– జనం మధ్యలో ‘బయో’ బాంబు
– బయో మెడికల్ వేస్టుతో మాయ‘రోగాలు’
– నదులు, కాల్వలు, చెరువు, రోడ్లపై ఆసుపత్రి వ్యర్ధాలు
– ఆసుపత్రుల్లో నిపించని రెడ్,ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులు
– సీపీసీబీ నిబంధనలు అమలు చేయని పీసీబీ అధికారులు
– పీసీబీ రీజియన్ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ల మొద్దు నిద్ర
– కాసుల కక్కుర్తితో ఆసుపత్రులతో కుమ్మక్కవుతున్న మునిసిపల్ అధికారులు
– ట్రీట్మెంట్ ప్లాంట్ల మాఫియాతో ముందుకు రాని కొత్త ప్లాంట్లు
– వారితో పీసీబీ ఉన్నతాధికారుల మిలాఖత్?
– కొత్త వారిని రానీయని బిజినెస్ మాఫియా
– బెడ్ల నిష్పత్తిలో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని సీపీసీబీ నిబంధనలు
– అయినా కొత్త ప్లాంట్లకు పీసీబీ అధికారుల మోకాలడ్డు
– ప్లాంట్లకు ఒక్కో జిల్లా నుంచి నెలకు 50 లక్షల ఆదాయం?
– సీపీసీబీ నిబంధనలకు ప్లాంట్లు నీళ్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆసుపత్రికి వెళితే డాక్టర్లు-నర్సులు వాడే సిరంజీలు, సూదులు, మాస్కులు, గ్లౌజులు, దూది, బ్యాండెడ్, బ్లెడ్శాంపిల్స్ దర్శనమిస్తుంటాయి. మనం బిల్లు కట్టి మన మానాన మనం వెళ్లిపోతాం. మరి అవి ఏమవుతాయి? వాటిని ఏం చేస్తారు? అసలు ఏం చేయాలి అన్నది ఎవరికీ తెలియదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) దానికోసం కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించింది.
మరి అమలవుతున్నాయా? వాటిని పీసీబీ కఠినంగా అమలు చేస్తోందా? సంబంధిత ఇంజనీర్లు వాటిని పర్యవేక్షిస్తున్నారా? నిజంగా అధికారులు పర్యవేక్షిస్తూ, తనిఖీ చేస్తుంటే.. ఆసుపత్రి వైద్య వ్యర్ధాలు ఎందుకు రోడ్డుపాలవుతున్నాయి? రోజూ మీడియాలో ఎందుకు వస్తున్నాయి? ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయాల్సిన ఆ వ్యర్ధాలు.. నదులు, చెరువులు, భూమిలో ఎందుకు కనిపిస్తున్నాయి? పట్టణాలు-పంచాయితీల్లో రోడ్డుపక్కన ఎందుకు దర్శనమిస్తున్నాయి? ఎందుకు కుప్పలుగా పడి ఉంటున్నాయి? అసలు బెడ్ల ఆధారంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలన్న సీపీసీబీ నిబంధనలను, పీసీబీ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎవరి కోసం అడ్డుకుంటున్నారు? ఆ 12 కంపెనీల గుత్తాధిపత్యం ఎందుకు? ఎవరు కొనసాగిస్తున్నారు? వాటిపై పీసీబీ అధికారుల ప్రేమకు కారణమేమిటి?.. ఇవన్నీ సమాధానం దొరకని భేతాళ ప్రశ్నలు.
బయో.. భలే భలే బయో మెడికల్ వేస్ట్. ఇది ఆసుపత్రులు ఉత్పత్తి చేసే వైద్య వ్యర్ధాలు. ప్రతి ఆసుపత్రి-నర్సింగ్ హోం-క్లినిక్-బ్లడ్‌బ్యాంకుల నుంచి.. రోగులు వినియోగించిన సిరంజీలు, సూదులు, మాస్కులు, గ్లౌజులు, దూది, బ్యాండెడ్, బ్లెడ్శాంపిల్స్, టాబ్లెట్లు ఉత్పత్తి అవుతాయి. నిజానికి వాటిని వేరు చేసి రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులు ఏర్పాటుయేయాలన్నది సీపీసీబీ నిబంధన. తమ వైద్య వ్యర్ధాలను 48 గంటల్లోగా తరలించి, నిర్మూలించాలన్నది సీపీసీబీ నిబంధన. కానీ వీటిని ఏ ఒక్క ఆసుపత్రి పట్టించుకునే పరిస్థితి లేదు.
