Suryaa.co.in

Editorial

జగన్ భక్తుడికి పవన్ రక్ష?

  • ఉద్యోగనేత వెంకట్రామిరెడ్డికి పవన్ పేషీ దన్ను

  • వెంకట్రామిరెడ్డికి ఆ పెద్దాఫీసరు అండ

  • ఇప్పటిదాకా విచారాణాధికారిని నియమించని పెద్దాఫీసరు

  • రెడ్డిగారికి శిక్ష పడకుండా ఆ అధికారి అభయహస్తం

  • అదే బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై గంటల్లోనే సస్పెన్షన్ ఉత్తర్వు

  • శ్రీనివాస్‌పై సస్పెన్షన్ తొలగింపు ప్రక్రియకు మూడునెలల సమయం

  • వెంకట్రామిరెడ్డిపై ఇప్పటిదాకా విచారణాధికారిని నియమించని వైనం

  • గతంలో జగన్ జమానాలో వెలిగిపోయిన ఆ అధికారికి మళ్లీ అందలం

  • ప్రజాప్రతినిధులతో సదరు అధికారి అమర్యాద ప్రవర్తన

  • కిందిస్థాయి అధికారులపై దుర్భాష

  • పవన్ పట్టించుకోకపోవడంతో చెలరేగుతున్న ఆ అధికారి

  • సీఎంఓ మాజీ అధికారి ద్వారా ఇప్పటి సీఎంఓ అధికారికి సిఫార్సు

  • తనకు పవన్ దన్ను ఉందంటూ వెంకట్రామిరెడ్డి ప్రచారం

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆ శాఖలో ఆయనో సూపర్ బాస్. అనేక శాఖలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ముందుగా ఖరారు చేసుకున్న కార్యక్రమాల్లో మినహా, ఆయన పెద్దగా ఎవరినీ కలవరు. దానితో ఆ శాఖలో ఆ సూపర్ బాస్ పెత్తనమే ఎక్కువ. పవన్ కల్యాణ్ నిర్వహించే ఒక శాఖ, ప్రజాప్రతినిధుల అవసరాలతో ముడిపడింది. దానికోసం వచ్చే ప్రజాప్రతినిధులను సదరు సూపర్ బాస్, గంటలతరబడి వెయిట్ చేయిస్తూ అవమానిస్తున్నారట.

ఇక తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిపై నోరుపారేసుకోవడం ఈ సూపర్ బాస్‌కు ఓ అలవాటు. సదరు సారుకు ‘నోటిదూల ఆఫీసర’న్న ముద్దుపేరు కూడా చాలకాలం నుంచీ లేకపోలేదు. అసలు సీఎస్‌లను కూడా, ఆయన ఖాతరు చేయరన్న ప్రచారం కొన్నేళ్ల నుంచి ఉంది. అయినా ఉత్తరాది లాబీతో పెత్తనం కొనసాగిస్తున్నారు.

అలాంటి ఈ సూపర్‌బాస్.. ఇప్పుడు జగన్‌కు భక్తుడైన వెంకట్రామిరెడ్డి అనే ఉద్యోగ సంఘ నేతను వెనకేసుకువస్తున్నారు. ఆయనపై ఎలాంటి శిక్ష పడకుండా ఉండేలా చక్రం తిప్పుతున్నారు. జగన్ జమానాలో సైతం సదరు సూపర్‌బాస్ ఒక వెలుగు వెలిగారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించి, వారితో వైసీపీకి ఓట్లు వేయించాలని తెగ తపన పడ్డారు. అప్పుడే ఉద్యోగ సంఘం నేత రెడ్డిగారికీ-ఆయనకు బాదరాయణ బంధం ఏర్పడింది.

ఇది అటు తిరిగి ఇటు తిరిగి.. ‘రెడ్డిగారికి పవన్ రక్ష ఉంద’న్న సంకేతాలకు కారణమవుతోంది. అది అబద్ధమైనప్పటికీ, సచివాలయ ఉద్యోగుల్లో వినిపిస్తున్నది ఇదే. సీఎస్..సీఎంఓ ఆదేశించినా, రెడ్డిగారి ఫైలు అంగుళం కూడా కదలలేదంటే మరేం అనుకోవాలి? ఎన్నికల ముందు జగన్ గెలుపు కోసం, కాళ్లకు బలపాలు కట్టుకుని జిల్లా పర్యటనలు చేసిన రెడ్డిగారిని, పవన్ కూడా ఏం చేయడం లేదంటే ఏమనుకోవాలి? ఆయనను రక్షిస్తున్నారనే అనుకుంటారు కదా? అవును. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది.

