Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయాల్లో శుంఠ, పనికిమాలిన వ్యక్తి చంద్రబాబే

– వైయస్ఆర్ సిపి జెండాలను తొలగించాలంటూ రెచ్చగొట్టింది బాబే
– కర్రలు, రాళ్ళతో వైయస్ఆర్ సిపి వారిపై దాడికి ఉసిగొల్పాడు
– బయటి నుంచి తీసుకువచ్చిన వారితో హింసకు పాల్పడ్డారు
– కొల్లుపల్లిలో సురేష్ రెడ్డి, బయ్యారెడ్డితో పాటు రెండేళ్ళ పసిపాపపై కూడా రాళ్ళ దాడి చేశారు
– రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పంలో ఇక బాబు గెలవడం కల్ల
కుప్పంలో మరోసారి చంద్రబాబు గెలవడం కల్ల అని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, గనులు, శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
14 ఏళ్ళు సీఎంగా, 19 సంవత్సరాలు కేబినెట్ హోదాలో ఉండి మొత్తం 33 ఏళ్ళ పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం అభివృద్దిని ఏనాడు పట్టించుకోలేదు. తన అవసరాలకే కుప్పం ప్రజలను వాడుకున్నాడే తప్ప, ఈ ప్రాంత అభివృద్ధిని గురించి కనీసంగా కూడా ఆలోచించలేదు. కుప్పం బ్రాంచి కెనాల్, గాలేరి-నగరి పథకాలను పూర్తి చేయాలని ఏనాడు ఆయన ప్రయత్నించలేదు.
వైయస్ జనగ్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్ళలో కుప్పం ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని చేరువ చేశారు. ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేశారు. అందుకే గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లు స్వయంగా పర్యటించి ఓట్లు అభ్యర్థించినా సరే.. వైయస్ఆర్ సిపికే కుప్పం ప్రజలు అన్నింటా పట్టం కట్టారు.

ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు కుప్పంలో తన పీఠం కదిలిపోతుందని భయపడుతున్నాడు. వైయస్ జగన్ పాలన చూసి తట్టుకోలేకపోతున్నాడు. అందుకే, గతంలో 33 ఏళ్ళలో పర్యటించినన్నిసార్లు, ఈ మూడేళ్ళలోనే కుప్పంలో పర్యటించాడు. మొత్తం 33 ఏళ్ళలో ఎన్నిసార్లు చంద్రబాబు కుప్పంకు వచ్చాడో ప్రకటించాలి.

ప్రతిసారీ దౌర్జన్యాలతోనే కుప్పంలో బాబు గెలుపు
ప్రతిసారీ తన దౌర్జన్యాలతో కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ప్రజలు కళ్ళు తెరిచారని గ్రహించి తాజాగా తన తొలిరోజు పర్యటనలో మరోసారి దౌర్జన్యం, దాడులు, హింసతో తన నైజంను చాటుకున్నాడు. తొలిరోజు కొల్లుపల్లి గ్రామంలో వైసిపి నేతలు సురేష్ రెడ్డి, ఆయన సోదరుడు బయ్యరెడ్డిలతో పాటు ఆరేళ్ళ చిన్నారిపై కూడా టిడిపి వారు రాళ్ళు రువ్వి గాయపరిచారు. ఆ వీడియో లను కూడా ఈ పత్రికా సమావేశంలో ప్రజల ముందు చూపుతున్నాం.

బయట నుంచి రౌడీలను తెచ్చారు
బయటి నుంచి తీసుకువచ్చిన వారితో కొల్లుపల్లిలో వైఎస్ఆర్సీపి జెండాలను, బ్యానర్లను బలవంతంగా తొలగించడం, మా పార్టీ వారిపై రాళ్ళు రువ్వాలని రెచ్చగొట్టడం, జగన్ , రామచంద్రారెడ్డి, డిజిపిని రమ్మనండి.. అమీతుమీ తెల్చుకుందామంటూ చంద్రబాబు సవాళ్ళు చేయడం, రంకెలు వేయడం ద్వారా ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబు సృష్టించిన హింసను నిరసిస్తూ రెండోరోజు వైయస్ఆర్ సిపి శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలిపాయి. ఆ దృశ్యాలను కూడా ఈ మీడియా సమావేశం సందర్భంగా ప్రజల ముందు ప్రదర్శిస్తున్నాం.