అంతా కలసి ఒక గోతంలో పెట్టి, బయో కంపెనీలు పంపే ఆటోలో కుక్కేస్తుంటారు. ఇది ఆసుపత్రుల వద్ద తరచూ కనిపించే దృశ్యమే. ప్లాంట్లకు పైసలే పైసలు! వాటిని బయో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తీసుకుని… సూదులను సోప్పిట్లో నానబెట్టి, హైపో సొల్యూషన్‌తో నానబెట్టి శుద్ధి చేస్తారు. తర్వాత దానిని పాత ఇనుముకు అమ్ముకుంటారు. దూదిని తగలబెడతారు. ఆ పిట్ నిండిపోతే దానిని కాంక్రీట్‌తో మూసివేయాలి. అందుకోసం తగిన టెంపరేచర్ మెయిన్టైన్ చేయాల్సి ఉంటుంది.
మళ్లీ కొత్త పిట్ తవ్వాలి. ఈ వ్యవహారంలో ప్లాంటు నిర్వహకులకు అంతా లాభమే. ఆటో చార్జీలు-కెమికల్ మాత్రమే ఖర్చు. శుద్ధి చేసిన సూదులను ఇనుముకు అమ్ముకోగా, సిరెంజీ, స్లైన్ బాటిళ్ల వ్యర్థాలను ప్లాస్టిక్‌కు అమ్ముకుంటారు. ఆ రకంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు గతంలో ల్యాబ్‌కు 600, డెంటల్ ఆసుపత్రికి 500 రూపాయలు, 50 బెడ్ల ఆసుపత్రికయితే 5 వేలు, 100 బెడ్లు ఉంటే 10 వేల రూపాయల ఫీజు వసూలు చేసేవారు. అయితే ఈ ట్రీ ట్మెంట్ ప్లాంట్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయా? లేదా? శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్నాయా? లేవా అన్నది చూడాల్సిన బాధ్యత పీసీబీ అధికారులదే. కానీ అధికారులు దానిపై దృష్టి సారించడం లేదన్నది ఒక ఆరోపణ. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఉన్న 12 బయో మెడికల్ వేస్ట్ ప్లాంట్లపై ఎలాంటి పెనాల్టీలు, కేసులు నమోదు చేయలేదంటే.. వారితో పీసీబీ అధికారుల బంధం ఎంత బలంగా ఉందో సుస్పష్టం. అసలు ప్రజలు-మీడియాకు దీనిపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో, అంతా గుంభనంగా జరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. పీసీబీలో పనిచేసి రిటైరన అధికారులకు సైతం, ఈ ప్లాంట్లు ఉన్నాయన్నది పీసీబీ ఉద్యోగుల గుసగుస.
ఆ 12 ప్లాంట్ల గుత్తాధిపత్యమే ఎందుకు? రాష్ట్రంలోని వేలాది ఆసుపత్రుల నుంచి వచ్చే వైద్య జీవ వ్యర్ధాలను శుద్ధి చేసి నిర్మూలించే బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంటు.. కేవలం 12 మాత్రమే ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. నిజానికి జిల్లాకో ప్లాంటు, బెడ్ల నిష్పత్తి ప్రకారం ప్లాంట్లకు అనుమతివ్వాలన్నది ఒక నిబంధన. కానీ ఈ రంగంలో ఎన్నాళ్ల నుంచో పాతుకుపోయిన ఆ పన్నెండు కంపెనీలు కొత్తగా ఎవరినీ రానీయవని, ఒకవేళ ధైర్యం చేసి ప్లాంటు పెట్టేందుకు ముందుకువచ్చినా, వారిపై కోర్టులో కేసులు వేసి వెనక్కి పంపిస్తుంటారట. అంటే ప్లాంటు పెట్టే వ్యక్తికి అర్హత-అనుభవం-అనుమతులు లేవంటూ కేసు వేస్తారట. దానితో అది కోర్టులూ కొన్ని నెలలపాటు విచారణ జరిగిన తర్వాత.. కొత్తగా ప్లాంట్లు నిర్మించుకునే వారికి మూడునెలల పాటు సమయం ఇవ్వాలని, అప్పటివరకూ దానికి అనుమతి ఇవ్వవద్దని ఆదేశిస్తుంటుంది.