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘనేత వెంకట్రామిరెడ్డి తెలుసుకదా? జగనన్న జమానాలో ఆయన వైభోగం అంతా ఇంతా కాదు. తన శాఖలో కంటే, తాడేపల్లి క్యాంపు ఆఫీసే ఆయన కేరాఫ్ అడ్రసుగా ఉండేది. సచివాలయంలో టీడీపీకి సానుభూతిపరులే కాదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారులపై, వేధింపులకు నాయకత్వం వహించేవారన్న ఆరోపణలున్నాయి. వారిని అప్రాధాన్య పోస్టులకు పంపించారన్న విమర్శలున్నాయి. ఫలానా సెక్షన్ ఆఫీసరు టీడీపీ సానుభూతిపరుడనో, ఫలానా జాయింట్ సెక్రటరీ కమ్మ కులానికి చెందినవాడనో ముద్రవేసి, వారిని ఇతర సెక్షన్లకు మార్పించేవారన్న విమర్శలు లేకపోలేదు.

ఎన్నికల ముందు మళ్లీ జగన్ అధికారంలోకి రావడం కోసం, రెడ్డిగారు చేసిన శ్రమదానం అంతా ఇంతా కాదు. స్వయంగా రెడ్డిగారే జిల్లాల పర్యటనలు చేసి, ఉద్యోగ సంఘ సమావేశాలు నిర్వహించి.. వైసీపీని గెలిపించుకోవడం మన ధర్మం అంటూ, జాతినుద్దేశించి ప్రసంగించిన వీడియోలు హల్‌చల్ చేశాయి. దానితో ఎన్నికల సంఘం, రెడ్డిగారిని పక్కనపెట్టమని ఆదేశించింది. అంతవరకూ బాగానే ఉంది.

అక్కడే అసలు కథ మొదలయింది. ఏ అధికారి అయినా సస్పెండ్ చేస్తే.. బోలెడంత ఆవేదన, ఆందోళన ఉంటుంది. కానీ రెడ్డిగారికి అలాంటి చీకూ- చింతా ఇసుమంతయినా లేదు. ఎందుకంటే మరికొద్ది రోజులయితే, సర్కారీ సస్పెన్షన్ దానంతట అదే వీగిపోతుందన్న ధీమా కాబట్టి! అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఎలాగో మీరే చూడండి.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఏప్రిల్ 18న సస్పెండ్ చేసింది. ఆ మేరకు నాటి సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. తర్వాత ప్రభుత్వం ఆయనపై అభియోగాలు నమోదుచేస్తూ జీఓ కూడా ఇచ్చి, వాటికి పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సరే తానేమీ తప్పు చేయలేదని రెడ్డిగారు, దానికి సమాధానం ఇచ్చారనుకోండి. అక్టోబర్ 17 నాటికి రెడ్డిగారు సస్పెండ్ అయి ఆరునెలలవుతుంది.

అయితే నిబంధనల ప్రకారం సస్పెండ్ చే సిన అధికారిపై విచారణ జరపాలి. దానికి ఒక విచారాణాధికారిని నియమించాలి. సదరు అధికారి ఇచ్చే నివేదిక ప్రకారం, అటు ప్రభుత్వం-ఇటు సస్పెండయిన అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే విచిత్రమేమిటంటే.. వెంకట్రామిరెడ్డి సస్పెండయి ఇన్నాళ్లయినా, ఆయనపై విచారణాధికారిని నియమించకపోవడం! పైగా రెడ్డిగారిపై సస్పెన్షన్ ఎత్తేస్తూ ఫైలు తయారుచేయమని, తన కింది స్థాయి అధికారిని పెద్దసారు ఆదేశించారట. ఆ ఫైలు సీఎంఓకు చేరిన వైనం మీడియాకు తెలియడంతో, సదరు కీలక ఐఏఎస్ అధికారి ఇంకా జగన్‌భక్తుడిగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు తెరలేచింది.

దానితో సీఎస్, సీఎంఓ అప్రమత్తమయి.. రెడ్డి గారి కేసుపై త్వరగా నిర్ణయం తీసుకోమని ఆదేశాలిచ్చారు. ఎందుకంటే విచారాణాధికారిని నియమిస్తే.. ఆ ప్రక్రియ ఎన్నాళ్లు పట్టినప్పటికీ, దానిపై యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అయినా నో యూజ్. ఎందుకంటే సదరు పెద్దాఫీసర్.. సీతయ్యకు అన్నయ్య కాబట్టి!

మరిప్పుడు ఏం జరుగుతుందంటే.. రెండువారాల్లో రెడ్డిగారిపై ఇలాగే వారాలు, వర్జాల పేరుతో మీనమేషాలు వేస్తూ, విచారణాధికారిని నియమించకపోతే.. సదరు రెడ్డిగారు చక్కగా నిర్దోషిగా బయటకు వచ్చి, ఆయన నిక్షేపంగా ఉద్యోగం చేసుకోవచ్చు. చేసుకుంటారు కూడా! జరగబోయేది అదేనంటున్నారు.

ఎలాగంటే.. ప్రభుత్వం తనను సస్పెండ్ చేసి ఆరునెలలయినప్పటికీ, తనపై సర్కారు నుంచి ఎలాంటి చర్యలు లేనందువ ల్ల, తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసి, నా ఉద్యోగం నాకివ్వాలని కోర్టులో సవాల్ చేయవచ్చు. అప్పుడు కోర్టు కూడా.. రెడ్డిగారి సస్పెన్షన్ ప్రక్రియలో, సర్కారు నిబంధనలు పాటించలేదు కాబట్టి.. ఆయనపై విధించిన సస్పెన్షన్ చెల్లదని తీర్పు ఇవ్వడం సహజం.

ఇప్పుడు కోర్టు వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా..ఆ సహజమైన తీర్పు ఇచ్చేలా చూసేందుకు, తెగ కష్టపడుతున్న సదరు పెద్దాఫీసరు తీరు విమర్శల పాలవుతోంది. అంటే విచారాణాధికారిని నియమించకుండా, మరో రెండువారాలు ఇలాగే సాగదీస్తే.. అప్పుడు రెడ్డిగారు కోర్టుకెళ్లి, సర్కారు నిర్ణయంపై అక్షింతలు వేయించి, ఎంచక్కా మళ్లీ ఉద్యోగంలో జాయనయిపోతారు. దానికోసమే ఆ పెద్దాఫీసర్ ఇంత కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చట్టం తనపని తాను చేసుకుపోవడమంటే ఇదేనేమో?!
గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు.. సీఎంఓలో ఓ అధికారి కీలక శాఖలలో చక్రం తిప్పేవారు. ఆయన నోటికి అధికారులే కాదు.

ఎమ్మెల్యేలు కూడా హడలిపోయేవారు. ఆయన అరుపులు, బయట ఉన్న వాళ్లకు సైతం వినిపించేంత చిన్నవిగా ఉండేవి. సామాజికవర్గ కోణంలో, ఆ అధికారి మళ్లీ సీఎంఓలోకి వస్తారని ప్రచారం జరిగినా ఎందుకో రాలేదు. జగన్ సర్కారు కూడా ఆయనను ‘కులం పట్టింపు’ లేకుండా, జాగ్రత్తగానే చూసుకుంది. కీలక శాఖనే అప్పగించింది. అది వేరే విషయం. సదరు నోటిదురుసు అధికారి మిత్రుడైన సీనియర్ ఐఏఎస్, ఇప్పుడు సీఎంఓలో ఉన్నారట. ఆయన అండచూసుకునే, వెంకట్రామిరెడ్డికి అభయమిస్తున్న ఈ పెద్దసారు, రెచ్చిపోతున్నారన్నది అధికారవర్గాల్లో జరుగుతున్న చర్చ.

ఇక మరో రెండువారాల్లో.. తనను సస్పెండ్ చేసిన సర్కారును వెక్కిరిస్తూ, తిరిగి విధుల్లోకి చేరబోతున్న రెడ్డిగారు.. తనకు పవన్ రక్ష ఉందని ప్రచారం చేస్తున్నట్లు, సచివాలయవర్గాల కథనం. ప్రభుత్వంలో పవన్ కీలకంగా ఉన్నందున, పవన్ దగ్గర పనిచేసే ఆ పెద్దాఫీసరును గానీ, పెద్దాఫీసరు దన్ను ఉన్న తనను గానీ ఏమీ చేయలేరని రెడ్డిగారు ధీమాతో ఉన్నారట. ఇది సచివాలయ ఉద్యోగులు చెబుతున్న మాట. నిజం నారాయణుడికెరుక.

