Suryaa.co.in

National

ప్లాస్టిక్ చెత్త ఇస్తే చాలు…ఈ కేఫ్ లో నచ్చింది తినొచ్చు.. తాగొచ్చు

ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో ఈ నెల 30న వెలుస్తున్న ఒక కేఫ్ గురించి చెప్పుకోవాల్సిందే.

ఈ కేఫ్ కు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడికి వెళ్లి.. మనకు కావల్సింది తిని, కావాల్సిన పానీయం తాగొచ్చు. జేబులో డబ్బుల్లేకపోయినా ఫర్వాలేదు. పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఇంట్లో ప్లాస్టిక్ చెత్త ఉంటే, ఓ సంచిలో వేసుకుని జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళితే సరి. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ప్రయత్నమే ఈ కేఫ్. దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కేఫ్ లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెప్పారు.

అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి ఇస్తే గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు ఒక పోహ వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఒక ఏజెన్సీని నియమించుకున్నారు.

LEAVE A RESPONSE