ఇలా కొత్తగా ప్లాంటు నిర్మించాలనుకునేవారికి, ఎన్నాళ్ల నుంచో ఇందులో పాతుకుపోయిన ప్లాంట్ల యజమానులు మోకాలడ్డుతాయట. పీసీబీ ఆఫీసులోని ఉన్నతాధికారుల దన్ను ఉండటమే దానికి కారణమట. గతంలో ప్లాంట్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని వెనక్కి పంపించిన ఓ అధికారి చర్య వల్ల, తాము ఇప్పటి కీ ప్లాంటు పెట్టుకోలేకపోయామని, ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన ఓ దరఖాస్తుదారుడు వాపోయారు. అప్పట్లో పీసీబీ బాసులుగా పనిచేసిన విజయకుమార్, నీరబ్‌కుమార్ హయాంలో కొత్త వారిని రానీయలేదని.. పైగా దరఖాస్తుదారులపై టీడీపీ ముద్ర వేసి, తిరస్కరించేవారని తమ అనుభవం వెల్లడించారు.
ఈ 12 కంపెనీలకు, పీసీబీ ఆఫీసులోని ప్రముఖులతో ఇప్పటికీ మహా సిమెంట్ అంత బలమైన బంధం కొనసాగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ప్లాంట్లు నెలకు 30 నుంచి 40 లక్షల వరకూ సంపాదిస్తున్నాయన్నది ఒక అంచనా. ఇందులో ఒకే వ్యక్తికి మూడు ప్లాంట్లు ఉండటం విశేషం. ఈ కంపెనీతో పీసీబీ ప్రముఖులకు విడదీయలేని బంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది మొదటి నుంచి చాలా ‘సేఫ్’ ‘రైన్బో’ గేమ్ ఆడుతున్నాయని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
సీపీసీబీ నిబంధనలకు నీళ్లు అసలు ఎన్ని బెడ్లకు.. ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లను అనుమతించాలన్నది సీపీసీబీ స్పష్టంగా పేర్కొంది. ఒక ప్రాంతంలో ప్రతి 10 వేల బెడ్లకు, ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలన్నది ఒక నిబంధన. కానీ ఆ ప్రకారం ఎక్కడా ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏపీపీసీబీ అధికారులు అనుమతించకపోవడమే ఆశ్చర్యం. కారణం.. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ల యజమానులతో ఉన్న ఫెవికాల్ బంధమేనన్నది ఒక ఆరోపణ. ఉదాహరణకు ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 2 నుంచి 3 వేల చిన్నా-పెద్దా ఆసుపత్రులన్నాయి. ఆ ప్రకారంగా దాదాపు 23 వేల బెడ్లు ఉంటాయన్నది ఒక అంచనా. ఆ లెక్కన రెండు ప్లాంట్లకు అనుతివ్వాలి.
యాప్ లో ఎంట్రీ చేయరేం? సీపీసీబీ నిబంధన ప్రకారం.. ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ నిర్వహకులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్ధాల వివరాలను ‘బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్’లో ప్రతిరోజూ నమోదు చేయాల్సి ఉంది. ఆవిధంగా చేస్తే.. ఒక ఆసుపత్రి సగటున ఎంత వైద్య జీవ వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తుందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈవిధంగా ఆసుపత్రి నిర్వహకులు తమ వ్యర్ధాలను యాప్‌లో నమోదు చేస్తున్నారా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సిన బాధ్యత పీసీబీ అధికారులదే.
