– కూటమి ఎమ్మెల్యేలకి చట్టాలు వర్తించవా?
– వారు తప్పు చేస్తే కేసులుండవా? చర్యలు తీసుకోరా?
– సభ్యులకు నీతులు చెప్పే స్పీకర్.. ఒక విప్ తప్పు చేస్తే పట్టించుకోరా?
– జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై తక్షణం కేసు పెట్టాలి
– బాధితురాలినే నిందితురాలిగా చేసే కుట్రలో భాగంగానే జనసేన నాయకులతో కమిటీ
– పోలీసులు, న్యాయ స్థానాలపై నమ్మకం లేక పార్టీ నాయకులతో కమిటీ వేశారా?
– తలలు తీసేసే చట్టం, చేతిలో గీతలు అరగదీస్తామని చెప్పినవన్నీ మీకు వర్తించవా?
– జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
తాడేపల్లి: వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తేనే కేసులు పెట్టి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించిన పోలీసులు.. మహిళా ఉద్యోగిపై ఏడాదిన్నర పైగా అత్యాచారం చేస్తూ వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెలుగుచూసి 24 గంటలు గడిచినా కనీసం కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యే తప్పు చేసినట్టు ఆధారాలతో సహా దొరికిపోయినా ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పార్టీ నాయకులతో కమిటీ వేసిన పవన్ కళ్యాణ్‌కి.. రాష్ట్రంలో చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. బాధితురాలినే నిందితురాలిగా చేసే కుట్రలో భాగంగానే జనసేన నాయకులతో కమిటీ వేశారని ఆమె ఆరోపించారు. ఇటీవలే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ వేధింపులపై ఒక మహిళ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసు పెట్టి వేధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తప్పు చేసిన వారిని పోలీసులు అలా వదిలేస్తుండటంతోనే వాళ్లు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారని, పేకాట ఆడుతూ దొరికిపొయిన మంత్రి సంధ్యారాణి కొడుకుపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఎన్ని తప్పులు చేసినా వారిపై చర్యలు తీసుకోరా? వారికి చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతోపాటు స్పీకర్, మహిళా కమిషన్ స్పందించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరకిపైగా అత్యాచారం చేసి లైంగికంగా వేధిస్తున్నాడని, తన కుమారుడిని చంపుతానని బెదిరిస్తున్నాడని ఒక మహిళ ఆడియో, వీడియో ఆధారాలతో సహా ప్రపంచానికి తెలిసేలా చెప్పి 24 గంటలు గడిచినా.. నిందితుడైన ఆ ఎమ్మెల్యేపై ఇంతవరకు పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు.
తనకి జరిగిన అన్యాయంపై ధైర్యం చేసి మీడియా ముందుకొచ్చి న్యాయం కావాలని మహిళ వేడుకుంటుంటే హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆదేశించలేదు.
నేను తప్పు చేసిన ఇంకొకరు తప్పు చేసినా తలలు తీసేసే చట్టం రావాలని చెప్పిన పవన్ కళ్యాణ్. తన పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా బాధ్యత తీసుకోవడం లేదు. మహిళలకు అన్యాయం జరిగితే సీబీఎన్ ప్రభుత్వం పవర్ చూపిస్తామన్న హోంమంత్రి అనిత అడ్రస్ తెలియడం లేదు. మైకుల ముందు గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పిన వీరంతా తమ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేస్తున్నారు. నిందితుడు తమ పార్టీ వాడు కాబట్టే చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ చేతిలో ఉంటే.. కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ నాయకులతో త్రీమెన్ కమిటీ వేయడం సిగ్గుచేటు. ఆయన తీరు సందేహాస్పదంగా ఉంది. బాధితురాలకి న్యాయం చేసేలా ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు, న్యాయస్థానాలుంటే పార్టీ నాయకులతో కమిటీ వేయడం ఏమిటి? చట్టాలు, న్యాయస్థానాలపై ఆయనకు నమ్మకం లేదా?
తప్పు చేస్తే అరచేతిలో రాతలు అరగదీస్తానని, రోమాలు పీకేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. తన పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఆ పని ఎందుకు చేయడం లేదు? ఆయన్ను కాపాడేలా చేయాల్సిన అవసరం ఏముంది? కాలం గడిచే కొద్దీ బాధితురాలినే నిందితురాలిగా మార్చే కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. సభ్యులకు నీతులు చెప్పే స్పీకర్.. ఒక విప్ తప్పు చేస్తే పట్టించుకోరా? బాధితులకు న్యాయం చేయలేనప్పుడు ఎథిక్స్ కమిటీ, ప్రివిలైజ్ కమిటీ దేనికి ? చిన్నారులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన ప్రభుత్వం.. తప్పు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా ఏం మెసేజ్ పంపుతున్నట్టు? ఎమ్మెల్యే అన్యాయం చేశాడని ఆధారాలతో సహా మీడియా ముందు చెబితే మహిళా కమిషన్ చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నట్టు? మహిళా ఉద్యోగికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా?