Suryaa.co.in

Andhra Pradesh

పవన్ చెప్పారు.. అధికారులు చేశారు!

• గుడివాడ నియోజకవర్గంలో నీటి నమూనాల సేకరణ
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాగు నీటి నాణ్యత పరీక్షలు
• 44 మంది ఇంజినీరింగ్ సహాయకులతో ఆరు బృందాలు ఏర్పాటు
• మూడు మండలాల్లో పర్యటించి నమూనాలు సేకరించి, ల్యాబ్స్ లో పరీక్షలు

గుడివాడ: ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి గుడివాడ నియోజక వర్గంలోని 44 నివాస ప్రాంతాల్లో తాగు నీటి సమస్య, అక్కడ ఉన్న నీరు రంగు మారిపోయి ఉన్న సమస్య వచ్చాయి. తక్షణమే ఆ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని, అక్కడ ఉన్న నీటిని పరీక్షించాలని పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వేదిక నుంచే ఆదేశాలు ఇచ్చారు.

ఈ మేరకు ఆర్.డబ్ల్యూ.ఎస్. యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి నమూనాల సేకరణ మొదలుపెట్టింది. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నీరు రంగు మారిపోయి తాగేందుకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రంగు మారిన నీటిని సీసాల్లో చూపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఈ బృందాల్లో ఉన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని ఏడు నివాస ప్రాంతాలలో వీరు మంగళవారం పర్యటించి నీటి నమూనాలు సేకరించారు. అక్కడి ప్రజల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు.

ఈ నీటి నమూనాలను ల్యాబ్స్ కి పంపించారు. నీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, స్వచ్ఛమైన తాగు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరాలు అందించారు.

LEAVE A RESPONSE