కుప్పం తో పాటు రాయలసీమకు నష్టం చేసింది బాబే
33 ఏళ్ళలో కుప్పంకు, చిత్తూరు జిల్లాకు, రాయలసీమకు చంద్రబాబు ఏం చేశాడు? తన సొంత నియోజకవర్గంకే కాదు . రాయలసీమకు అత్యంత నష్టం చేసిన ఎకైక సీఎం చంద్రబాబు. కుప్పం బ్రాంచి కెనాల్, గాలేరీ-నగరి కాలువ పనులను తనకు సంబంధించిన వ్యక్తికే చంద్రబాబు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని మేం ఎన్నిసార్లు కాంట్రాక్టర్ ను సంప్రదించినా సరైన విధంగా స్పందించలేదు. రాజకీయ కుట్రతోనే ఈ పనులను పూర్తి కాకుండా చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందున కాంట్రాక్ట్ ను రద్దు చేశాం. ఇచ్చిన మాట ప్రకారం కుప్పం బ్రాంచి కెనాల్ ను పూర్తి చేసిన తరువాతే ఎన్నికలకు పోతాం. ఇదీ మా నిబద్దత.

ఆ పేర్లు పెట్టి బాబు శునకానందం
ఏ నాయకుడు అయినా తాను అధికారంలోకి వస్తే ఈ మంచిపనులు చేస్తాను, మీకు అభివృద్ధిని అందిస్తాను అని తనను గెలిపించాలను ప్రజలకు చెబుతాడు. కానీ చంద్రబాబు మాత్రం తాను చేసిన, చేయాలనుకుంటున్నది ప్రజలకు చెప్పంకుడా జగన్ ని, రామచంద్రారెడ్డి పుంగనూరు పుడింగా.. అంటూ నన్ను, కొత్త పేర్లు పెట్టి మమ్మల్ని నిందించడం ద్వారా శునకానందం పొందుతున్నాడు. దీనిని ప్రసారం చేస్తూ ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా సంతోషపడుతోంది.
బయటి నుంచి తీసుకువచ్చిన వారితో చంద్రబాబు చేయించిన కొట్లాటలు, గలాటాల్లో వైయస్ఆర్ సిపి వారే గాయపడ్డారు. టిడిపి వారికి చిన్న గాయమైనా, దానిని ఎల్లో మీడియాలో గోరంతలను కొండతలుగా చూపించి ఉండేవారు కదా? మీరు దౌర్జన్యానికి పాల్పడి, మాపై నిందలు మోపుతున్నారు. ఎదైనా మాట్లాడితే రాష్ట్రం శ్రీలంకలా మారిందని విమర్శిస్తున్నాడు. అలా అయితే కేంద్రం తక్కువ రుణాలు తీసుకుంటున్న రాష్ట్రం ఎపి అని ఎందుకు ప్రకటించింది?

రాజకీయాల్లో పనికిమాలిన శుంఠ బాబే
ఈ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనే పనికిమాలిన నాయకుడు, తనసొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని వ్యక్తి, వెన్నుపోటుదారు, రాజకీయ శుంఠ ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చంద్రబాబును తలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వర్గీయ వైయస్ఆర్ సిఎంగా ఉన్పప్పుడు పాలార్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తే… తమిళనాడు ప్రభుత్వంతో లోపాయికారిగా మాట్లాడి ఆ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ఆపించే ప్రయత్నం చేశాడు.

ఈ రోజు హంద్రి-నీవా, కుప్పం బ్రాంచి కెనాల్ నిర్మాణంతో పాటు కుప్పం ప్రజలకు వేమనూరు రిజర్వాయర్ ను నిర్మించి, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చబోతున్నాం. జగన్ గారు అమలు చేసిన పథకాలు ప్రజలకు చేరువ అవ్వడం వల్లే మేం ప్రజల్లో తిరగగలుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మీరు మాత్రం జెండా కర్రలు, రాళ్ళతో ప్రజల మీద దాడి చేయడం వంటి నీతిమాలిన పనులకు పాల్పడుతున్నారు.

దౌర్జన్యాలతో ప్రతిసారీ కుప్పంలో గెలిచినట్లు కాదు. ఇక్కడ ప్రజల కోసం పనిచేసే భరత్ వంటి నాయకుడిని ఎమ్మెల్యేగా నిలబెడతామని వైయస్ జగన్ ప్రకటించారు. అంతేకాదు ఆయన గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని, ఈ ప్రాంతంను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పిస్తామని జగన్ చెప్పారు. ఇవ్వన్నీ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నాడు. భరత్ ను బలహీనపరచాలని, ఆయనతో ఉన్న వారిని వేధించాలని దౌర్జన్యానికి దిగుతున్నాడు.

