– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ మేనేజ్మెంట్ల అసోసియేషన్లు కాలేజీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నిర్ణయానికి బిజెపి సంపూర్ణ మద్దతు తెలుపుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కాలేజీలకు భారీగా బకాయిలు పెరగడంతో, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితికి వచ్చాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ చర్య వల్ల ఏర్పడిన పరిస్థితి.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయలు 8 వేల కోట్లు పైగా ఉన్నప్పటికీ, రెండేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల చేయడం లేదు. ఫీజు రీ యింబర్స్మెంట్ లేకపోవడం వలన ప్రైవేట్ కాలేజీలు ప్రొఫెసర్లు, లెక్చరర్స్, టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం గత ఆరు నెలలుగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతూ “మేమ త్వరలో పరిష్కారం చేస్తాం” అని చెప్పినా, ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం లేదా పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డులు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఈ వాగ్దానం ఇప్పటి వరకు అమలుకావడం లేదు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీదే ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మరింత కూలిపోయే పరిస్థితికి లోనవుతోంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రూ. 1000 కోట్లు నిధులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాని రాష్ట్రంలో పరిస్థితి రిటైర్డ్ టీచర్లకు పెన్షన్లు కూడా ఇవ్వని పరిస్థితి దాపురించింది.
భారతీయ జనతా పార్టీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు పలుకుతోంది. కొత్త యూనివర్సిటీలకు కనీసం భవన నిర్మాణాలు చేయకపోవడం సబబుకాదు.
ఇప్పటికైనా అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఈ నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తోంది. విద్యా వ్యవస్థను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయల్ని వెంటనే విడుదల చేయాలని, కొత్త భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ దృష్టికి ఇది తీసుకువస్తున్నామని తెలిపారు.