రౌతును బట్టి గుర్రం. సస్పెన్షన్ ప్రక్రియలో జగన్-బాబు ప్రభుత్వ వేగం- శైలికి చాలా తేడా కనిపిస్తుంది. జగన్ సీఎం అయిన తర్వాత వివిధ ఆరోపణలపై, చంద్రబాబుకు సుదీర్ఘకాలం నుంచీ పీఎస్‌గా కొనసాగిన శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఉదయం ఆదేశాలిస్తే.. అది ఐదారుగంటల్లో జీఏడీ, సీఎస్, సీఎం నుంచి కింది సెక్షన్లకు పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడే వేగంతో కదిలి, సాయంత్రానికి సస్పెన్షన్ ఆర్డరు వచ్చేసింది. తిరిగి శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తేసేందుకు, ముచ్చటగా మూడునెలలు పట్టింది. ఐఏఎస్ అధికారుల కమిటీ సిఫార్సు తర్వాతనే ఆయనపై సస్పన్షన్ ఎత్తేసింది. అదే ఇప్పుడు సస్పెండైన వెంకట్రామిరెడ్డిపై, విచారాణాధికారి నియామకానికి నెలలు పడుతోంది. దీన్నిబట్టి జగనంటే అధికారులకు ఉన్న భయం, చంద్రబాబు అంటే లేదన్న భావనకు కారణమవుతోంది. అది ప్రభుత్వానికి ఏమాత్రం మంచిదికాదన్నది తమ్ముళ్ల ఉవాచ.

కాగా..టీడీపీ సర్కారు హయాంలో జరిగిన ఎన్నికల ముందు.. ఈ పెద్దాఫీసర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ‘చాలా కష్టపడి సంపాదించుకున్న’ 8 కోట్ల రూపాయలు, ఆయన ఇంట్లో పనిమనిషి కొట్టేశారట. అయితే పేరుకు పోయింది లక్షల్లో అని పైకి చెప్పినప్పటికీ.. అనధికారికంగా 8 కోట్ల వరకూ ఆ పనిమనిషి కొల్లగొట్టారన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. ఇంకా అధికారవర్గాల్లో వినిపిస్తున్న మరో ఆశ్చర్యమైన ప్రచారం ఏమిటంటే.. పాట్నాలో పెద్దసారుకు మాల్ ఉండేదట. బినామీ పేరుతో నిర్మించిన తన ఇంద్రభవనం చూసేందుకు వెళ్లిన పెద్దసారు అద్దెలు, కరెంటు బిల్లుల వివరాలు అడిగితే.. ‘‘ఈ మాల్‌తో మీకేమీ సంబంధం లేదు. ఇదంతా నాదే’’నని, సదరు అతనికంటే ఘనుడైన ఆచంట బినామీ మల్లన్న అడ్డం తిరిగారట. ఇది ఐఏఎస్ సర్కిల్స్‌లో అందరికీ తెలిసిన వ్యవహారమేనని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

అసలు పెద్దసారు పనితనం గురించి అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు కొంతమంది ఫిర్యాదు చేసినా, ఆయన పట్టించుకోలేదట. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ జమానాలో కూడా పెద్దసారు వెలిగిపోయారు. ఎన్నికల సమయంలో సామాజిక పెన్షన్లను సచివాలయ, రెవిన్యూ ఉద్యోగులతోనే ఇప్పించాలని, వాలంటీర్లకు ఆ బాధ్యత ఇవ్వవద్దని కూటమి డిమాండ్ చేసింది. ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది.

ఆ సమయంలో ఈ పెద్దసారు, జగన్ కళ్లలో మెరుపుల కోసం చాలా శ్రమపడ్డారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్నారని, కేవలం వాలంటీర్లే ఖాళీగా ఉన్నారని కలెక్టర్లతో నివేదికలిప్పించారు. అంటే వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు ఇప్పించాలన్న జగన్ సంకల్పానికి, పెద్దసారు ఊతమిచ్చారన్నమాట. ఆ సమయంలో పెన్షన్ల కోసం ఎండలో క్యూలో నిల్చున్న 14మంది వృద్ధులు మృతి చెందారు.

అప్పుడు వైసీపీ నేతలు.. వృద్ధుల చావుకు టీడీపీనే కారణమని, వారి ఉసురు తగులుతుందని శాపనార్ధనాలు పెట్టిన విషయం తెలిసిందే. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించి, వైసీపీని మళ్లీ గెలిపించాలని ‘శ్రమ’టోడ్చిన పెద్దసారుకు.. మళ్లీ కీలకమైన శాఖలో ఎలా పోస్టింగ్ ఇచ్చారో పాపం తమ్ముళ్లకు ఇప్పటికీ అంతుపట్టడం లేదట.

LEAVE A RESPONSE