– తొలి విడతలో మూడు డీఏలకు నగదు చెల్లింపు?
– మిగిలిన రెండు డీఏలకు నిర్దిష్ట గడువులో చెల్లింపు?
– బాండ్లు లేదా నగదుపై అస్పష్టత
– పెండింగ్ డీఏలన్నీ ఒకేసారి చెల్లించిన ఘనత సొంతం చేసుకోనున్న రేవంత్‌రెడ్డి
– దేశంలోని సీఎంలకు ఆదర్శంగా రేవంత్‌రెడ్డి సరికొత్త సాహసం
– ఉద్యోగుల మనసు గెలవనున్న సీఎం రేవంత్‌రెడ్డి
– మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధం
– విపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఎత్తుగడ
– ఉద్యోగులను శాశ్వతంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహం
– 10 లక్షల మంది తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల పెదవులపై చిరునవ్వులు
– 600 కోట్ల రూపాయల విడుదలకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికారంలోకి వచ్చిన పదినెలల అచిరకాలంలోనే రైతులు, మహిళలు, విద్యార్ధుల మనసు గెలిచిన సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు 10 లక్షలమంది తెలంగాణ ఉద్యోగ, పెన్షనర్లు, ఇతర శాఖల సిబ్బంది పెదవులపై చిరునవ్వులు పూయించే సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, ఇతర సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏ బకాయిలను ఒకేసారి చె ల్లించడం ద్వారా.. దేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచే ప్రణాళికలకు ఊపిరిపోస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రకంగా 600 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలోని 10లక్షల మంది ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రేవంత్‌రెడ్డి సర్కారు శుభవార్త వినిపించనుంది. ఇది ఇప్పటివరకూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసంగానే కనిపిస్తోంది. అదేమిటంటే.. కేసీఆర్ జమానా నుంచి ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న 5 డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి రెండు డీఏ బకాయిలు కూడా ఒకేసారి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పటికీ.. ఉద్యోగ వర్గాలను శాశ్వతంగా మెప్పించేందుకు, కొంత సాహసం చేయడం తప్పదంటున్నారు. అదీగాక గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. గతంలో జిల్లాల వారీగా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండగా, రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఒకటి, రెండు తేదీల్లోనే జీతాలిస్తుండటంతో ఉద్యోగ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని డీఏ బకాయిలను చెల్లిస్తామన్న హామీ మాత్రం అలాగే ఉండిపోయింది.
పది నెలలయినప్పటికీ, దానిపై ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడంతో, ఉద్యోగుల్లో మళ్లీ అసంతృప్తి మొలకెత్తడం ప్రారంభించింది. అది పెరిగి పెద్దదయితే ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం- అది విపక్షాలకు అస్త్రంగా మారడం ఖాయమని గ్రహించిన సర్కారు నష్టనివారణకు దిగింది. ఉద్యోగుల అసంతృప్తి పెరిగి పెద్దది కాకముందే, వారి అసంతృప్తికి శాశ్వతంగా తెరదించాలని నిర్థయించినట్లు చెబుతున్నారు.
అందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే అందులో మూడు డీఏ బకాయిలకు నగదు చెల్లించాలని నిర్ణయించారంటున్నారు. మిగిలిన రెండు డీఏలకు బాండ్లు ఇవ్వడమా? లేదా నిర్దిష్ట గడువులోగా విడతల వారీగా చెల్లించడమా అన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
బహుశా మిగిలిన రెండు డీఏ బకాయిలు మార్చిలో చెల్లిస్తామని హామీ ఇవ్వడం ద్వారా, ఉద్యోగులను మెప్పించవచ్చని భావిస్తోంది. నిజానికి ఉద్యోగులు మిగిలిన రెండు డీఏ బకాయిలను మార్చిలో ఇచ్చినా సంతోషమేనంటున్నారు. బహుశా ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి.. మార్చి వరకూ తమపై ఒత్తిడి తీసుకురావద్దని ఉద్యోగ జేఏసీ నేతలను కోరినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతానికి రెండు డీఏలు చెల్లిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే 300 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కానీ దానికి బదులు..ఎవరూ ఊహించని విధంగా మూడు డీఏ బకాయిలకు సంబంధించి 450 కోట్లు ఒకేసారి చెల్లించడం ద్వారా, తెలంగాణ ఉద్యోగుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఇది బీఆర్‌ఎస్-బీజేపీలకు అస్త్రం కాకుండా నిలువరించవచ్చన్న మరో వ్యూహమంటున్నారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంది. వివిధ శాఖల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో, వారు కొత్త పనులు చేయడంలేదు. కొన్ని జిల్లాల్లో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఉన్న ఆదాయం జీతాలు, అప్పులకు సంబంధించిన వడ్డీ చెల్లింపులకే సరిపోతున్నాయి. గత నెలలో ఎక్సైజ్‌పై ఆశించిన ఆదాయం కూడా రాలేదు. కొత్తగా తీసుకున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలోనూ ఇబ్బంది పడుతోంది. అదే విషయాన్ని నిన్న జేఏసీ భేటీలో సీఎం ఉద్యోగ సంఘ నేతల వద్ద వాపోయినట్లు తెలిసింది.
అయినప్పటికీ.. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఐదు పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించడం ద్వారా, ఉద్యోగ వర్గాలను శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకోవచ్చన్నది రేవంత్ సర్కారు యోచనగా కనిపిస్తోందంటున్నారు. అయితే ఇందుకు నిధుల సమస్య ప్రతిబంధకంగా ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రాధాన్యతలు తగ్గించుకుని, ఆ నిధులు పెండింగ్ డీఏ బకాయిలల కోసం కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యోగుల మనసులో చిరస్థాయిగా నిలవడంతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచిపోవడం ఖాయం.