అలా యాప్‌లో ఎంట్రీ చేయని ఆసుపత్రులపై చర్య తీసుకునే అధికారం కూడా పీసీబీకి ఉంది. కానీ ఇప్పటివరకూ పీసీబీ అధికారులు.. ఆసుపత్రులు ఆ యాప్‌లో వ్యర్ధాల ఉత్పత్తిని ఎంట్రీ చేస్తున్నాయా? లేవా? అన్నది తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. ప్రతి జిల్లా కలెక్టర్ దానికోసం సమీక్షలు నిర్వహించి, ఆదేశాలు జారీ చేస్తున్నా అదే పరిస్థితి.
ఒక్కో రోగి నుంచి 183 గ్రాముల జీవ వైద్య వ్యర్ధాలు గతంలో సీపీసీబీ నిర్వహించిన ఒక సర్వేలో ఒక్కో బెడ్- ఒక్కో రోగి నుంచి సుమారు రోజుకు 183 గ్రాముల జీవ వైద్య వర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు తేల్చింది. సీపీసీబీ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై.. గతంలో రీజియన్ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు తనిఖీ చేసి, నోటీసులు ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అటు ఆసుపత్రులు-ఇటు ట్రీట్మెంట్ ప్లాంట్లను తనిఖీ చేసే ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లే కరవయ్యారు. అదేమంటే.. సరిపడా అధికారులు- సిబ్బంది లేరన్నది పీసీబీ అధికారుల వాదన.
మునిసిపాటీల్లో ‘బయో’ంకర అవినీతి మెడికల్ బయో వేస్ట్‌ను ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఇస్తే డబ్బులు ఖర్చవుతాయన్న లోభితనంతో పట్టణాలు, పంచాయతీల్లోని ఆసుపత్రుల యజమానులు.. స్థానికంగా ఉన్న రోడ్లు, చెరువుల్లో పారేస్తున్నారు. ఇది మున్సిపాలిటీలో హెల్త్ అధికారులకు తెలిసే జరుగుతున్న వ్యవహారం.
లేకపోతే ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోరు? నిజానికి ఈ బయో మెడికల్ వేస్ట్ నిర్మూలన వ్యవహారం ఒక్క పీసీబీకి సంబంధించినదే కాదు. మున్సిపాలిటీలు-స్థానిక సంస్థల బాధ్యత కూడా. కానీ మున్సిపల్ అధికారులు ఈ అవినీతిలో భాగస్వాములవుతున్న వైనం.. పారిశుధ్య కార్మికులకు శాపంగా మారుతోంది. ఇంజక్షన్ నీడిల్స్‌ను చెత్తలో పడేస్తున్న ఆసుపత్రుల వ్యర్థాలను చేతితో తీసుకుంటున్న పారిశుధ్య సిబ్బంది రోగాలపాలవుతున్న పరిస్థితి. ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా, క్షయ, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు వాడే ఇంజక్షన్ నీడిల్స్ గుచ్చుకుంటే, పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఏమిటి?
జనం గుండెల్లో బ్యాక్టీరియా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీల్లో విచ్చలవిడిగా పారబోస్తున్న ఈ బయో మెడికల్ వేస్ట్.. ప్రజల ప్రాణాలకు సవాలుగా పరిణమించింది. జనావాస ప్రాంతాల్లో వీటిని పారబోస్తున్న క్రమంలో.. ఆ వ్యర్థాలు గాలి ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు కారణమవుతున్నాయి. దానితో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోగాలబారిన పడుతున్న విషాదం. శ్రీకాకుళంలో నాగావళి, ఉమ్మడి విశాఖలో శారదా నది పరిసర ప్రాంతాలు.. ఈ బయో మెడికల్ వేస్ట్‌తో నిండిపోయి, భయంకరంగా కనిపిస్తున్న దృశ్యాలు లెక్కలేనన్నిసార్లు మీడియాలో వచ్చినా.. పీసీబీలో చలనం కరవు.







