూడా ఆయన కేంద్రం వద్ద ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు దాదాపు రూ.55,548 కోట్లకు పంపించాం. కానీ దాన్ని కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేదు. అయినా పనులు కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి దాదాపు రూ.2600 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాం. నిజానికి అవి కేంద్రం నుంచి రావాలి. అవి కూడా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
ప్రాజెక్టుకు నిధులు ముందే ఇవ్వాలి:
పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న ప్రాజెక్టు. వారు డబ్బులు ఇవ్వాలి. ప్రభుత్వం పనులు చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగంగా కొనసాగించేలా, బిల్లులు చెల్లించాక కేంద్రం ఇవ్వడం కాకుండా, ముందుగానే కేంద్రం నిధులివ్వాలని, 80 శాతం ఖర్చు చేశాక, వాటి బిల్లులు ఇస్తే, మళ్లీ నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని సీఎంగారు కోరడం జరిగింది. తద్వారా పనులు వేగంగా జరుగుతాయని సీఎంగారు చెప్పారు.
అదే విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని కూడా సీఎంగారు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.
అది ముమ్మాటికీ మీ వైఫల్యమే:
ప్రభుత్వ వైఫల్యం వల్లనే పోలవరం పనులు ఆలస్యం అవుతున్నాయని ఇటీవల చంద్రబాబు అంటున్నారు. మరి ఏ ప్రభుత్వం వైఫల్యం వల్ల అలా జరిగింది. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ గురించి ఆయన మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ వల్లనే అది కొట్టుకుపోయిందని ఆరోపించారు. చివరకు మహానాడులో కూడా అదే మాట్లాడారు. అది పెద్ద అబద్ధం. దేశంలో అబద్ధాలు మాట్లాడడంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు లేడు.
ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు, ఎలా కట్టాలన్నది ప్రజలు, మేధావులు ఆలోచించాలి. పోలవరం వద్ద కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌వాల్ కట్టడం వల్ల, భారీ వరదలు వచ్చి, అది కొట్టుకుపోయందని అందరూ చెబుతున్నారు. నిపుణులదీ అదే మాట. కానీ చంద్రబాబు ఆ మాట చెప్పకుండా, రివర్స్ టెండరింగ్ వల్లనే డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందని ఆరోపిస్తున్నారు.
ఏకంగా రూ.400 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కట్టిన చంద్రబాబు, కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఆ పని చేశారు. నిజానికి ఇదే విదేశాల్లో అయితే అంత తప్పు చేసిన వారిని ఉరి వేసేవారు.
మీలా దగుల్బాజీ పనులు చేయం:
కానీ చంద్రబాబు మాత్రం మాపై విమర్శలు చేస్తున్నారు. సీఎంగారికి, నాకూ అసలు ప్రాజెక్టు గురించి తెలియదని, డయాఫ్రమ్ వాల్ అంటే అసలే తెలియదని విమర్శిస్తున్నారు. మాకు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియకపోతే, తెలుసుకుంటాం. కానీ ఇలాంటి దగుల్బాజీ పనులు చేయం.
మీరా మాట ఎందుకు నిలబెట్టుకోలేదు?:
ఇవాళ నన్ను అంటున్నాడు. కొత్త మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తానన్నది చెప్పడం లేదని. మరి ఆరోజు మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ఏం చెప్పాడో చూద్దాం అంటూ.. ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆ వీడియో చూపారు.
‘పోలవరం ప్రాజెక్టులో 2018 కల్లా నీళ్లు నిలబెట్టి, చంద్రబాబుగారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతారు. రాసి పెట్టుకో. నీ సాక్షి పత్రికలో’.. అని ఆనాడు మంత్రి ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో అన్నారు.
ఎవరు ఎలా నిలబడ్డారు?:
మరి చంద్రబాబు అపర భగీరథుడిలా నిలబడ్డాడా. బికారిగా నిలబడ్డాడా. నీకు కూడా మైలవరంలో బికారిగా నిలబడ్డావు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని నేను డేట్ చెప్పడం లేదని అంటున్న ఉమ గారు, మీరు డేట్ పెట్టి ఎందుకు పారిపోయారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనికి సమాధానం చెప్పకుండా సీఎంగారితో చర్చకు వస్తానని, రైతులను పంపిస్తానని అంటున్నారు.
మీకు కనీస పరిజ్ఞానం లేదు:
మళ్లీ చెబుతున్నాను డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మీరు చేసిన తప్పిదమే కారణం. ఆ పాపం మీదే. స్పిల్‌వే, డయాఫ్రమ్‌వాల్, కాఫర్ డ్యామ్ అన్ని పనులు ఒకేసారి మొదలు పెట్టారు. స్పిల్‌వే పూర్తి చేసి, కాఫర్ డ్యామ్ పూర్తి చేసి, అప్పుడు డయాఫ్రమ్‌వాల్ కడితే, ఎంత వరద వచ్చినా ఆ వాల్ తెగిపోయేది కాదు. నీకు ఆ కనీస ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు.
నా వీడియోకు సమాధానం చెప్పి, అప్పుడు మమ్మల్ని అడుగు.
2018లో మీకు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు కింద అవార్డు వచ్చిందని చెప్పావు. ఏం ప్రయోజనం. మీరు ఏం సాధించారని అవార్డు తీసుకున్నారు?
ఈ రెండింటికీ సమాధానం చెప్పాలి:
అందుకే మీకు పోలవరం ప్రాజెక్టు పనుల గురించి మమ్మల్ని ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు మీకు లేదు. రెండింటికీ మీరు సమాధానం చెప్పాలి.
1). 2018కల్లా పోలవరంలో నీళ్లు నింపుతామని, ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న దానికి సమాధానం చెప్పాలి.
2). కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ చేపట్టడం చరిత్రాత్మక తప్పిదం కాదా?
ఈ రెండింటికీ సమా«ధానం చెప్పకుండా, మీరు సొరకాయ కోతలు కోస్తున్నారు. నిజానికి ఈ దేశంలో ఉన్న చట్టాల వల్ల మీరు తప్పించుకున్నారు కానీ, అదే విదేశాల్లో అయితే మీ ఇద్దరికీ ఉరి వేసే వారు.
ప్రశ్నలకు సమాధానంగా..
అది మా నిర్ణయం కాదు:
మేము ఇవాళ ఓ అండ్ ఎం పనుల కింద అన్ని చోట్ల టెండర్లు పిల్చాం కదా? కానీ అది కేవలం బాపట్లలోనే ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో ఎక్కడా లేదే? కేవలం బాపట్ల డివిజన్‌లోనే ఎందుకు వచ్చింది?
ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే, మేము ధైర్యంగా చెబుతాం. నేను ఆన్ రికార్డ్ చెబుతున్నాను. దాంట్లో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఒక రూ.13 కోట్ల పనులకు సంబంధించి ఒక ఈఈ ఆ పని ఎందుకు చేశాడో తెలుసుకుంటాం. ఆయనను వివరణ కోరుతాం. అవసరమైతే చర్యలు తీసుకుంటాం.