– మన ఊరు – మన బడి కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ సర్కార్..
– రెండున్నరేళ్లుగా 1500 మంది సివిల్ కాంట్రాక్టర్లకు మొండిచెయ్యి..బిల్లు చెల్లించమని అడిగితే అక్రమ కేసులు.
– వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్.
– రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు
హైదరాబాద్: పెండింగ్ బిల్లులు రాక, అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్న మన ఊరు మన బడి సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించడం లేదని, న్యాయంగా అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వారు వాపోయారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాం. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోంది.అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? మీకు కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్లను బిల్లును గాలికి వదిలేశారా ముఖ్యమంత్రి గారు?
తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని వేడుకున్నా స్పందన లేదు. చివరికి, సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే.. వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం పై శాసనమండలి చైర్మన్ గారు మండలి సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు.మన ఊరు మన బడి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని, తమ సొంత ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బిల్లులు విడుదల చేయాలని తాను స్వయంగా ముఖ్యమంత్రిని కోరినా.. బిల్లులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
కనీసం ఇప్పుడైనా మన ఊరు – మన బడి కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా? లేక ఆ డబ్బును కూడా కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెడతారా?
పేద పిల్లల కోసం పాఠశాలలు బాగుచేసిన చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టకండి. వెంటనే ఆ 1500 మంది పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.