దేశంలోనే ఒక విలక్షణ రాజకీయ పంథాతో సీఎం వైయస్ జగన్ గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు 95శాతంకు పైగా పూర్తి చేశారు. 31 లక్షల మందికి ఇళ్ళస్థలాలు ఇచ్చారు. పక్కా గృహాలను నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, రైతుభరోసా, నూరుశాతం ఫీజురియాంబర్స్ మెంట్ ఇలా అన్ని రకాల సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశారు.

నాలుగున్నరేళ్లు సున్నం.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అన్నం.. ఇదీ బాబు స్కీమ్
ఎన్నికల సందర్బంగా ఆరువందల హామీలు ఇచ్చిన చంద్రబాబు తన హయాంలో ఎన్ని హామీలను నెరవేర్చారో ప్రజలకు స్పష్టం చేయగలరా? నాలుగున్నర ఏళ్ళపాటు ప్రజలకు సున్నం పెట్టడం, ఎన్నికలకు ఆరు నెలలు ముందు అన్నం పెట్టడం చంద్రబాబు నైజం. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉంటే… జగన్ మాదిరిగా, నీతివంతంగా, విశ్వసనీయ రాజకీయాలు నడిపే మాలాంటి వారికి అసహ్యం కలుగుతుంది.

చంద్రబాబు హయాంలో ఆయన కుమారుడు డీఫ్యాక్టో సీఎంగా ఉన్నాడు. రాజధానిలోనే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు? అధికారంలో ఉండి కూడా తన కుమారుడిని ఎమ్మెల్యే గా గెలపించుకోలేకపోయాడు, అదీ చంద్రబాబు నాయకత్వ పటిమ.

కుప్పంను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని చంద్రబాబు సీఎం వైయస్ జగన్ కు లేఖ రాశారు. ఒక సీనియర్ నాయకుడిగా ఆయన లేఖను గౌరవిస్తూ సీఎం కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేశారు. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు ఇంకా ఏం మేలు చేయాలా అని జగన్ ఆలోచిస్తున్నారు. దానికి భిన్నంగా చంద్రబాబు కుప్పంలో దాడులు, దౌర్జన్యాలు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలతో దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు.

టిడిపి నుంచి నలుగురు ఎంపీలు బిజెపిలో చేరారు. నేటికీ టిడిపి కోవర్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. వారంతా కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు చేసి చంద్రబాబు సెక్యూరిటీని పెంచేలా చేశారు. ఒక డిఎస్పీ సారథ్యంలో 12 మంది సిబ్బంది పనిచేస్తే, దానిని ఇప్పుడు ఒక డిఐజి కేడర్ అధికారి సారథ్యంలో 24 మంది సిబ్బందిని సెక్యూరిటీగా పనిచేసేలా వేయించుకున్నారు. ఇటువంటి సెక్యూరిటీ కోసమే కుప్పంలో చంద్రబాబు గలాటా చేశాడా అని ప్రజలు అనుకుంటున్నారు.

బాబు పర్యటించిన ఆ రోజులన్నీ చీకటి రోజులే..
చంద్రబాబు పర్యటించిన పదిహేను రోజులు కుప్పం చరిత్రలో బ్లాక్ డేస్. కుప్పంలో మీరు చేసిన దాడిలో మా మహిళా ఎంపిపి ఎలా విలపించిందో ప్రజలు చూశారు. కుప్పంలో వైఎస్ఆర్సీపి జెండాను కాదు, ఏకంగా ప్రజలు నిన్నే పీకేసే పరిస్థితి వస్తుంది. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి అన్ని స్థానాలు గెలుస్తుంది. మా జెండా పీకేయడం కాదు, నిన్ను ప్రజలు పీకేసే పరిస్థితి ఉంది, గుర్తుంచుకో అని హెచ్చరిస్తున్నాం.
కుప్పంలో ట్రాక్టర్ పై అన్న క్యాంటిన్ పెట్టిన చంద్రబాబుకు కరోనా సమయంలో ప్రజల గురించిన ఆలోచన ఎందుకు రాలేదు. పిల్లికి బిచ్చం పెట్టని చంద్రబాబు ట్రాక్టర్ పై అన్న క్యాంటిన్ పెట్టాడు. కరోనా సమయంలో కనీసం కుప్పం వైపు కూడా చూడకుండా హైదరాబాద్ లోనే ఉండిపోయాడు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై ఆయన కుటుంబీకులు, సంబంధీకులు ఆయనకు మంచి వైద్యం అందించాలని కోరుతున్నాం. మళ్ళీ కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యే అవ్వడం కల్ల.

LEAVE A RESPONSE