– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్
హైదరాబాద్: “ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ రాష్ట్రంలో ఏ వర్గాన్నీ సంతృప్తిపరచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితంగా ఉంది. 6 గ్యారంటీలను తుంగలో తొక్కిన బడ్జెట్ – కాంగ్రెస్ మోసం బయటపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా గొప్పగా హామీలిచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్రజలను అనేక రకాలుగా మోసం చేసింది.
బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ స్టేజ్ లో ఉందంటూ ప్రజలను భయపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దోషపూరితంగా చిత్రీకరిస్తోంది. వృద్ధుల పట్ల ఘోరమైన అన్యాయం చేసింది. పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడు కొత్తగా పెన్షన్లకు కూడా స్థానం కల్పించలేదు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క గారు అమృత్ పథకం వంటి కేంద్ర ప్రభుత్వం నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలను గురించి చదవారు.
రాష్ట్ర ప్రజలను తాగుడుకు బానిస చేసి అనారోగ్యానికి గురిచేసి ప్రభుత్వ ఖజానాను నింపుకునేలా వ్యవహరిస్తోంది. నిన్న, మొన్న శాసనసభలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. బీసీలను ఆదుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా మాట్లాడారు. ఈరోజు బీసీలకు బడ్జెట్ లో మొండిచేయి చూపారు. ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చుపెడతామని చెప్పారు.
బీసీ సబ్ ప్లాన్ నిధుల కింద గత సంవత్సరం బడ్జెట్ కేటాయించారు. కాని నయా పైసా ఖర్చు చేయలేదు. ఈ బడ్జెట్ లో బీసీ సబ్ ప్లాన్ పదాన్నే ఉచ్ఛరించలేదు. గత 2024-25 బడ్జెట్ లో రాష్ట్ర రైతులను ఆదుకుంటామన్నరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యమవుతామని, పంటల బీమా పథకం తీసుకొచ్చి, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఫసల్ బీమా పథకం ఊసే లేదు – గతంలో వేలకోట్ల రూపాయలు కేటాయించినా నయా పైసా ఖర్చు చేయలేదు! గతంలో పంటల బీమా పథకం కోసం వేలకోట్ల రూపాయలు కేటాయించి, నయా పైసా ఖర్చు చేసింది లేదు. ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు. బడ్జెట్ లో కేటాయింపుల్లేవు. రైతు భరోసా కింద రూ.19 వేల కోట్లు బకాయిలు ఉన్నా 2025-26 బడ్జెట్ లో కొత్తగా నిధులు కేటాయించలేదు!
2025-26 బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించారు. కాని, అందులో రూ. 19 వేల కోట్ల మేర బకాయి ఉన్న రైతు భరోసా కే అవసరం. రాష్ట్రంలో 50 శాతం మేర రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ లో రైతులకు రుణమాఫీ కోసం నిధులు కేటాయిస్తారని రైతులు ఆశపడ్డరు. కాని, నిధులు కేటాయించలేదు.
నిరుద్యోగ యువతీయువకులకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి జాడలేదు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. గతంలో రూ. 9148 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు 3,500 అని చెప్తున్నారు, కానీ గతేడాది కేటాయించిన రూ. 9,148 కోట్లు ఖర్చు చెయ్యలేదేంటి? ఈ సంవత్సరం మరో 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున కేటాయిస్తామన్నరు. కాని, ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయింపులు మాత్రం అరకొర మాత్రమే.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికీ రూ. 10 లక్షల చొప్పున వైద్యసాయం అందలేదు. ఆరోగ్య శ్రీ కార్డులు తీసుకెళ్తే ఆసుపత్రుల్లో రిజెక్ట్ చేస్తున్నారు! రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులు తీసుకెళ్తే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆసుపత్రిలోకి రానివ్వడం లేదు.
ప్రపంచంలోనే హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేదు. గత బడ్జెట్ లో హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తే, అందులో కనీసం 10 శాతం కూడా ఖర్చు చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్, ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టులకు నిధులే లేవు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసి, ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేవరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో దావోస్ వెళ్లి తెలంగాణలో పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. కాని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వడం లేదు. దీంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధించడంతో ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా సాయం చేయకపోతే.. రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల పాలనలో రూ. లక్షా 50 వేల కోట్ల మేర అప్పులు చేసింది. కాని, ప్రజలకు ఒరిగిందేమీలేదు.